ముసురేసింది..
ABN, First Publish Date - 2021-08-31T05:26:12+05:30
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం ముసురుతో కూడిన వర్షం కురిసింది.
సంగారెడ్డి జిల్లాలో చిరుజల్లులు
కొన్ని మండలాల్లో భారీ వర్షం
అత్యధికంగా జహీరాబాద్ మండలం
సత్వార్‌లో 114.4 మిల్లిమీటర్ల వర్షపాతం
నీటమునిగిన పొలాలు.. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
సంగారెడ్డిటౌన్/జహీరాబాద్/ నారాయణఖేడ్, ఆగస్టు 30: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం ముసురుతో కూడిన వర్షం కురిసింది. జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలు మినహా మిగతా అన్ని మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. జహీరాబాద్ మండలంలోని సత్వార్‌లో అత్యధికంగా 114.4 మిల్లిమీటర్లు, అత్యల్పంగా మునిపల్లిలో 6.4 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. న్యాల్‌కల్, మనూర్, సిర్గాపూర్, ఝరాసంగం, అందోల్, సంగారెడ్డి, గుమ్మడిదల, జిన్నారం, పటాన్‌చెరు, అమీన్‌పూర్, కంది, వట్‌పల్లి, మునిపల్లి, పుల్‌కల్, సదాశివపేట, హత్నూర, కంగ్టి, చౌటకూర్ మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. చిరుజల్లులకు మట్టిరోడ్లు చిత్తడిగా మారాయి. ఆయా మండలాల్లో పంటలు నీట మునిగాయి.
జహీరాబాద్ డివిజన్‌లో భారీ వర్షం
జహీరాబాద్ డివిజన్‌లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో కాలనీవాసులకు ఇబ్బందులు తప్పలేదు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని జహీరాబాద్ మండలం సత్వార్‌లో అత్యధికంగా 114.4 మిల్లిమీటర్లు, అలాగే మల్‌చెల్మలో 76.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా పరిశీలిస్తే జహీరాబాద్‌లో 48.0 మిల్లిమీటర్లు, కోహీర్‌లో 43.2 మిల్లిమీటర్లు, ఝరాసంగంలో 16.8 మిల్లిమీటర్లు, న్యాల్‌కల్‌లో 22.4 మిల్లిమీటర్లు, మొగుడంపల్లి - 64.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణఖేడ్‌లో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వ ర్షం కురిసింది. అనంతరం చిరుజల్లులు కురిశాయి. వాగులు ఉధృతంగా ప్రవహించాయి. ప్రస్తుతం కోత దశల్లో ఉన్న పెసర, మినుము, పత్తి, ఇతర పంటలకు వర్షం నష్టాన్ని చేకూరుస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్
సంగారెడ్డిరూరల్, ఆగస్టు30: ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్ జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, నీటిపారుదలశాఖాధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వర్షాల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులందరూ తమ హెడ్‌క్వార్టర్లలోనే ఉండి పరిస్థితులను పరిశీలించాలన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
వర్షాల కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు పోలీ్‌సశాఖ సిద్ధంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. ప్రమాద ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం నియంత్రించాలని డీజీపీ సూచించారు. అనంతరం సంగారెడ్డి నుంచి అదనపు కలెక్టర్ రాజర్షిషా మాట్లాడారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్య్టా జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించేలా జాయింట్ టీమ్ అన్నింటిని అప్రమత్తం చేశామని తెలిపారు. టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఆయా శాఖల అధికారులకు తగు సూచనలు జారీ చేశామని సీఎస్ సోమే్‌షకుమార్‌కు వివరించారు. అధికారులందరూ జిల్లాకేంద్రంలోని హెడ్‌క్వార్టర్‌లోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలను తీసుకునేలా చర్యలు చేపట్టాలని వివరించారు. జిల్లాలో ఎలాంటి సంఘటనలూ జరగకుండా అన్ని ఫ్రీకాషన్స్ తీసుకుంటున్నామని ఎస్పీ రమణకుమార్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నీటిపారుదల శాఖ, రెవెన్యూ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రెండు రోజులు భారీ వర్షాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మెదక్ కలెక్టర్ హరీశ్
మెదక్‌రూరల్, ఆగస్టు 30: రానున్న రెండు రోజుల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని సూచించారు. ఇళ్లలోనే ఉండాలని కోరారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో సమస్యలుంటే తహసీల్దార్, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు తెలియ జేయాలన్నారు. అత్యవసరం అయితే కలెక్టరేట్‌లోని కాల్‌సెంటర్ 223360 లేదా 100 కాల్ చేయాలని తెలిపారు.
Updated Date - 2021-08-31T05:26:12+05:30 IST