ముందుంది మూడోముప్పు.. కరోనా నిబంధనలు విస్మరిస్తున్న ప్రజలు
ABN, First Publish Date - 2021-10-29T06:36:28+05:30
కొన్ని రోజులుగా జిల్లాలో కరోనా తగ్గుముఖం పడుతోంది. చాలా కేంద్రాల్లో జీరో కేసులు నమోదవుతున్నాయి. అయితే కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన అజాగ్రత్తగా ఉంటే అసలుకే మోసం వస్తుందంటున్నారు వైద్యాధికారులు.. అంతర్జాతీయంగా రష్యా, చైనా లాంటి దేశాల్లో మూడో ముప్పుతో తీవ్ర ప్రాణ నష్టం సంభవిస్తోందని వార్తలు వినిపిస్తున్న నేపఽథ్యంలో మూడో ముప్పు పొంచి ఉందనే ప్రమాదపు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వ్యాక్సిన్‌తోనే మహమ్మారికి చెక్
జిల్లాలో అంతంత మాత్రంగానే రెండో డోసు
ప్రత్యేక డ్రైవ్‌లోనైనా నూరుశాతం పూర్తయ్యేనా ?
ఖమ్మం కలెక్టరేట్, అక్టోబరు 28: కొన్ని రోజులుగా జిల్లాలో కరోనా తగ్గుముఖం పడుతోంది. చాలా కేంద్రాల్లో జీరో కేసులు నమోదవుతున్నాయి. అయితే కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన అజాగ్రత్తగా ఉంటే అసలుకే మోసం వస్తుందంటున్నారు వైద్యాధికారులు.. అంతర్జాతీయంగా రష్యా, చైనా లాంటి దేశాల్లో మూడో ముప్పుతో తీవ్ర ప్రాణ నష్టం సంభవిస్తోందని వార్తలు వినిపిస్తున్న నేపఽథ్యంలో మూడో ముప్పు పొంచి ఉందనే ప్రమాదపు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరుస లాక్‌డౌన్‌ల ఎత్తివేతతో ప్రస్తుతం అంతరాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో రాకపోకలు సులువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి వైరస్ మూడో ముప్పు ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రజలు కొవిడ్ నిబంధనలు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈ ఉల్లంఘటనలు ఇలాగే కొనసాగితే ఈసారి ముప్పు తీవ్రంగా ఉండి ప్రాణనష్టం సంభవించే ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిర్లక్ష్యంగా ఉంటే తీవ్ర నష్టం
ఈ ఏడాది రెండో దశ కొవిడ్ నేపథ్యంలో మార్చి నుంచి జూన్ వరకు తీవ్ర ప్రాణనష్టం సంభ వించింది. మొదటి దశలో ప్రజలు ఆర్థికంగా నష్టపోయినా రెండో దశలో మాత్రం జిల్లాలో 2,500 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం కూడా కష్టతరంగా మారింది. ఆ పరిస్థితుల నుంచి జిల్లా ప్రస్తుతం తేరుకుంది. జిల్లాలో ప్రస్తుతం 0.3శాతానికి పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మూడో ముప్పును నివారించాలంటే నూరుశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తవ్వాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ జిల్లాలో మాత్రం అనుకున్న విధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగడంలేదని తెలుస్తోంది.
మొదటి డోస్ 77.37 శాతమే
ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ మొదటి డోసే నూరుశాతం పూర్తవ్వలేదు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అలక్ష్యంతో ఇది పెరగడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ వైద్య ఆరోగ్యశాఖ మీనవేశాలు లెక్కిస్తోందని ఆరోపిస్తున్నారు. జిల్లాలో 18 ఏళ్ల పైబడి వ్యాక్సిన్ అర్హులైనవారు 10లక్షల 60వేల 576 మంది ఉండగా ఇప్పటి వరకు 8లక్షల 20వేల 593 మదికి మాత్రమే మొదటి డోస్ వేశారు. ఇంకా 2లక్షల 39వేల 983మంది టీకాలు వేయాల్సి ఉంది. ఇది కేవలం 77.31శాతమే. ఇక రెండోడోస్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 2లక్షల 73వేల 642 మందికి టీకాలు వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ సరఫరా లేక కొంత ప్రజలకు అవగాహన లేకకొంత వ్యాక్సినేషన్ ప్రక్రియ అంతంతమాత్రంగానే కొనసాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 589 పంచాయతీల్లో కేవలం 188 పంచాయతీల్లో మాత్రమే నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
వ్యాక్సినేషన్ ప్రత్యేక కార్యక్రమం
జిల్లాలో బుధవారం నుంచి వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అంతర్జాతీయంగా కరోనా మూడో ముప్పుతో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలను మరింత అప్రమత్తం చేస్తున్నారు. మూడో మప్పు డిసెంబర్, జనవరిలో వస్తుందని భావిస్తూ అప్పటి వరకు అన్ని జిల్లాల్లోనూ నూరుశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలంటూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్ మంగళవారం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆశా, అంగన్‌వాడీ, పంచాయతీ కార్యదర్శులు, నగరాల్లో మెప్మా ఆర్పీలతో సుమారు 1,500 బృందాలను సిద్ధం చేస్తున్నారు. ఈ బృందాలు నగరాలను, గ్రామాలను జల్లెడ వేయనున్నాయి ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటింటికీ సర్వే నిర్వహిస్తారు. ఆ ఇంట్లో ఎంత మంది ఉన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నారా లేదా.. మొదటి డోస్ ఎంత మంది వేయించుకున్నారు. రెండోడోస్ ఎంతమంది తీసుకున్నారని సర్వే చేసి వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి సమీపంలోని వ్యాక్సిన్ కేంద్రానికి తరలించనున్నారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టేందుకు కలెక్టర్ వీపీ గౌతమ్ ఆధ్వర్యంలో ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖను అప్రమత్తం చేస్తున్నారు.
టీకా తీసుకుంటేనే కరోనాకు చెక్
ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్
ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే కరోనాను అరికట్టగలం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. మూడో ముప్పు ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు టీకాను తప్పకుండా వేయించుకోవాలి. టీకా వేయించుకుంటే కరోనా రాదని భరోసా ఇవ్వలేక పోయినా కరోనా తీవ్రతను మాత్రం కొంత మేరకు తగ్గించుకోగలం. ప్రత్యేక డ్రైవ్‌ద్వారా ఆరోగ్య బృందాలు గ్రామాలకు, నగరాలకు వస్తున్నాయని అడిగిమరీ టీకా వేయించుకోవాలి. ప్రజాసంక్షేమం దృశ్యా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడంతో పాటు కరోనా మహామ్మారిని తరిమికొట్టేందుకు అంతా సమిష్టిగా కృషిచేద్దాం.
Updated Date - 2021-10-29T06:36:28+05:30 IST