ఎక్కడికక్కడ అరెస్టులు
ABN, First Publish Date - 2021-10-30T04:32:12+05:30
రైతులు వరి పంట వేయొద్దని కలెక్టర్ వెంకట్రామారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులతో బీజేపీ నాయకులను నిలువరించారు.
బీజేపీ కలెక్టరేట్ ముట్టడి భగ్నం
జిల్లా వ్యాప్తంగా ముందస్తు అరెస్టులతో నాయకులను అడ్డుకున్న పోలీసులు
కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు
సిద్దిపేట క్రైం/సిద్దిపేట అర్బన్, అక్టోబరు 29 : రైతులు వరి పంట వేయొద్దని కలెక్టర్ వెంకట్రామారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిని పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులతో బీజేపీ నాయకులను నిలువరించారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగింది. కలెక్టర్ వెంకట్రామారెడ్డి జిల్లా రైతాంగానికి క్షమాపణ చెప్పకుంటే 24 గంటల్లో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఎమ్మెల్యే రఘునందన్‌రావు గురువారం సిద్దిపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన విషయం తెలిసిందే. ఆయన పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమయ్యారు. దీంతో జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న బీజేపీ కార్యకర్తలను ఉదయం నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లోనే గృహ నిర్బంధం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డిని అతని ఇంటి నుంచి బలవంతంగా అరెస్టు చేసి రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జిల్లాలో ఉన్న అన్ని మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులను, కార్యకర్తలను ఉదయం 3 గంటల నుంచే ఎక్కడికక్కడే అరెస్టు చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం వరకు బీజేపీ శ్రేణుల అరెస్టులు కొనసాగాయి.
కలెక్టరేట్ వద్ద భారీ బందోబస్తు
బీజేపీ కార్యకర్తలు ఏ సమయంలోనైనా కలెక్టర్ కార్యాలయం వద్దకు రావచ్చు అనే సమాచారంతో పోలీసులు కలెక్టరేట్ గేట్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఉదయమే కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ నాయకులు తొడుపునూరి వెంకటేశం, పత్రి శ్రీనివాస్, కార్తీక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని త్రీ టౌన్‌కు తరలించారు. కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహించే అధికారులను, సిబ్బందిని పోలీసులు తనిఖీ చేశారు. గుర్తింపుకార్డులు ఉన్నవారినే లోపలికి పంపించారు. విధులకు ఆలస్యంగా వచ్చిన సిబ్బందికి గుర్తింపుకార్డులు ఉన్నా సరే లోపలికి అనుమతించకుండా తిరిగి పంపించేశారు. కలెక్టరేట్ భద్రతా నేపథ్యంలోనే సిబ్బందిని లోపలికి అనుమతించలేదని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కలెక్టర్‌పై చర్యలు తీసుకోకుండా శాంతియుతంగా పోరాటం చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం సమంజసం కాదని నేతలు మండిపడ్డారు. అరెస్టు చేసిన బీజేపీ నాయకులను సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లో ఉంచుకొని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
Updated Date - 2021-10-30T04:32:12+05:30 IST