ఖతర్నాక్ ‘కడక్‌నాథ్ కోళ్లు’
ABN, First Publish Date - 2021-11-14T05:37:02+05:30
బాయిలర్ కోళ్లు తినీ తినీ విసుగెత్తి పోయారా..! నాటుకోళ్ల రుచి కూడా మీకు విసుగు తెప్పిస్తోందా..! అయితే ఓ సారి కడక్‌నాథ్ నాటు కోడి రుచి చూడండి.. రుచికి రుచితో పాటు పోషక విలువలు మెండుగా ఉంటాయి. ఈ కోడి మాంసం కిలో రూ.1000 ఉంటుంది. దీని కోడి పిల్ల ఖరీదు రూ.90 ఉంది. అమ్మో.. అంత ఖరీదా..? ఏంటి దీని స్పెషాలిటీలు.. అని అశ్చర్యపోతున్నారా..! ఆ విషయానికే వద్దాం.. ఈ కోడి పేరు.. రూపం.. దగ్గర్నుంచి అన్ని ప్రత్యేకతలే.. దీని మాంసం ఎన్నో పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు ఆరుదైన ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వాటి కథంటో.. చదవండి..
నల్లటి నాటు కోడి రుచి అదరహో..
మధ్యప్రదేశ్ నుంచి దిగుమతి
మానుకోట జిల్లాలో పెంపకం
కిలో మాంసం రూ.వెయ్యి, 1 గుడ్డు రూ.50
ఔషధాలు, పోషకాలు, ప్రయోజనాలెన్నో..
బాయిలర్ కోళ్లు తినీ తినీ విసుగెత్తి పోయారా..! నాటుకోళ్ల రుచి కూడా మీకు విసుగు తెప్పిస్తోందా..! అయితే ఓ సారి కడక్‌నాథ్ నాటు కోడి రుచి చూడండి.. రుచికి రుచితో పాటు పోషక విలువలు మెండుగా ఉంటాయి. ఈ కోడి మాంసం కిలో రూ.1000 ఉంటుంది. దీని కోడి పిల్ల ఖరీదు రూ.90 ఉంది. అమ్మో.. అంత ఖరీదా..? ఏంటి దీని స్పెషాలిటీలు.. అని అశ్చర్యపోతున్నారా..! ఆ విషయానికే వద్దాం.. ఈ కోడి పేరు.. రూపం.. దగ్గర్నుంచి అన్ని ప్రత్యేకతలే.. దీని మాంసం ఎన్నో పోషక విలువలు కలిగి ఉండడంతో పాటు ఆరుదైన ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. వాటి కథంటో.. చదవండి..
మహబూబాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు నాటు కోళ్ల పెంపకాన్ని చేపట్టేవారు. వాటి అమ్మకంతో కొంత సొమ్మును సంపాదించుకునే వారు. ఈ క్రమంలోనే నాటు కోడి మాంసానికి డిమాండ్ బాగా పెరగడంతో పెరటి కోళ్ల పెంపకం కుటీర పరిశ్రమలా మారింది. ఈ క్రమంలో నాటు కోడిని తలదన్నేలా ఒక ప్రత్యేక జాతి కోడి మార్కెట్‌లో ప్రవేశించింది. అవే కడక్‌నాథ్ కోళ్లు. ఈ కోళ్ల పుట్టినిళ్లు మధ్యప్రదేశ్. వ్యాపార రంగంలో లాభదాయకంగా మారడంతో కడక్‌నాథ్ కోళ్లు తెలంగాణలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఈ కోళ్ల పెంపకం ఏడాది కాలంగా కొనసాగుతోంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ నుంచి..
అత్యంత పోషక విలువలు, రోగ నిరోధక శక్తి కలిగిన భారతీయ పెరటి జాతి నాటుకోడిగా కడక్‌నాథ్ కోడి దేశవ్యాప్తంగా అంత్యంత ప్రాచుర్యం లభిస్తోంది. ఈ కోళ్లు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్నిప్రాంతాల్లో మాత్రమే దొరికే స్థానిక జాతికి చెందిన నాటు కోడిగానే పేర్కొంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో నివసించే గిరిజనులు, కొండజాతులు, ఆదివాసీ, ప్రజలు, గ్రామీణా ప్రాం తాల వారే ఈ కోళ్లను పెంచేవారు. దీన్ని పవిత్రమైన జాతిగా గుర్తించి దీపావళి పండుగలో దేవుడికి నైవేద్యం గా పెడతారని సమాచారం. ముదురు నలుపు, ముదురు నీలం రంగుల్లో ఉండే ఈ కడక్‌నాథ్ కోళ్ల వెంట్రుకలు, చ ర్మం, మాంసంతో పాటు రక్తం కూడా నల్లగానే ఉంటుం ది. ఈ కోళ్లను కాలా మాళి అని కూడా పిలుస్తారు.
