శ్మశానంలో ఐసొలేషన్
ABN, First Publish Date - 2021-06-09T09:18:51+05:30
కరోనా బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాలకు వెళ్లడమో..
- భద్రాద్రి జిల్లా మొద్దులమడ గిరిజనుల
- నిర్ణయం.. 50 మందికి వైరస్ వల్లే
- రాష్ట్రంలో1.33 లక్షల టెస్టులు..
- 1,897 కేసులు, 15 మంది మృతి
- వైకుంఠ ధామంలోనే వంట, భోజనాలకు ఏర్పాట్లు
హైదరాబాద్/అశ్వారావుపేట, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): కరోనా బాధితులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాలకు వెళ్లడమో.. హోం ఐసొలేషన్‌లో ఉండటమో చేస్తుంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గిరిజన గ్రామం మొద్దులమడ వాసులు భిన్నంగా వ్యవహరించారు. 150 జనాభా ఉన్న ఈ గ్రామం లో 50 మందికి పాజిటివ్ వచ్చింది. ఇంటికొకరు వైరస్ బారినపడ్డారు. దీంతో తమ ద్వారా మిగతావారికి వ్యాపించకుండా ఉండేందుకు వైకుంఠధామం (శ్మశానం)ను ఐసొలేషన్ కేంద్రంగా ఎంచుకున్నారు. ఈ మేరకు రెండు రోజుల నుంచి వైకుంఠధామంలోనే ఉంటున్నారు. సామూహిక వంటలకు ఏర్పాట్లు చేసుకున్నారు. వీరికి అవసరమైన ఆహార సామగ్రిని ఊరి ప్రజలు సమకూర్చారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, బంధువులూ కొంతసాయం చేశారు. టీఆర్‌ఎస్ నాయకుడు బిర్రం వెంకటేశ్వరరావు నిత్యావసర వస్తువులను అందజేశారు. చిప్పల బాబు భోజనాలు పంపిస్తున్నారు. కాగా, మొద్దులమడలో కరోనా సోకినవారిని ఐసొలేషన్ కేంద్రానికి తరలించి వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీనికి వారు అంగీకరించడం లేదు. ఇక్కడే తమకు స్వేచ్ఛగా ఉందని చెబుతున్నారు.
కూతురి పెళ్లి రోజే తండ్రి మృతి
కూతరు పెళ్లి జరగాల్సిన రోజే తండ్రి కరోనాతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది. భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన గంగిరెడ్డి సాంబశివయ్య (45) పెద్ద కూతురు వివాహం సోమవారం జరగాల్సి ఉంది. అయితే, గత నెల 31న కరోనా బారినపడిన సాంబశివయ్య.. హోం ఐసొలేషన్‌లో ఉంటూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
రెండు కుటుంబాలను చిదిమేసిన కరోనా
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కరోనా రెండు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. విఠల్‌నగర్‌లో నివసించే కొంకటి శంకర్ (62) మంగళవారం వైర్‌సతో చనిపోయాడు. ఈయన భార్య కమలమ్మ (55) ఐదు రోజుల క్రితం మృతి చెందింది. తిలక్‌నగర్‌కు చెందిన రాములు(52) మంగళవారం చనిపోగా.. ఈయన భార్య గంగమ్మ(46) గతనెల 28న మరణించింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లికి చెందిన జి.శ్రీనివా్‌సరెడ్డి (33) మంగళవా రం బ్లాక్ ఫంగ్‌సతో మృతి చెందాడు. కరోనా నుంచి కోలుకున్న వారం రోజులకు శ్రీనివా్‌సరెడ్డి అస్వస్థతకు గురయ్యాడు. వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా బ్లాక్ ఫంగ్‌సగా గుర్తించారు. సికింద్రాబాద్ గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఏపీలో 7,796 కేసులు.. 77 మంది మృతి
ఏపీలో గత 24 గంటల్లో 89,732 శాంపిళ్లను పరీక్షించగా 7,796 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 77 మంది వైర్‌సతో మృతి చెందారు.
రికార్డు స్థాయిలో టీకా, టెస్టులు
రాష్ట్రంలో టీకా పంపిణీ వేగం పుంజుకొంది. సోమవారం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది. ఒక్క రోజులో రెండు డోసులు కలిపి 1,66,818 మందికి టీకా వేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని 696 కేంద్రాల్లో 1,10,291 మందికి, ప్రైవేటులో 31 కేంద్రాల్లో 56,527 మందికి టీకా ఇచ్చారు. ఇందులో 1,54,208 మంది తొలి డోసు, 12,610 మంది రెండో డోసు వేసుకున్నారు. కాగా, మంగళవారం అత్యధికంగా 1,33,134 టెస్టులు నిర్వహించారు. 1,897 మందికి వైరస్ నిర్ధారణ అయింది. 15 మంది మృతి చెందారు. మొత్తం కేసులు 5,95,000కు, మరణాలు 3,409కు పెరిగాయి. 2,982 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 5,67,285 మంది కోలుకున్నారు. 24,306 క్రియాశీల కేసులున్నాయి. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 182, ఖమ్మంలో 163, నల్లగొండలో 151, రంగారెడ్డిలో 114, మేడ్చల్‌లో 101 వచ్చాయి.
Updated Date - 2021-06-09T09:18:51+05:30 IST