కంది.. లేదిక రంది
ABN, First Publish Date - 2021-02-13T05:40:28+05:30
కంది పంట రైతులకు సిరులు కురిపిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధరకు మించి రేటు లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర క్వింటాకు రూ.6వేలు ఉండగా, మార్కెట్‌లో రూ.6,500 నుంచి రూ.7వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.
దిగుబడి తగ్గడంతో పెరిగిన ధర
రూ.6వేల నుంచి రూ.7వేలు పలుకుతున్న రేటు
కొనుగోలుకు పోటీపడుతున్న వ్యాపారులు
సూర్యాపేట సిటీ: కంది పంట రైతులకు సిరులు కురిపిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధరకు మించి రేటు లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర క్వింటాకు రూ.6వేలు ఉండగా, మార్కెట్‌లో రూ.6,500 నుంచి రూ.7వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది కంది దిగుబడి తగ్గడంతో, మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. దీంతో ధర ఎక్కువైనా కొనుగోలు చేసేందుకు వ్యాపారులు మొగ్గుచూపుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కంది సాగు విస్తీర్ణం ఏటా పెరుగుతోంది. 2019 వానాకాలం సీజన్‌లో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 16,692 ఎకరాల్లో కంది పంట సాగైంది. 2020 వా నాకాలంలో 19,039 ఎకరాల్లో కందిని రైతులు సాగు చేశారు. నల్లగొండ జిల్లాలో 2019 వానాకాలంలో 14,351 ఎకరాలు, 2020లో 21,154 ఎకరాల్లో కంది సాగైంది. యాదాద్రి జిల్లాలో 2019 వానాకాలం సీజన్‌లో 24,966 ఎకరాలు, 2020లో 45,875 ఎకరాల్లో కంది పంటను రైతులు సాగు చేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏటా కంది సాగు పెరుగుతోంది.
తగ్గిన దిగుబడే కారణమా?
కంది ధర మార్కెట్‌లో రూ.7వేలు పలుకుతుండగా, దీనికి దిగుబడి తగ్గడమే కారణమని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. వరుస వర్షాల కారణంగా కంది పూత రాలింది. ఆ తరువాత చీడపీడలు ఆశించడంతో దిగుబడి తగ్గింది. దీంతో కందులకు మార్కెట్‌లో డిమాండ్ ఉండటంతో ధర ఎక్కువ చెల్లించేందుకు కూడా వ్యాపారులు ముం దుకు వస్తున్నారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నూతన సాగు చట్టాలతో వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కడైనా కొనుగోలు, విక్రయం, నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడటంతో వ్యాపారులు భవిష్యత్తులో కందులకు డిమాండ్, ధర పెరుగుతుందని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు.
రహస్య టెండర్లతో పోటీ
కందుల కొనుగోలుకు వ్యాపారులు ధరల విషయంలో పోటీ పడుతున్నారు. రూ.6వేలకు తగ్గకుండా ధర నిర్ణయిస్తున్నారు. ఎక్కువ ధరకు కోట్ చేస్తుండటంతో వ్యాపారుల మధ్య పోటీతత్వం పెరుగుతోంది. జిల్లాలో అన్ని వ్యవసాయ మార్కెట్లలో రహస్య టెండర్లు నిర్వహిస్తుండటంతో ఒక వ్యాపారి కోట్ చేసిన ధర మరొకరికి తెలిసే అవకాశం లేదని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కందులకు మరింత ధర పెరిగే అవకాశం ఉందంటున్నారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో జనవరి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు 9,197 బస్తాల కందులను వ్యాపారులు కొనుగోలు చేయగా, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో 24,450క్వింటాళ్లు కొనుగోలుచేశారు. వీటిలో సింహభాగం రూ.6వేలకు మించి ధర పలికింది. సూర్యాపేట, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లకు నిత్యం 2వేల బస్తాలకు పైగా కందులు వస్తున్నాయి. మద్దతు ధరకు మించి రేటు వస్తుండటంతో రైతులు ఆనందంగా మార్కెట్ల బాట పడుతున్నారు.
వ్యాపారుల మధ్య పోటీతో ఇలా : మేకల శ్రీశైలం, లింగంపల్లి, నూతనకల్ మండలం
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారుల మఽధ్య పోటీ పెరిగి అధిక ధర చెల్లిస్తున్నారు. కంది పంట దిగుబడి తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరిగింది. 8 బస్తాల కందులు మార్కెట్‌కు తీసుకు రాగా, క్వింటాకు రూ.6,746 ధర వచ్చింది.
చాలాకాలం తర్వాత ఈ ధర : జెటంగి అంజి, తాళ్లసింగారం,ఆత్మకూర్(ఎస్) మండలం
మార్కెట్లలో చాలాకాలం తర్వాత రైతులకు మద్దతు ధరకు మించి రేటు లభిస్తోంది. కందులకు డిమాండ్ పెరిగింది. 6 బస్తాల కందులను మార్కెట్‌కు తీసుకొచ్చా. క్వింటాకు రూ.6,060 ధర వచ్చింది. వ్యాపారులు ఎక్కువ ధరకు కందులు కొనుగోలు చేస్తుండటంతో రైతులు లాభపడుతున్నారు.
కందుల ధర ఇలా..
సూర్యాపేట, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లలో ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు అత్యధికంగా క్వింటా కందులకు రూ. 7,092 ధర పలికింది. ఈ నెలలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో 12 రోజులపాటు క్వింటా కందులకు పలికిన ధరలు ఇలా...
తేదీ ధర
(రూ.)
1న 5,936
2న 6,039
3న 6,110
4న 6,242
5న 6,762
6న 6,681
8న 7,092
9న 7,081
10న 6,919
12న 6,863
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌లో..
తేదీ ధర
9న 6,979
10న 6,893
12న 7,059
Updated Date - 2021-02-13T05:40:28+05:30 IST