ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మగౌరవ భవనాలకు నిధులేవీ!

ABN, First Publish Date - 2021-02-25T07:37:14+05:30

రాష్ట్రంలోని వివిధ కులాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని, తద్వారా వారి గౌరవాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటికీ ఆ మాటను నిలబెట్టుకోవడంలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హామీలు, శంకుస్థాపనలకే ప్రభుత్వం పరిమితం.. 
  • గొల్ల కురుమ, ముదిరాజ్‌ భవనాలకు శంకుస్థాపన
  • క్రిస్టియన్‌ భవన నిర్మాణానికి టెండర్లకు పిలుపు
  • ఇతర కులాల ఆత్మగౌరవ భవనాల ఊసే లేదు
  • సర్కారు తీరుపై కుల సంఘాల్లో అసంతృప్తి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ కులాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని, తద్వారా వారి గౌరవాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడతామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటికీ ఆ మాటను నిలబెట్టుకోవడంలేదు. కుల సంఘాలకు హామీలు ఇచ్చిందే తప్ప.. భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వడంలేదు. ఒకటి రెండు ఆత్మగౌరవ భవనాలకు శంకుస్థాపన చేయడం వరకే సర్కారు పరిమితమైంది. నిధుల కొరత లేదని, వెంటనే భవనాల నిర్మాణం పూర్తి చేయాలని 2017 డిసెంబరులో గొల్ల కురుమ సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తిరిగి 2018 ఆగస్టు 25న ప్రగతి భవన్‌లో ఆత్మగౌరవ భవనాలపై సమీక్ష సందర్భంగా కూడా ఈ విషయం చెప్పారు. కానీ, రెండేళ్లయినా.. ఒక్క ఆత్మ గౌరవ భవనం కూడా పూర్తి కాలేదు. రెండు కులాల భవనాలకు మాత్రమే శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. క్రిస్టియన్‌ భవన్‌కు టెండర్లు పిలిచారు తప్ప.. మరో అడుగు ముందుకు పడలేదు. 


2018లో రెండో దఫా అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న సందర్భంగా రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న బీసీ కులాలను ఆకట్టుకోవాలన్న యోచనతో ఆయా కులాలకు ‘ఆత్మ గౌరవ భవనాల’ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెర మీదకు తెచ్చారు. కోకాపేట, ఉప్పల్‌ భగాయత్‌, మల్కాజిగిరి ప్రాంతాల్లో 78 ప్రధాన, ఉప, సంచార కులాలన్నింటికీ కలిపి 82.30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రూ.95.25 కోట్ల నిధులను మంజూరు చేశారు. సంఖ్యాపరంగా కులాలను బట్టి 20 గుంటలు, ఎకరం, రెండెకరాలు, ఐదెకరాలు, గరిష్ఠంగా 10 ఎకరాల చొప్పున భూమిని కేటాయించారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు మంజూరు చేశారు. కానీ, నిర్మాణ పనులేవీ ప్రారంభం కాలేదు. దీంతో కుల సంఘాలు అసహనంతో, అసంతృప్తితో ఉన్నాయి. 


జీవోల జారీతోనే సరి!

ఆత్మ గౌరవ భవనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు జీవోలు జారీ చేసిందే తప్ప... విడుదల చేయడం లేదు. గొల్ల కురుమ భవనానికి 2017 డిసెంబరులో సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయగా, ముదిరాజ్‌ భవనానికి ఈ ఏడాది జనవరి 11న మంత్రులు ఈటల రాజేందర్‌, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ శంకుస్థాపన చేశారు. మిగతా భవనాలకు శంకుస్థాపన కూడా జరగలేదు. ఆయా కుల సంఘాలు ప్రయత్నిస్తున్నా.. ఫలించడంలేదు. ఇక కోకాపేటలో లే-అవుట్‌ స్థాయిలోనే ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ముదిరాజ్‌, మున్నూరుకాపు, గౌండ్ల, గొల్ల కురుమ, సగర, పద్మశాలి, బసవేశ్వర, ఆరె కటిక, భట్రాజు, దూదేకుల, రంగరి, గాండ్ల, పెరిక కులాలతో పాటు ఇస్లామిక్‌ స్టడీస్‌, క్రిస్టియన్‌ భవనాలకు స్థలాలను కేటాయించారు. అయితే క్రిస్టియన్‌ భవన్‌కు, సగర కుల సంఘం భవన్‌కు కేటాయించిన స్థలాల విషయంలో వివాదం తలెత్తింది. తమకు కేటాయించిన స్థలాన్ని క్రిస్టియన్‌ భవన్‌కు మార్చారంటూ సగర సంఘం కోర్టుకు వెళ్లడంతో స్టే ఆర్డర్‌ వచ్చింది. 


నిర్మాణ బాధ్యతలు కుల సంఘాలకు ఇవ్వాలి..

భవనాల నిర్మాణ బాధ్యతలను కుల సంఘాలకే ఇవ్వాలన్న డిమాండ్‌ ఉన్నా.. ప్రభుత్వం పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌, సాంఘిక సంక్షేమ శాఖ మౌలిక సదుపాయాల సంస్థ వంటి సంస్థలతో నిర్మింపజేయాలని నిర్ణయించింది. కానీ, భవనాలను ఆ శాఖలు నిర్మించకుండా.. ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. క్రిస్టియన్‌ భవన నిర్మాణ బాధ్యతలను పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌కు అప్పగిస్తే... ఆ సంస్థ ప్రైవేటు సంస్థల నుంచి నిర్మాణ టెండర్లను ఆహ్వానించి.. ఓ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టంది. అయినా.. పనులు ప్రారంభం కాలేదు. ఇలా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే... ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సరిపోవని, రూ.5-10 కోట్లతో భవనాలు పూర్తి కావాలంటే... కుల సంఘాలకే నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని నేతలు కోరుతున్నారు. తద్వారా తమ కుల వైశిష్ట్యాన్ని, ఆచార సంప్రదాయాలను ప్రతిబింబించేలా భవనాలను నిర్మించుకునే అవకాశముంటుందని చెబుతున్నారు. పైగా.. నిధులు సరిపోకపోతే కుల సంఘాల నుంచి మరికొంత సమకూర్చుకునే వీలుంటుందని అంటున్నారు. 

Updated Date - 2021-02-25T07:37:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising