వైభవంగా వీరభద్రుడి రథోత్సవం
ABN, First Publish Date - 2021-03-17T04:50:50+05:30
వైభవంగా వీరభద్రుడి రథోత్సవం
శివసత్తుల తాండవాలు, చిరుతల భజనలు
రథాన్ని లాగిన భక్తులు, ప్రముఖులు
భక్తులతో కిక్కిరిసిన గ్రామ పురవీధులు
కురవి, మార్చి 16: భద్రకాళి సమేత వీరభద్రస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా వీరభద్రుడి రథోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. శైవ ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించిన ఈ రథోత్సవ పూజా కార్యక్రమాల్లో భాగంగా గణపతిపూజ, పుణ్యవాహజ్జనం, నవగ్రహపూజ, వాస్తుపూజ, వాస్తుహోమం, బలిహరణ, జిష్టికుంబం, దేవతాపూజాచారాలతో రథంలో విగ్రహ పూజలు జరిపారు. స్వామివారి రథోత్సవంలో పాల్గొని రథాన్నిలాగితే పాపాలు పోతాయని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రతీతి ఉండటంతో భక్తులు పెద్దసంఖ్యలో రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగారు.
కల్యాణ వీరభద్రుడు కదిలివచ్చిన వేళ..
పురాతన చెక్కరథంలో కల్యాణ వీరభద్రుడు, భద్రకాళి మాతలు కదిలివస్తుంటే మహిళలు, భక్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. శివసత్తుల తాండవం, నేరడ కళాకారుల చిడుతల, కట్టె భజన, బాణాసంచా పేలుళ్ల నడుమ గ్రామపురవీధుల గుండా రథోత్సవం సాగింది. గ్రామ నడిబొడ్డుకు రథం చేరిన తర్వాత మంగళవాయిద్యాలతో సంగీత విభావరి నిర్వహించారు. ఆలయ అర్చకులు రవికిరణ్, శ్రీనివాస్, విజయ్, అనిల్, రామన్న, పుణ్యమూర్తి, రమేష్ ఈ పూజా కార్యక్రమాలను కొనసాగించారు. రాత్రి పది గంటల వరకు వీరభద్రుడు మేళతాళాల మధ్య రథంలో ఊరేగించారు. ఊరేగింపులో తాడేపల్లిగూడెం నుంచి వచ్చిన శివ అలంకరణ భక్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో దేవాలయ ఆలయ కార్యనిర్వాహణాధికారి సత్యనారాయణ, సర్పంచ్ నూతక్కి పద్మ నర్సింహారావు, దేవాలయ చైర్మన్ బాదావత్ రామూనాయక్, ఎంపీటీసీ చిన్నం భాస్కర్, ఉపసర్పంచ్ సంగెం భరత్, నూతక్కి సాంబశివరావు, మేక నాగిరెడ్డి, కొంతం విజయ్, సీహెచ్.మల్లయ్య, వెంకటరమణ, బాదావత్ లక్ష్మి రాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ రథోత్సవ పూజా కార్యక్రమానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు ఎస్.హరిబాబు, అశోక్, పాశం అరుణ్‌కుమార్, పాండు పూల అలంకరణ చేయించారు. రూరల్ సీఐ సుంకరి రవి, ఎస్సై జక్కుల శంకర్‌రావు బందోబస్తు నిర్వహించారు.
Updated Date - 2021-03-17T04:50:50+05:30 IST