రోడ్డెక్కిన ఓటర్లు
ABN, First Publish Date - 2021-10-29T05:45:54+05:30
ఉప ఎన్నిక వేళ ఓటర్లకు ప్రలోభాల పర్వం మొదలైంది. డబ్బుల పంపిణీలో తేడా రావడంతో గురువారం పలు గ్రామాల్లో ఓటర్లు ధర్నాకు దిగారు.
- డబ్బుల పంపిణీలో తేడాలు
- ఆందోళన చేపట్టిన మహిళలు
- పోలీసులతో వాగ్వాదం
హుజూరాబాద్‌రూరల్,అక్టోబరు 28: ఉప ఎన్నిక వేళ ఓటర్లకు ప్రలోభాల పర్వం మొదలైంది. డబ్బుల పంపిణీలో తేడా రావడంతో గురువారం పలు గ్రామాల్లో ఓటర్లు ధర్నాకు దిగారు. దీంతో ప్రధాన పార్టీ నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. పంపకాల్లో తేడా రావడంతో గ్రామస్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. హుజూరాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామంలో గురువారం హనుమాన్ దేవాలయం వద్ద ఓట్లకు సంబంధించిన డబ్బులు రాలేదంటూ గ్రామస్థులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో 2800మంది ఓటర్లు ఉండగా 1600మందికి మాత్రమే డబ్బుల పంపిణీ జరిగిందని, మిగితా వారికి రాలేదన్నారు. గ్రామ సర్పంచ్ కావాలనే తమకు డబ్బులు రాకుండా చేశారని ఆరోపించారు. సర్పంచ్‌ను ఎన్నుకున్నది మేమే, దించేది కూడా మేమే అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. సర్పంచ్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఇప్పటి వరకు గ్రామంలో ఓటర్లకు పంచిన డబ్బులను వెనక్కి తీసుకుంటే మేము ఆందోళన విరమిస్తామని, లేకుంటే అందరికీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులకు,గ్రామస్థులకు వాగ్వివాదం జరిగింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎలాంటి ఆందోళనలు చేపట్టరాదని సీఐ శ్రీనివాస్ అనడంతో ఎన్నికల కోడ్ అమలులో ఉంటే డబ్బులు ఎలా పంపిణీ చేస్తున్నారంటూ, తిరిగి ఓటర్లు పోలీసులను ప్రశ్నించారు. సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తూ ధర్నా నిర్వహించారు. డబ్బులు మాకు ఇవ్వాలి లేదా, గ్రామంలో పంపిణీ చేసిన మొత్తం డబ్బులను వెనక్కి తీసుకోవాలన్నారు. సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు మీ వద్ద ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని, ఆధారాలు లేకుండా ఆందోళన చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా ఆందోళన విరమించారు.
- గ్రామాలకు తాకిన డబ్బుల లొల్లి
రాంపూర్ గ్రామంలోని ప్రజలు తమకు ఓట్ల డబ్బులు రాలేదంటూ ఆందోళన చేశారు. 12 వార్డులలో 2850 మంది ఓటర్లు ఉండగా, 850 మంది ఓటర్లకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదంటూ, మా ఓటు అవసరం లేదా అని ప్రశ్నించారు. గ్రామంలో ఉన్న 12 వార్డులలో ఉన్న వార్డు మెంబర్ల ఇళ్ల ఎదుట ఆందోళన చేసి సర్పంచ్ ఇంటి ఎదుట సుమారు అరగంట పాటు ఆందోళన నిర్వహించారు. రాంపూర్‌లో వార్డు మెంబర్లను డబ్బులు పంచిన నాన్‌లోకల్ లీడర్లతో కలిసి మీరెందుకు పంచారంటూ... పంచితే అందరికీ పంచాలంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ధర్నా విరమింపజేశారు. అలాగే ఇప్పలనర్సింగాపూర్, కందుగుల గ్రామాల్లో ఓట్ల డబ్బులు రావాలంటూ ధర్నా నిర్వహించే క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా విరమింపజేశారు. ఇప్పల్‌నర్సింగాపూర్, పెద్దపాపయ్యపల్లి, రంగాపూర్, కందుగుల, కాట్రపల్లిలో కూడా ఆందోళనలు నిర్వహించారు.
- వీణవంకలో...
వీణవంక: వీణవంక మండలం గంగారం గ్రామంలో తమకు రూ. 6వేలు ఇవ్వలేదని, గ్రామంలో అందరికీ ఇస్తామని చెప్పి కొంత మందికే డబ్బులు ఇచ్చారని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అందరికీ పంపిణీ చేయమని డబ్బులు పంపిస్తే గ్రామ సర్పంచ్ మాకు ఇవ్వడం లేదని, ధర్నా వద్దకు సర్పంచ్ వచ్చి సమాధానం చెప్పాలని మహిళలు డిమాండ్ చేశారు. పోలీసులు మహిళలను సముదాయించి ధర్నా విరమింపజేశారు.
ఫ ఇల్లందకుంటలో...
ఇల్లందకుంట: ఇల్లందకుంట మండలంలోని సీతంపేట గ్రామంలో టీఆర్‌ఎస్ నాయకులు పంపిణీ చేసిన డబ్బులు మాకు రాలేదంటూ గ్రామ మహిళలు రోడ్డుపై ఆందోళన చేశారు. ఈ డబ్బుల వల్ల మా గ్రామంలో గొడవలు మొదలయ్యాయని, మాకు డబ్బు లు ఇవ్వకుంటే ఓటుకు దూరంగా ఉంటామన్నారు. డబ్బులు పంపిణీ చేసిన నాయకులను అడుగగా, ఇన్‌చార్జీలకే డబ్బుల విషయం తెలుసని, మాకు ఏం తెలియదని, మాట దాట వేశారని ధ్వజమెత్తారు.
Updated Date - 2021-10-29T05:45:54+05:30 IST