ప్రత్యామ్నాయంపై.. అనాసక్తి
ABN, First Publish Date - 2021-10-30T03:52:33+05:30
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, రైతులు ఆసక్తి చూపడం లేదు. పప్పుదినుసులు, నూనె గింజలు, చిరు ధాన్యాల పంటలు సాగు చేస్తే లాభం రావడంతో పాటు భూసారం కూడా పెరుగుతోందని అధికారులు అవగాహన కల్పిస్తున్నా, మొగ్గుచూపడం లేదు.
వేరుశనగపై దృష్టి సారించని వనపర్తి రైతులు
ప్రభుత్వం ప్రత్యామ్నాయం అంటున్నా పట్టించుకోని వైనం
ఇప్పటికే మొక్కజొన్నను గణనీయంగా తగ్గించిన అన్నదాతలు
అవగాహన లోపం.. మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం కారణాలు
వనపర్తి జిల్లాలో పెరుగుతున్న మినుముల సాగు
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా, రైతులు ఆసక్తి చూపడం లేదు. పప్పుదినుసులు, నూనె గింజలు, చిరు ధాన్యాల పంటలు సాగు చేస్తే లాభం రావడంతో పాటు భూసారం కూడా పెరుగుతోందని అధికారులు అవగాహన కల్పిస్తున్నా, మొగ్గుచూపడం లేదు. విత్తనాలపై సబ్సిడీ ఎత్తేయడం, మార్కెటింగ్ సదుపాయాలు సరిగా లేకపోవడం వంటి కారణాల వల్ల రైతులు గతంలో సాగు చేస్తున్న ప్రత్యామ్నాయ పంటలను సైతం గణనీయంగా తగ్గిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జోగుళాంబ గద్వాల జిల్లాలో పప్పుశనగ, వనపర్తి జిల్లాలో వేరుశనగ సాగు తగ్గించారు. నీటి లభ్యత పెరిగినందున వరి సాగుపైనే మక్కువ చూపుతున్నారు.
- ఆంధ్రజ్యోతి, వనపర్తి/గద్వాల
వరి సాగు తగ్గించాలని, తద్వారా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ప్రభుత్వం చెబుతున్నా రైతులు ఆ దిశగా ఆసక్తి చూపడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరితో పాటు గతంలో మొక్కజొన్న సాగు ఎక్కువగా ఉండేది. ఖరీఫ్ సీజన్‌లో రెండో ప్రధాన పంటగా రైతులు మొక్కజొన్నను సాగు చేసేవారు. కానీ గడిచిన కొన్నేళ్లుగా నీటి లభ్యత పెరిగింది. దీంతోపాటు గత సంవత్సరం ప్రభుత్వం మొక్కజొన్నలు వేయొద్దని రైతులకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అసలే సాగు తగ్గించుకుంటూ వస్తున్న రైతులు మొక్కజొన్నపై పూర్తిగా విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా ఖరీఫ్‌లో వర్షాధారంగా సాగయ్యే ఈ ప్రధాన పంట సాగు పూర్తిగా దెబ్బతింది. ఆ స్థానంలో నీటిలభ్యత పెరగడంతో వరిసాగుపైనే రైతులు మక్కువ చూపుతున్నారు. వరి సాగు చేస్తే ఊరిలోనే కొనుగోలు చేస్తుండటంతో రవాణా ఖర్చులు కూడా మిగులుతాయని భావిస్తున్నారు. పైగా శ్రమ తక్కువగా ఉంటుందని, కూలీల కొరత ఉండదని భావిస్తున్నారు. ఫలితంగా ప్రత్యామ్నాయ పంటలపై వైపు చూడటం లేదు.
నడిగడ్డలో తగ్గుతున్న పప్పుశనగ సాగు..
