ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ధరణి’లో సమస్యలెన్నో...

ABN, First Publish Date - 2021-10-04T05:30:00+05:30

అన్ని రకాల భూ సమస్యలకు సర్వరోగ నివారిణిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ఇప్పుడు సమస్యలకు కేంద్రంగా మారింది. పావు గంటలో మ్యుటేషన్‌, పది నిమిషాల్లో పట్టాదారు పాస్‌పుస్తకం అని ఊదరగొట్టిన ధరణి పనితీరు వాస్తవానికి ఇందుకు భిన్నంగా ఉంది. భూముల లావాదేవీలు పారదర్శకంగా జరిగేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అపరిష్కృతంగా భూ సమస్యలు
పెండింగ్‌లో వేలాది దరఖాస్తులు
ఆఫీసుల చుట్టూ అన్నదాతల ప్రదక్షిణలు
పట్టించుకోని అధికారులు
రైతుబంధు, పంట రుణాలు రాక ఇబ్బందులు


హనుమకొండ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి):
అన్ని రకాల భూ సమస్యలకు సర్వరోగ నివారిణిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ఇప్పుడు సమస్యలకు కేంద్రంగా మారింది. పావు గంటలో మ్యుటేషన్‌, పది నిమిషాల్లో పట్టాదారు పాస్‌పుస్తకం అని ఊదరగొట్టిన ధరణి పనితీరు వాస్తవానికి ఇందుకు  భిన్నంగా ఉంది. భూముల లావాదేవీలు పారదర్శకంగా జరిగేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ఽధరణితో భూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రోజుకు వందకు పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో  8,754కు పైగా ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. మూడు, నాలుగు సార్లు దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం కావడం లేదు. కొన్నిసార్లు అసలు దరఖాస్తులే గల్లంతవుతున్నాయి. తహసీల్దార్‌ ఆఫీసుకు వెళితే కలెక్టర్‌ పేరు చెబుతున్నారు. కలెక్టర్‌ కార్యాలయానికి వెళితే సీసీఎల్‌ఏ పేరు చెబుతున్నారు. భూ సమస్యల వల్ల రైతుబంధు రాక, క్రాప్‌ లోన్‌ అందక, అవసరాలకు భూములు అమ్ముకోలేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

అసైన్డ్‌ ఆప్షన్‌ లేదు
కొన్నేళ్ల క్రితం గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభు త్వం భూములు అసైన్డ్‌ చేస్తూ పట్టాలు మంజూరు చేసిం ది. నాడు పట్టా పొందిన వ్యక్తి ప్రస్తుతం జీవించి ఉంటే వారసులకు బదిలీ చేసే వీలుండేది. ధరణి పోర్టల్‌లో ఆ హక్కు కల్పించే ఆప్షన్‌ ఇవ్వలేదు. గత మూడు దశాబ్దాల కాలంలో ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 4.90 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూమిని నిరుపేదలకు పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆయా భూములను వారసత్వంగా పట్టా చేయించుకునేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు.

జీపీఏకు అవకాశమేదీ?
ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ భూములున్న అనేక మంది ఉద్యోగ, వ్యాపారాల రీత్యా దేశ, విదేశాలకు వెళ్ళిపోయారు. ఇక్కడ వారి తరుపున లావాదేవీలు నిర్వహించేందుకు తమకు నమ్మకమైన వ్యక్తుల పేరుపై జనరల్‌ పవర్‌ ఆఫ్‌ ఆథరైజేషన్‌(జీపీఏ) రిజిస్టర్‌ చేయించారు. ఇప్పుడు వీటికి అవకాశం లేకుండా పోయింది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న భూములు ఉమ్మడి జిల్లాలో 2.37 లక్షల ఎకరాల వరకు ఉన్నాయి.

విస్తీర్ణం మించితే అంతే..
గతంలో సర్వే నెంబరులో 50 ఎకరాల భూమి ఉంటే రికార్డుల ఆధారంగా అసలు విస్తీర్ణానికి మించి పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చేవారు. ధరణి పోర్టల్‌ వచ్చాక సర్వే నెంబరులో రెవెన్యూ సెటిల్‌మెంట్‌ రికార్డు(ఆర్‌ఎ్‌సఆర్‌)లో నిర్ధేశించిన విస్తీర్ణం వరకే జారీ చేస్తున్నారు. ఇదే నెంబరులో తమకు భూమి ఉందని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పాత పాస్‌పుస్తకాలతో రైతులు ఎంత మొరపెట్టుకున్నా వినేవారు లేరు. ఇలాంటి దరఖాస్తులు ఉమ్మడి జిల్లాలో 7,800 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పట్టించుకునే వారే లేరు.

