మాస్కుఉంటేనే ఓటు!
ABN, First Publish Date - 2021-04-29T06:06:21+05:30
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు హైఅలర్ట్‌గా మారాయి. పూర్తి స్థాయి కొవిడ్ నిబంధనలను అనుసరించి రేపటి బ్యాలెట్ పోలింగ్‌ను నిర్వహించేలా ప్రణాళిక రచించారు.
రేపు సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు
ఓటింగ్ శాతంపై ప్రభావం చూపనున్న కరోనా భయం
గత ఎన్నికల్లో 71.6 శాతం నమోదు
ప్రస్తుతం 1,00,678 మంది ఓటర్లు
192 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వినియోగం
ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఏప్రిల్ 28: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు హైఅలర్ట్‌గా మారాయి. పూర్తి స్థాయి కొవిడ్ నిబంధనలను అనుసరించి రేపటి బ్యాలెట్ పోలింగ్‌ను నిర్వహించేలా ప్రణాళిక రచించారు. మాస్కు లేనిదే పోలింగ్ కేంద్రం దరిదాపుల్లోకి కూడా రాకుండా నిర్ణయించారు. గేటు దగ్గర స్ర్కీనింగ్ టెస్టు కూడా చేసి జ్వరాన్ని అంచనా వేయనున్నారు. అడుగడుగునా శానిటైజర్ చేయడంతో పాటు ప్రతీ కేంద్రంలో ఒక హెల్త్ సెం టర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కరోనా రెండో దశ వేగం పుంజుకున్న క్రమంలో ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
కొవిడ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్
రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో కొవిడ్ పేషెంట్ల కోసం అదనంగా ఒక గంట సమయం ఇచ్చి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు. అయితే కరోనా రెండో దశ ఉధృతంగా ఉండడంతో వృద్ధులతో పాటు కొవిడ్ పేషెంట్లకు కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. మొత్తం 192 పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేయగా ఇందులో కేవలం నలుగురు మాత్రమే కొవిడ్ పేషెంట్లు ఉన్నారు. వీరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇప్పటికే ఓటుహక్కు వినియోగించుకున్నారు. మిగితా పెషెంట్లు ముందుకు రాలేదు. అదే విధంగా 167 మంది వృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.
90.67 శాతం పోల్‌చీటీల పంపిణీ
సిద్దిపేట పట్టణంలో 1,00,678 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 90.67 శాతం మందికి పోల్ చీటీలు పంపిణీ చేశారు. కొందరు హైదరాబాద్, ఇతర ప్రాంతా ల్లో నివాసం ఉంటున్నారు. వీరితో పాటు స్థానికంగా కూడా మరికొందరికి పోల్ చీటీలు అందలేదు. గురువా రం కూడా పోల్ చీటీలను పంపిణీ చేయనున్నారు. శుక్రవారం పోలింగ్‌కేంద్రాల వద్ద కూడా పంపిణీ చేసేలా చ ర్యలు చేపట్టారు. వార్డుల విభజనతో ఇప్పటికీ ఆయా వా ర్డుల్లో ఓటర్లను గుర్తించడంపై గందరగోళం నెలకొన్నది. అయితే అందరి ఫోన్ నంబర్లు ఉండడంతో నేరుగా కలవ డం కంటే ఫోన్ ద్వారానే ఓటర్లను సంప్రదిస్తున్నారు. వా యిస్‌కాల్స్, మెసేజ్‌లతో గుర్తులను ప్రచారం చేస్తున్నారు.
నిఘా నీడలో పోలింగ్
మున్సిపల్ పోలింగ్‌పై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. కరోనా నిబంధనలు పాటించాలన్నా, ప్రశాంతంగా పోలింగ్ సాగాలన్నా పోలీసులు ప్రత్యక్షంగా ఉంటేనే సాధ్యమవుతుందని అధికారులు భావించారు. అందుకే 465 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. సిద్దిపేటలోని 60 ప్రాంతాల్లో గల 129 పోలింగ్ కేంద్రాల్లో విధులు కేటాయించారు. ఇందులో 36 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. అవసరం దృష్ట్యా మరికొందరిని కూడా రంగంలోకి దింపే అవకాశాలు లేకపోలేదు. దీనికి తోడు ప్రతీ పోలింగ్ కేంద్రంలో వెబ్ క్యాస్టింగ్, జియో ట్యాగింగ్‌ను అమలు చేస్తున్నారు.
పోలింగ్ శాతంపై ప్రభావం
2016లో జరిగిన సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో 71.6 శాతం పోలింగ్ నమోదైంది. సాధారణ పరిస్థితుల్లోనే దాదాపు 29శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులు పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంచ నా వేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అభ్యర్థులకు వింత అనుభవాలు ఎదురయ్యాయి. కరోనా నేపథ్యంలో తమ ఇంటికి ఓట్లు అడిగేందుకు రావొద్దని, ఫోన్ల ద్వారానే ఓట్లు అడగాలని కొందరు ఇళ్ల ముందు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఇలాంటి ఓటర్లు పోలింగ్ కేంద్రం వరకు వచ్చి ఓటు వేస్తారనడం సందేహాస్పదమే. దీనికి తోడు ఓటు కోసం వెళ్లి కరోనా బారిన పడడం అవసరమా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. అయితే సామాజిక బాధ్యతగా ఓటు వేయాలని, నిబంధనలు పాటిస్తే సురక్షితంగా ఉండొచ్చని అధికారులు గట్టిగా సూచిస్తున్నారు.
Updated Date - 2021-04-29T06:06:21+05:30 IST