నానో యూరియా సాధారణ రైతుబిడ్డ విజయం:మంత్రి నిరంజన్ రెడ్డి
ABN, First Publish Date - 2021-07-31T21:56:51+05:30
బయో (నానో) టెక్నాలజీలో ఏడేళ్లపాటు అమెరికాలో పరిశోధనలు చేసి తన జానాన్ని, తన పరిశోధనాఫలాలు భారత దేశానికే ఉపయోగ పడాలన్న తపనతో తిరిగి వచ్చి, నానో యూరియాను కనిపెట్టిన శాస్రవేత్త రమేష్ రాలియాను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు.
హైదరాబాద్: బయో (నానో) టెక్నాలజీలో ఏడేళ్లపాటు అమెరికాలో పరిశోధనలు చేసి తన జానాన్ని, తన పరిశోధనాఫలాలు భారత దేశానికే ఉపయోగ పడాలన్న తపనతో తిరిగి వచ్చి, నానో యూరియాను కనిపెట్టిన శాస్రవేత్త రమేష్ రాలియాను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అభినందించారు. దేశానికి వచ్చాక ఆయన ఇఫ్కోలో చేరి మూడేళ్లపాటు పరిశోధనలుచేసి లిక్విడ్ నానో యూరియాను ఆయన కనిపెట్డడం గర్వకారణమని అన్నారు.నానో యూరియా సాధారణ రైతుబిడ్డ విజయమని మంత్రి కొనియాడారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ జిల్లా కలోల్ లో ఇఫ్కో యూరియా, నానో యూరియా తయారీ ప్లాంట్లను మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, అధికారులను అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా ఇఫ్కో వైస్ చైర్మన్, జాతీయ సహకార సంఘాల అధ్యక్షులు, మాజీ ఎంపీ దిలీప్ సంగానియా, ఇఫ్కో కలోల్ యూనిట్ హెడ్ ఇనాందార్, నానో యూరియా సృష్టికర్త, శాస్త్రవేత్త, జీఎం రమేష్ రాలియా మంత్రి నిరంజన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 500 ఎంఎల్ లిక్విడ్ నానో యూరియా బాటిల్ ను 127 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే ఎకరాకు సరిపోతుందని, కేవలం రూ.240 కి లభించే ఈ బాటిల్ మూలంగా ప్రభుత్వాల మీద పెద్ద ఎత్తున సబ్సిడీ భారం తప్పుతుందని అన్నారు. ఇఫ్కో భారత రైతాంగ సహకార సంస్థ, ఇది ప్రపంచంలోనే అతిపెద్దదని, అదీ మనది కావడం మనకు గర్వకారణమని అన్నారు.
ఇఫ్కో సంస్థ పరిశోధనల నుండి ప్రపంచ పేటెంట్ కలిగిన నానో యూరియా రావడం దానిని ప్రపంచానికి అందించడం మన దేశ సౌభాగ్యానికి తోడ్పడుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.ఇది వ్యవసాయంలో ఎరువుల వాడకంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతుందని, భవిష్యత్ అంతా నానో టెక్నాలజీదేనని చెప్పారు.నానో యూరియాతో భూసారం పెరగడంతో పాటు, పంట దిగుబడి శాతం సాధారణం కన్నా 8 శాతం అధికంగా ఉంటుందన్నది పరిశోధనలలో తేలిందన్నారు.
ఈ సందర్భంగా దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ పెట్టండని నిరంజన్ రెడ్డి వారిని కోరారు. ప్రభుత్వపరంగా భూమితో పాటు ఇతర సదుపాయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ , పరిశ్రమల మంత్రి కేటీఆర్ అండతో అన్ని రకాల సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.గుజరాత్ లోని గాంధీనగర్ కలోల్ ఇఫ్కో యూనిట్ లో రోజుకు లక్షా 50 వేల నానో యూరియా బాటిళ్ల ఉత్పత్తి సామర్ద్యం కలిగి వుందని తెలిపారు.
Updated Date - 2021-07-31T21:56:51+05:30 IST