నోషనల్‌ ఖాతాల్లో..

ధరణి పోర్టల్‌కు ముందు రెవెన్యూ అధికారులు పొరపాటున నోషనల్‌ ఖాతాల్లో పట్టా భూములను చేర్చారు. నీటిపారుదల కోసం తీసుకున్న వాటికి, వక్ఫ్‌ భూములకు, ఫారెస్టు భూములకు, ప్రభుత్వ భూములకు ఇరిగేషనల్‌ నోషనల్‌ ఖాతాల్లోకి ఇష్టమొచ్చినట్టు ఎంట్రీ చేశారు. కొన్ని ప్రభుత్వ భూముల్లోని నోషనల్‌ ఖాతాల్లోకి వెళ్ళాయి. ఎక్కువగా నీటిపారుదల ప్రాజెక్టుల కింద, హైవేల్లో భూములు పోయిన ప్రాంతాల్లోనే ఇది జరిగింది. నిజంగానే ప్రాజెక్టులు, కాలువలు, రోడ్లతో కొంత భూమి పోయి విస్తీర్ణం తగ్గించే సమయంలో ఎక్కువ తీసేసిన వారికి తిరిగి ఇచ్చే ఆప్షన్‌ ఉంది. కానీ, అసలు భూములు పోకుండానే పోయినట్టు ఎంట్రీ అయిన వారికి మాత్రం దరఖాస్తు చేసుకోవడానికి ధరణి పోర్టల్‌లో అలాంటి అవకాశం లేదు. ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆయా రైతులకు రైతుబంధు, బీమా, పంట రుణాలు అందడం లేదు.

ఇంకా అనేకం..

కొద్ది భూభాగంలో సమస్య ఉంటే ఆ భూమి ఉన్న సర్వే నెంబరు మొత్తం బ్లాక్‌ అవుతోంది. జాయింట్‌ రిజిస్ట్రేషన్‌ భూములను కొనలేని, అమ్మలేని పరిస్థితి. ధరణి పోర్టల్‌లో జాయింట్‌ రిజిస్ట్రేషన్‌ కాలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త రిజిస్ట్రేషన్‌లకు లింకు డాక్యుమెంట్ల సమస్య ఎదురవుతోంది. ఎన్‌ఆర్‌ఐలు ఏ గుర్తింపు కార్డుతో కొనాలనే విషయంలో సందిగ్ధం ఉంది. ధరణిలో సేల్‌ డీడ్‌ రద్దు చేసుకునే ఐచ్ఛికం లేదు.

ధరణి పోర్టల్‌లో అనేక సమస్యలు ఉండడంతో వాటిని పరిష్కరించే వారే లేకుండా పోయారు. భూమి హక్కుల రికార్డుల వలయంలో చిక్కుకున్న రైతులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.  

భూ సమస్యల పరిష్కారం పారదర్శకంగా జరగాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం గ్రీవెన్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌ పేరుతో ధరణి పోర్టల్‌లో సమస్యలు విన్నవించుకునే అవకాశం కల్పించింది. దీనితో అన్నదాతలు ప్రతీ సోమవారం జిల్లా, మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణికి బారులు తీరుతున్నారు. వినతి పత్రాలను సమర్పిస్తున్నారు. అవి పరిష్కారానికి నోచక నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. అధికారులు ఫిర్యాదులు తీసుకోవడంతోనే సరిపెడుతున్నారు. మూడు, నాలుగు సార్లు దరఖాస్తు చేసినా ఇదే పరిస్థితి. ప్రతీ దరఖాస్తు కలెక్టర్ల లాగిన్‌లోకి వెళుతుందని, సమస్యను బట్టి అక్కడి నుంచి తహసీల్దార్‌కు ఫార్వర్డ్‌ అవుతుందని చెప్పడమే తప్ప చేస్తున్నదేమీ లేదు. ఇప్పటికే పలు రకాలుగా భూ సమస్యలపై దరఖాస్తులు పెట్టుకున్నామని, అసలు వాటి స్టేటస్‌ ఎంటో అధికారులు చెప్పడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు.

సవరణకు నో చాన్స్‌..
భూ ప్రక్షాళన అనంతరం జారీ చేసిన డిజిటల్‌ పట్టాదారు పాస్‌పుస్తకాల్లో పేర్లు తప్పుగా నమోదైతే ఇంతే సంగతులు. వాటి సవరణకు ధరణిలో అవకాశం లేదు. దీంతో అన్నదాతలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రజావాణిలో వీటికి సంబంధించిన దరఖాస్తులే ఎక్కువగా వస్తున్నాయి. వేలాది దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక బుట్టదాఖలవుతున్నాయి.

Updated Date - 2021-10-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising