ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వరి’ వదలం

ABN, First Publish Date - 2021-12-09T04:51:13+05:30

యాసంగిలో వరిసాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు పదేపదే సూచిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌లో నారుమడి సిద్ధం చేసిన రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరిసాగు వద్దంటున్న  ప్రభుత్వం 

అయినా సాగుకే సిద్ధమైన రైతులు

ప్రత్యామ్నాయ పంటలపై పెదవి విరుపు

ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 8: యాసంగిలో వరిసాగు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు పదేపదే సూచిస్తున్నారు. యాసంగిలో పండించే ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పడంతో రాష్ట్రంలో పరిణామాలు మారాయి. ప్రతీ సీజన్‌లో వరిసాగునే నమ్ముకున్న రైతులను పంట మార్పిడి చేసుకోవాలని స్థానిక వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ ధాన్యం పండించినా కొనుగోలు చేసే పరిస్థితి ఉండదని హెచ్చరిస్తున్నారు. దీంతో రైతులంతా అయోమయంలో పడ్డారు. కానీ కొంతమంది రైతులు మాత్రం వరిసాగుకే మొగ్గుచూపుతూ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 

సిద్దిపేట జిల్లావ్యాప్తంగా గత యాసంగి సీజన్‌లో 3లక్షల ఎకరాలకు పైగా వరిసాగు చేశారు. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుల ఫలితంగా జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కాలువల్లో పుష్కలంగా సాగునీరు ఉండడంతో రైతులంతా నాడు వరిసాగుకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లోనూ 3.50 లక్షల ఎకరాల వరిసాగు దాటుతుందని అంచనా వేశారు. కానీ వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచనలిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, 3 లక్షల ఎకరాల్లో పంట మార్పిడి జరగడం అసాధ్యంగా కనిపిస్తున్నది. 

ఒక్క ఎకరంలో కూడా వరిసాగు చేయవద్దని వ్యవసాయ శాఖ అధికారులు నిత్యం స్పష్టమైన సూచనలను చేస్తూనే ఉన్నారు. కానీ రైతులు మాత్రం వరిసాగుకే మొగ్గు చూపిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ 50 శాతానికి పైగా వరిసాగు చేయడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. వేల ఎకరాల్లో వరినాట్ల కోసం దుక్కిదున్ని పెట్టుకుంటున్నారు. చాలా గ్రామాల్లో వరికి సంబంధించిన నారుమడులు దర్శనమిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు వరిసాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. బావులు, చెరువులు, కాలువల్లో పుష్కలంగా సాగునీరు ఉంది. అంతేకాకుండా భూ ఉపరితల జలాలు పెరగడంతో భూములు సైతం జాలువారి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు వేయడం వల్ల ఉపయోగం ఉండదని భావించి వరిసాగునే ఎంచుకుంటున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాల కొరత, మార్కెటింగ్‌ లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. 

వ్యవసాయ అధికారులకు తలనొప్పి

ప్రత్యామ్నాయ పంటలే సాగుచేయాలని గ్రామగ్రామాన ప్రచారం చేస్తున్న వ్యవసాయ అధికారులకు తలనొప్పిగా మారింది. పలు గ్రామాల్లో అధికారులను నిలదీస్తున్నారు. ఇప్పటికిప్పుడు పంట మార్పిడి చేయడం సాధ్యపడదని, మరో ఏడాది సమయం కావాలని కోరుతున్నారు. ఆరుతడి పంటలను ఇప్పటికే సాగుచేయాల్సి ఉండేదని, ఇప్పుడు వేసినా ఫలితం ఉండదని రైతుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లోకి వెళ్లాలంటేనే అధికారులు జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధివిధానాల వల్ల క్షేత్రస్థాయిలో ఆ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

వరి పంటే సాగుచేస్తా

- కరుణాకర్‌రెడ్డి, రైతు, పొన్నాల 

 యాసంగి సీజన్‌లో కొన్నేళ్ల నుంచి వరిపంట మాత్రమే సాగుచేస్తున్నాం. వేరే పంటలు వేయాలంటే మా భూములు అనుకూలించవు. వరిని మార్చి వేరు పంటలు వేయలేము. మాకు కోతుల బెడద కూడా చాలా ఉన్నది. మా తాతముత్తాతల నుంచి వరిపంటే మాకు అలవాటు. ఎలాగైనా మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. 

వరితోపాటు పొద్దు తిరుగుడు సాగు

- మున్నానాయక్‌, మల్చెరువుతండా 

నాకు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. నాలుగు ఎకరాల్లో పొద్దు తిరుగుడు సాగుచేశాను. రెండు ఎకరాల్లో మాత్రమే వరి పంట సాగుకోసం నారు పోశాను. ధాన్యం కొంటారా.. కొనరా అనే అనుమానం ఉండడంతో తక్కువ సాగుచేశాను. ప్రత్యామ్నాయ పంటల కోసం సబ్సిడీపై విత్తనాలు కావాలని అడిగితే ప్రభుత్వం ఇవ్వడం లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 

మా భూములను అప్పగిస్తాం

- భగవాన్‌రెడ్డి, రైతు, బెజ్జంకి

మా భూముల్లో వరి తప్ప వేరే పంట పండదు. ఆరుతడి పంటలు వేద్దామంటే కోతులు, అడవి పందుల బెడద ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ అఽధికారులైతే పంట మార్పిడి చేయాలని చెబుతున్నారు. మా భూముల్లో వారే పంటలు వేసుకుని వచ్చిన లాభాలను వారే ప్రభుత్వానికి ఇచ్చుకోండి. మేము మాత్రం వరి తప్ప వేరే సాగుచేయబోం. 

Updated Date - 2021-12-09T04:51:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising