పగిడేరు.. రోడ్డు ఎప్పటికి నెరవేరు
ABN, First Publish Date - 2021-11-30T05:37:41+05:30
మణుగూరు మండలం పగిడేరు పంచాయతీ వాసులకు రహదారి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి.
అసంపూర్తిగా బీటీ రోడ్డు పనులు
రూ. నాలుగు కోట్లతో ప్రతిపాదనలు
మొరం పోసి సరిపుచ్చిన కాంట్రాక్టర్
అవస్థలు పడుతున్న పగిడేరు గ్రామస్థులు
మణుగూరురూరల్, నవంబరు 29: మణుగూరు మండలం పగిడేరు పంచాయతీ వాసులకు రహదారి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పాత రోడ్డును తొలగించి నూతన రోడ్డు పనులు ప్రారంభించి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ పూర్తికాలేదు. బిటి రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు ఆందోళనకు దిగినప్పటికీ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడం గమనార్హం.. రామానుజారం నుంచి పగిడేరు వరకు వె ళ్లే బిటి రోడ్డు పూర్తిగా మరమ్మతులను గురైంది. స్ధానిక ప్రజా ప్రతినిధులు రోడ్డు దుస్ధితిని ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పంచాయతీ రాజ్ అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే రేగా 6.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించారు. ఇందుకు గానూ గత ఏడాది పీఎంజీఎస్‌వై కింద రూ4.60కోట్లను మంజూరు చేసింది. ఈ పనులను గత ఏడాది ప్రారంభించారు. మొరం పనులు మాత్రమే చేపట్టిన కాంట్రాక్టర్ మిగతా వాటిని చేపట్టకుండా కాలం వెళ్లదీస్తున్నారు. స్థా నిక ప్రజా ప్రతినిధులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మొరం మాత్రమే వేసి వదిలేయడంతో కంకర లేచి రోడ్ అధ్వానంగా మారింది. రాకపోకలు సాగించాలంటేనే భయం వేస్తోందని వాహనదారులు అంటున్నారు. ఇప్పటి వరకూ చేసిన పనుల మేరకు బిల్లు డ్రా చేసుకున్న కాంట్రాక్టర్, బీటీ పనుల్లో నిర్లక్ష్యంగా వహిస్తున్నారని పగిడేరు వాసులు ఆరోపిస్తున్నారు.
త్వరలోనే పనులు చేపడతాం
సైదులు రెడ్డి, డిఈ పంచాయతీ రాజ్
‘రామానుజారం నుంచి పగిడేరు వరకు చేపట్టే బీడీ రోడ్లు పనులు త్వరలోనే చేపడతాం. కొన్ని నెలలుగా వర్షాలు పడుతుండటంతో పనుల్లో జాప్యం ఏర్పడింది. ప్రస్తుతం వాతావరణం సహకరిస్తోందని, డిసెంబరులో బీటీ పనులు పూర్తి చేసేలా చర్యలు చేపడతామని’ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
Updated Date - 2021-11-30T05:37:41+05:30 IST