రిజిస్ట్రేషన్ బాదుడు!
ABN, First Publish Date - 2021-07-14T08:18:21+05:30
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. మూడు కేటగిరీల్లో 30నుంచి 40 శాతం వరకు భూముల విలువలు పెరుగుతాయి. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటే రిజిస్ట్రేషన్
రిజిస్ట్రేషన్ భూముల మార్కెట్ విలువ 30-40% పెంపు!
రిజిస్ట్రేషన్ చార్జీలు 6 నుంచి 7.5 శాతానికి
వ్యవసాయం, వ్యవసాయేతరంలోనూ
3 కేటగిరీలుగా ఆస్తుల విలువ పెరుగుదల
పట్టణ ప్రాంతాల వారికే అధిక భారం
మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం
నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం
మునిసిపాలిటీల్లో ల్యాండ్ పూలింగ్‌తో లే-అవుట్లు
రాజధాని మున్సిపాలిటీల తాగునీటికి 1,200 కోట్లు
గురుకులాల్లో స్థానికులకు 50 శాతం సీట్లు
ఉద్యోగ ఖాళీల భర్తీకి ఏటా జాబ్ క్యాలెండర్
కొత్త జిల్లాలకు పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు
నేడు మళ్లీ కేబినెట్... ఖాళీ పోస్టుల భర్తీపై చర్చ
కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఎంత మంది?
శాఖల వారీగా ఖాళీల వివరాలు సమర్పించండి
అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. మూడు కేటగిరీల్లో 30నుంచి 40 శాతం వరకు భూముల విలువలు పెరుగుతాయి. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటే రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా 6% నుంచి 7.5 శాతానికి పెంచారు. ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చేసిన మార్కెట్ విలువల పెంపు సిఫారసులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కమిటీ చేసిన సిఫారసులన్నింటినీ దాదాపుగా కేబినెట్ ఓకే చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్తులపై స్వల్ప మార్పులు చేయగా, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులపై ఎక్కువ మొత్తంలో విలువలు పెంచింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ జరిగింది.
ఈ సమావేశంలో పలు అంశాలతో పాటు మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉద్యోగ ఖాళీలపై సుదీర్ఘంగా ఏడు గంటలపాటు చర్చించారు. రాష్ట్రంలో మార్కెట్ విలువలను పెంచాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. 2013లో పెంచిన మార్కెట్ విలువలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఆదాయాన్ని మరింత రాబట్టాలంటే వీటిని పెంచాలంటూ స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఆదాయ వనరుల సమీకరణ సబ్ కమిటీ కూడా విలువలను పెంచాలంటూ సిఫారసు చేసింది. ఈ మేరకు కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంది. విలువలను 30-40 శాతం మేర పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. మూడు కేటగిరీలుగా దీనిని అమలు చేయనుంది. దీనికి సంబంధించి బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. వీటితో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయి. ప్రస్తుతం రిజిస్టర్ చేస్తున్న డాకుమెంట్లపై 6% రిజిస్ట్రేషన్ చార్జీల(4% స్టాంపు డ్యూటీ, 1.5% ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, 0.5% రిజిస్ట్రేషన్ చార్జీ)ను వసూలు చేస్తున్నారు. దీనిని 7.5 శాతానికి పెంచాలంటూ రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదించింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ 7.5 శాతానికి పెంచారు. రిజిస్ట్రేషన్ల శాఖ సిఫారసును కేబినెట్ యథాతథంగా ఆమోదించింది. ఇక నుంచి 7.5 శాతం మేర రిజిస్ట్రేషన్ చార్జీలు అమలు కానున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా బుధవారం వెలువడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో కరోనా మూడు ముప్పు పొంచి ఉన్న దరిమిలా కేబినెట్ దీనిపై చర్చించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... ఇప్పటికే చాలా వరకు కరోనాను కట్టడి చేశామన్నారు. సరిహద్దు జిల్లాల్లోనే పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. ప్రస్తుతం బోనాలు, పండుగలు వంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి సందర్భంగా ప్రజలు గుమిగూడుతున్నారని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని, ప్రజలు జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించడం లేదని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ ఇబ్బందులు తప్పవని అన్నారు. ఈ దృష్ట్యా కరోనా విజృంభించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఉల్లంఘనలను ఉపేక్షించకూడదని సూచించారు. ప్రస్తుత వర్షాకాలంలో జ్వర సర్వేను మరోసారి చేపట్టాలని చెప్పారు. ఉద్యోగాల భర్తీ అంశంపైన కూడా కేబినేట్ సుదీర్ఘంగా చర్చించింది. శాఖల వారీగా ఖాళీల వివరాలను తీసుకురావాలని ఆదేశించింది. ప్రస్తుతం ఏ ఏ శాఖల్లో ఎంత మంది కాంట్రాక్టు/ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారో వివరాలను అందించాలని సీఎం ఆదేశించారు.
నేడు మళ్లీ కేబినెట్ భేటీ
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే అంశంపై బుధవారం కేబినెట్ మరోసారి సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సమావేశం జరుగుతుంది. అన్ని శాఖల కార్యదర్శులు ఖాళీల వివరాలతో సమావేశానికి హాజరు కావాలని కేబినెట్ ఆదేశించింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశాలున్నాయి.
భూ సమీకరణ
మునిసిపాలిటీల్లో భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) విధానం ద్వారా భూమిని సేకరించి ఇళ్ల స్థలాల లే-అవుట్లు వేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని మునిసిపల్ అధికారులను ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా కొత్త జిల్లాలకు పోస్టులను, అధికారులను కేటాయించాలని, ఖాళీ పోస్టులను గుర్తించి, వెంటనే భర్తీ ప్రక్రియను చేపట్టాలని ఆదేశించింది. అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్(జాబ్ క్యాలెండర్)’ను తయారు చేయాలని చెప్పింది. క్యాలెండర్‌కు అనుగుణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని సూచించింది.
హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్యను తీర్చేందుకు ఇప్పటికే విడుదల చేసిన నిధులకు అదనంగా మరో రూ.1200 కోట్లను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఆయా నియోజకవర్గాలకు చెందిన స్థానిక విద్యార్థినీ విద్యార్థులకు సగం సీట్లు కేటాయించాలని ఆదేశించింది. సమావేశంలో మొదట పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై చర్చించారు. పంచాయితీరాజ్, మున్సిపల్ శాఖలు నివేదికలు సమర్పించాయి. పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం సం తృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Updated Date - 2021-07-14T08:18:21+05:30 IST