ఔషధగుణాలు
కడక్‌నాథ్ కోళ్లకు రోగనిరోధక శక్తి ఎక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు. ఈ కోడి శరీరంలో చాలా తక్కువ కొవ్వు ఉంటుంది. ఈ జాతి కోళ్లలో పొదుగుడు లక్షణం తక్కువ. ఆరు నెలల వయసు నుండే గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. వేసవిలో సుమారు 100 గుడ్ల వరకు పెడుతుంది. 7నెలల వ్యవధిలో ఈ కోడి కేవలం 1.5 కిలోల బరువు పెరుగుతుంది. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలపై సెంట్రల్ ఫుడ్ అండ్ రిసెర్స్ ఇనిస్టిట్యూట్ మైసూర్ వారు ప్రత్యక పరిశోధనలు చేశారు. దీనిని మందుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు ఈ మాంసాన్ని హోమియోపతిలో నరాల సంబంధిత వ్యాధులను నయం చేయడానికి వాడతారు. గిరిజనులు కూడా కడక్‌నాథ్ కోడి రక్తాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో మూలికవైద్యంలో ఉపయోగిస్తారని చెబుతారు.
రోగాలకు విరుగుడు
ఈ కోడి మాంసం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. జీర్ణశక్తి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని మాంసంలో 18 రకాల అమైనో ఆసిడ్స్, విటమిన్లు (బి1, బి2, బి3, బి12), కాల్షియం ఫాస్పరస్, ఐరన్ నికోటినిక్ యాసిడ్స్ ఉంటాయి. ఈ కోడి మాంసం హృద్రోగులకు మేలు చేయడమే కాకుండా గుండెకు రక్త సరఫరా పెంచుతుంది. వయాగ్రాలోని సిల్డెనాఫిల్ సిట్రిక్ రక్త సరఫరా పెంచడం ద్వారా సెక్స్ సామర్థ్యం పెంచుతుంది. మెలనిన్ అనే పదార్థం ఈ కోడి మాంసంలో ఉండడం వల్ల మహిళలు అధిక రక్తస్త్రావం, గర్భస్త్రావం ప్రసవానంతర సమస్యల నుంచి బయటపడవచ్చు అంటున్నారు. ఈ కోడి మాంసంలో ఇనుప దాతువు బి2 అధికంగా ఉండడం వలన న్యూమోనియా, ఎనిమియా, క్షయ, అస్తమా వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. కీళ్ల సమస్యలు, ఎముకలు విరిగిన వారికి ఇది అద్భుత ఆహారంగా భావించవచ్చు. శరీరానికి అవసరమైన ఓమోగా అమూల ఫాటో యాసిడ్ ప్రతిరూపమైన లినోలెనిక్ యాసిడ్ ఈ కోడి మాంసంలో ఉండడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. వీటి గుడ్లని తలనొప్పి, నీరసం, అస్తమా, మూత్రపిండాల సంబంధిత వ్యాధులను తగ్గించడానికి వాడుతారు. వయసు మళ్లిన వారికి వీటి గుడ్లు చాలా ఆరోగ్యదాయకం.
మానుకోట జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరు గ్రామపంచాయతీ పరిధి గాంధీనగర్‌కు చెందిన లిఫ్ట్ ఇరిగేషన్ శాఖలో పనిచేసే ఉద్యోగి భూక్య రమేష్ కరోనా లాక్‌డౌన్ కాలంలో కడక్‌నాథ్ కోళ్ల గురించి తెలుసుకున్నాడు. ఆరు నెలలు కోళ్ల పెంపకంలో శిక్షణ పొందిన ఆయన.. యేడాది నుంచి ఇందిరానగర్‌లో 500 కడక్‌నాథ్ కోడి పిల్లలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రస్తుతానికి 1,500 కోళ్ల వరకు పెంచుతూ లాభాన్ని ఆర్జిస్తున్నారు.
తక్కువ పెట్టుబడి.. అధిక లాభాలు..
- భూక్య రమేష్, పెంపకందారుడు
కడక్‌నాథ్ కోళ్లను మధ్యప్రదేశ్ నుంచి వీటిని తీసుకొచ్చాను. 500 కోడి పిల్లలకు రూ.2 లక్షల 14 వేలు పెట్టుబడి పెట్టి తీసుకురాగా, రూ.6లక్షల 43 వేల ఆదాయం వచ్చింది. ఇంటి మనుషులతో కోళ్లను పెంచి ఆరు నెలల్లోనే గరిష్టంగా ఆదాయం పొందవచు. కడక్‌నాథ్ కోళ్లు ఆరు నెలల కాలం నుంచి మూడేళ్లవరకు గుడ్లు పెడతాయి. యేడాదిలో పదిరోజులు మాత్రమే పెట్టవు. మూడేళ్లకు కలిపి ఒక్కో కోడి 1,015 గుడ్ల వరకు పెడుతుంది. ఒక గుడ్డు ధర రూ.50 ఉంటుంది. ఒక్క కిలో కడక్‌నాథ్ కోడి ధర రూ.1000కిపైగా వస్తుంది. కోడిపిల్ల ధర రూ.90లు ఉంటుంది.
Updated Date - 2021-11-14T05:37:02+05:30 IST