వరంగల్ రైల్వే స్టేషన్‌లో కిసాన్ రైలు ప్రారంభం
ABN, First Publish Date - 2021-02-09T04:17:35+05:30
వరంగల్ రైల్వే స్టేషన్‌లో కిసాన్ రైలు ప్రారంభం
గిర్మాజిపేట(వరంగల్), ఫిబ్రవరి 8 : వ్యవసాయ ఉత్పత్తులను 50 శాతం సబ్సిడీ చార్జీలతో రవాణా చేసేందుకు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కిసాన్ రైలు సోమవారం వరంగల్ రైల్వే స్టేషన్‌లో ప్రారంభించారు. వరంగల్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే దక్షిణమధ్య రైల్వే పరిధిలోని తొలికిసాన్ రైలును సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ సహాయ కమర్షియల్ మేనేజర్ విద్యాధర్ ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడికైనా తరలించేలా 50 శాతం సబ్సిడీ చార్జీలతో రైల్వేమంత్రిత్వ శాఖ ఈ ప్రత్యేక పార్సల్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ రైలు వరంగల్ నుంచి బరాసత్ (పశ్చిమ బెంగాల్)కు 230 టన్నుల పసుపు కొమ్ములను తరలిస్తోందని వివరించారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు రైలు గమ్యం చేరుకుంటుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసేందుకు కిసాన్ రైలును ముందస్తుగా బుక్ చేసుకునేలా రైల్వేశాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్టేషన్‌మేనేజర్, చీఫ్ పార్సల్ సూపర్‌వైజర్ ఎం.శ్రీనివాస్, చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, వరంగల్ ఆర్‌పీఎఫ్ ఎస్సై రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
Updated Date - 2021-02-09T04:17:35+05:30 IST