గురుకులాల్లో హాజరు శాతం అంతంతమాత్రమే
ABN, First Publish Date - 2021-10-30T04:25:42+05:30
జిల్లాలోని బీసీ, మైనారిటీ గురుకులాల్లో హాజరు శాతం అంతంత మాత్రంగానే ఉంది. కరోనా నేపథ్యంలో 18నెలలు పైగా మూతబడిన గురుకులాలు ప్రభుత్వ ఆదేశాలతో వారం నుంచి తెరుచుకున్నాయి.
హాస్టళ్లు తెరిచి వారం
హాజరు శాతం 20 నుంచి 30శాతం మాత్రమే
ఖమ్మంఖానాపురంహవేలి, అక్టోబరు29: జిల్లాలోని బీసీ, మైనారిటీ గురుకులాల్లో హాజరు శాతం అంతంత మాత్రంగానే ఉంది. కరోనా నేపథ్యంలో 18నెలలు పైగా మూతబడిన గురుకులాలు ప్రభుత్వ ఆదేశాలతో వారం నుంచి తెరుచుకున్నాయి. వారంరోజులుగా కేవలం 20 నుంచి30శాతం మాత్రమే విద్యార్థులు హాస్టల్స్‌కు హాజరవుతున్నారు. విద్యార్థుల హాజరుపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి. జిల్లా లోని మొత్తం 22 బాలికల, బాలుర బీసీ గురుకులాల్లో 2020-21 విద్యాసంవత్సరానికి 1523 మంది విద్యార్థులకు గాను శుక్రవారం 450మంది హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులే హాజరుకాగా, 1నుంచి7వతరగతి విద్యార్థులు నేటికి హాజరు కాలేదు. జిల్లాలోని మైనారిటీ 8వతరగతి 25 శాతం, 9తరగతి 20 శాతం, 10వతరగతి 37శాతం, ఇంటర్ మొదటి సంవత్సరం 65శాతం, ద్వితీయ సంవత్సరం 90శాతం హాజరయ్యారు. హాజరైన విద్యార్థులకు హాస్టళ్లలో దుప్పట్లు, బెడ్లుతోపాటు పౌష్టికాహారం కూడా అందించారు. హాస్టళ్లను శానిటైజ్ చేస్తూ కరోనా నిబంధనలు పాటిస్తూ, బెంచీకి ఒక్కరు చొప్పున విద్యార్థు లను కూర్చొబెడుతున్నారు. నెలాఖరుకు విద్యార్థులందరు చేరుకుంటారని అధికారులు భావిస్తున్నారు. నూరుశాతం హాజరుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Updated Date - 2021-10-30T04:25:42+05:30 IST