జోగుళాంబ గద్వాల జిల్లాలో రబీలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో పప్పుశనగ ఒకటి. బంగారు పంటలు పండించే నల్లరేగడి భూములు ఈ జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో అధికంగా ఉన్నాయి. దాంతో ఇక్కడ రబీ సీజన్‌లో పప్పుశనగను రైతులు అధికంగా చేస్తారు. పంట వేసేప్పుడు కొద్దిపాటి వర్షాలు ఉంటే చాలు ఆ తేమతో పాటు చలికాలంలో కురిసే మంచుతో, తక్కువ తడులతో ఈ పండే అవకాశాలుంటాయి. రెండేళ్లుగా అనావృష్టి, లేకపోతే అతివృష్టి పరిస్థితులు సీజన్ ప్రారంభంలో నెలకొనడంతో ఈ పంట సాగు చేయడానికి రైతులు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో రబీలో పప్పుశనగ కనీసం 70 వేల ఎకరాల వరకు సాగవ్వాలి. కానీ ప్రస్తుతం 35,990 ఎకరాలు మాత్రమే సాగవుతోంది. అంటే 50 శాతం తగ్గింది. సాధారణంగా సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబరు పూర్తయ్యే వరకు పప్పుశనగ సాగు చేస్తారు. కానీ ఈ సంవత్సరం అక్టోబరు పూర్తికావొస్తున్నా.. కేవలం 10 వేల పైచిలుకు ఎకరాల్లో మాత్రమే పంట సాగయ్యింది. మరికొన్ని రోజులపాటు పంట సాగుకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఈ ఏడాది సాధారణ సాగు లక్ష్యం చేరుకుంటారా? అనేది సందేహమనే చెప్పొచ్చు. అనుకూలమైన నేలలు ఉన్నప్పటికీ, రైతుల్లో పంటపై అవగాహన లేకపోడం, సాగుకు పెంచేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోకపోవడం, పంట పండించిన తర్వాత అమ్మకానికి రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొనడం సాగు తగ్గుదలకు కారణాలుగా చెప్పొచ్చు.
వనపర్తిలో తగ్గుతున్న వేరుశనగ..
వనపర్తి జిల్లా వేరుశనగకు అక్షయపాత్ర వంటిది. ఇక్కడ పండే వేరుశనగలో అఫ్లోటాక్సిన్ శాతం తక్కువగా ఉండటం వల్ల పల్లికి అంతర్జాతీయ డిమాండ్ ఉంది. అలాగే ఇక్కడి నేలలు కూడా వేరుశనగ సాగుకు అనుకూలంగా ఉంటాయి. జిల్లాలో నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో రబీలో రెండో ప్రధాన పంటగా వేరుశనగను రైతులు సాగు చేసేవారు. అయితే నీటిలభ్యత పెరిగిన తర్వాత పంట సాగును భారీగా తగ్గించారు. సాధారణం కంటే కూడా తక్కువగా సాగవుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముందస్తు రబీలో వేరుశనగ సాగు చేయడం, చలి, వాతావరణ మార్పుల కారణంగా పంట దిగుబడులు తగ్గిపోయాయి. 2019-20 రబీలో43,425 ఎకరాల్లో వేరుశనగ సాగు కాగా, గతేడాది 33,138 ఎకరాల్లో సాగు చేశారు. అంటే 10,287 ఎకరాల్లో సాగు తగ్గింది. అలాగే పప్పుశనగ 2019-20 రబీలో 4,338 ఎకరాల్లో సాగు చేయగా, గత ఏడాది రబీలో కేవలం 990 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ఈ ఏడాది రబీలో 3,348 ఎకరాల్లో పప్పుశనగ సాగు తగ్గింది. పై రెండు పంటలు కలిపి 14,123 ఎకరాల్లో సాగు తగ్గింది. గుడ్డిలో మెల్లగా జిల్లాలో మినుము సాగు పెరుగుతోంది. 2019 రబీలో 5,954 ఎకరాల్లో మినుము సాగు అయితే, గతేడాది రబీలో ఏకంగా 18,252 ఎకరాల్లో సాగు అయ్యింది. అంటే దాదాపు 12,298 ఎకరాల్లో సాగు పెరిగింది. ఈ ఏడాది వేయాల్సిన వేరుశనగలో ఇప్పటికే 70 శాతం సాగు పూర్తవగా, మినుముపై గతేడాది కంటే రైతులు ఎక్కువ శ్రద్ధ చూ పుతున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
Updated Date - 2021-10-30T03:52:33+05:30 IST