యూరోపియన్ దేశాల పెట్టుబడులకు ప్రత్యేక ప్రాధాన్యం
ABN, First Publish Date - 2021-10-21T08:52:06+05:30
యూరోపియన్ దేశాలు తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధమైతే ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు.
యూరోపియన్ బిజినెస్ గ్రూప్ వెబినార్‌లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): యూరోపియన్ దేశాలు తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధమైతే ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. యూరోపియన్ పారిశ్రామికవేత్తలతో కూడిన బిజినెస్ గ్రూప్ బుధవారం నిర్వహించిన వెబినార్‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో వ్యాపార అనుకూలతలు, వివిధ రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలు, పారిశ్రామిక అనుమతులకు అమలు చేస్తున్న టీఎ్‌స-ఐపాస్ విధానం గురించి వివరించారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వినూత్న విధానాలతో తెలంగాణ గత ఏడేళ్లలో అద్భుతమైన పురోగతి సాధించిందని, దేశ జీడీపీలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన వాటాను సమకూర్చుతోందన్నారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా ఎంచుకుని ఆయా రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాలతోనే కాకుండా ఈ రంగాల్లో దూసుకుపోతున్న పలు దేశాలతోనూ పోటీ పడేందుకు సిద్థంగా ఉందన్నారు. భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ఫార్మా సిటీ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, మెడికల్ డివైస్ పార్క్ వంటి వాటి గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీల అవసరాలకు అనుగుణంగా స్థలం సిద్ధంగా ఉందన్నారు. మౌలిక సదుపాయాలతోపాటు మానవ వనరుల అభివృద్ధి, వారి శిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.
వినయ్ తుమ్మలపల్లికి శుభాకాంక్షలు: కేటీఆర్
యూఎస్ ట్రేడ్ అండ్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్, సీఓఓగా వినయ్ తుమ్మలపల్లిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. ఆయన నియామకంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వినయ్ తుమ్మలపల్లికి ట్విటర్ ద్వారా బుధవారం అభినందనలు తెలిపారు.
Updated Date - 2021-10-21T08:52:06+05:30 IST