హైకోర్టు స్టే ఇచ్చినా.. ఆగని సర్వే
ABN, First Publish Date - 2021-07-22T04:31:32+05:30
గ్రీనఫీల్డ్ హైవే జాతీయ రహదారి భూ సేకరణ సర్వేపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చినా.. ఏర్పాట్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పరిహారం విషయమై ఇప్పటికే పలు చోట్ల బాధిత రైతులు ఆందోళనలు, అడ్డగింతలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినా అధికారులు
కొనసాగుతున్న ‘గ్రీనఫీల్డ్’ ప్రాథమిక పనులు
వైరా మండలం సోమవరం వద్ద కార్యాలయాల నిర్మాణానికి ఏర్పాట్లు
లీజు భూముల్లో హద్దులు నిర్ణయించిన సిబ్బంది
వైరా, జూలై 21: గ్రీనఫీల్డ్ హైవే జాతీయ రహదారి భూ సేకరణ సర్వేపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే ఇచ్చినా.. ఏర్పాట్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. అయితే పరిహారం విషయమై ఇప్పటికే పలు చోట్ల బాధిత రైతులు ఆందోళనలు, అడ్డగింతలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినా అధికారులు మాత్రం తమ సర్వే పనులు తాము చేసుకుపోతున్నారు. వైరా మునిసిపాలిటీ పరిధిలోని సోమవరం గ్రామానికి సమీపంలో వైరా-జగ్గయ్యపేట, మధిర ఆర్‌అండ్‌బీ రహదారిలో రిజర్వాయర్ కుడికాల్వ పక్కన సుమారు 25ఎకరాల మాగాణి భూములను గ్రీనఫీల్డ్ హైవే అథార్టీ వారు లీజుకు తీసుకుని.. అక్కడ హైవేకు సంబంధించిన కార్యాలయాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం లీజుకు తీసుకున్న ఆ భూముల సరిహద్దులను నిర్ధారించేందుకు మంగళవారం సిబ్బంది సర్వే చేశారు. ఇప్పటికే ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి లీజుకు తీసుకున్న భూముల్లోకి వెళ్లేందుకు వీలుగా దారిని ఏర్పాటు చేసుకుని నీరు పోయేలా భారీ సైజులోని తూములను కూడా వేశారు. ఆ భూములను చదును చేసి క్యాంపు కార్యాలయాల నిర్మాణం చేపట్టేందుకు, రోడ్డు నిర్మాణానికి అవసరమైన సామగ్రిని డంప్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే గ్రీనఫీల్డ్ హైవే కోసం తమ భూములను బలవంతంగా తీసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆపాలని కోరుతూ రైతులు హైకోర్టును ఆశ్రయించి.. రెండు కేసులు వేశారు. వాటిని పరిశీలించిన హైకోర్టు రైతుల అంగీకారం లేకుండా బలవంతంగా భూములు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ స్టే ఇచ్చింది. అయినా పలుచోట్ల గ్రీనఫీల్డ్ హైవే నిర్మాణం కోసం రైతుల భూముల్లో సర్వే చేస్తున్నారు.
ఇటీవల బస్వాపురం వద్ద పనుల అడ్డగింత
చింతకాని మండలం బస్వాపురం దగ్గర గత సోమవారం భూములను సర్వే చేస్తున్న సిబ్బందిని అక్కడి రైతులు అడ్డుకున్నారు. రైతుల అంగీకారం లేకుండా సర్వే చేయటానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసినా, ఖాతరు చేయకుండా సర్వే నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్కక్తం చేశారు. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు 60మీటర్ల వెడల్పుతో నిర్మించే గ్రీనఫీల్డ్ హైవే నిర్మాణానికి భూముల సేకరణ రెండేళ్లుగా జరుగుతుండగా.. ఈ ప్రక్రియను రైతులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఉన్న భూముల రేట్లకు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారానికి మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండటంతో భూములిచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ఒక కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 18ఎకరాల సాగుభూములు అవసరమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో రెండున్నరవేల రైతు కుటుంబాలు సుమారు 1800ఎకరాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైరా మండలంలో సోమవరం రెవెన్యూ పరిధిలోని సోమవరం, గండగలపాడు రైతులు అలాగే సిరిపురం అలాగే తల్లాడ మండలం పినపాక రెవెన్యూ పరిధిలో భూములున్న సిరిపురం రైతులు వందమందికిపైగా ఈ రోడ్డు నిర్మాణం వలన భూములను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ఉదారంగా ముందుకురాని ప్రభుత్వం ఏర్పాట్లు మాత్రం చకచకా చేస్తుండటం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2021-07-22T04:31:32+05:30 IST