ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిండా ముంచారు

ABN, First Publish Date - 2021-03-31T07:50:32+05:30

‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో’ అని దాశరథి అన్నట్లుగా ధగధగలాడుతున్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం వెనుక ఆస్తులన్నీ వదులుకొని కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ రైతు కుటుంబాల్లోని చీకట్లు కనిపించేదెవరికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పరిహారం ఇవ్వకుండానే నిర్వాసితుల్ని ఇంట్లోంచి వెళ్లగొట్టేశారు
  • సాయం దక్కలేదనే ఆవేదనతో ఆగుతున్న ఊపిరి
  • కొన్నిచోట్ల అరకొర సాయం.. కొన్నిచోట్ల అదీ లేదు
  • పరిహారంపై రైతుల అసంతృప్తి, కొందరు కోర్టులకూ
  • ధరలు పెరిగాయి.. భూమికి ప్రతిగా భూమి ఇవ్వాలి
  • లేదంటే మార్కెట్‌ ధరైనా ఇవ్వండి.. రైతుల డిమాండ్‌ 
  • నిర్మాణాల వద్ద పనులను అడ్డుకుంటున్న వైనం 
  • ఆ కారణంగానే పనులకు ఆటంకం.. ఆలస్యం! 
  • సాగర్‌, పులిచింతల నిర్వాసితులకూ రాని సాయం
  • ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి


అది సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌ రిజర్వాయర్‌. 3.33 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్‌ కోసం బెజ్జంకి మండలం తోటపల్లి దాచారం, లద్దబండ గ్రామాల్లో భూములు సేకరించారు. ముంపు గ్రామంగా ప్రకటించిన లద్దబండ వాసులకు నష్టపరిహారం కింద నగదు సాయంతో పాటు అనువుగా ఉన్న మరోచోట చోట డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే గ్రామంలోని 23 ఇళ్లలో ఆరు కుటుంబాలకు మాత్రమే అదీ నామమాత్రంగా పరిహారం చెల్లించి చేతులు దులుపుకొన్నారు. పరిహారం కోసం ఎదురుచూస్తూ ఆ ఊర్లోనే ఉంటున్న బాధితులు, రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌ కారణంగా తేళ్లు, జెర్రులు, పాముల మధ్యే బిక్కుబిక్కుమంటూ గడిపారు. అధికారులొచ్చి పరిహారం మాటెత్తకుండా గ్రామం నుంచి వారిని బలవంతంగా ఖాళీ చేయించి, పునరావాసం పేరుతో ఆర్నెల్ల క్రితం దాచారం గ్రామంలోని పాఠశాలకు తరలించారు. ఉండేందుకు ఆ బడి చాలకపోవడంతో బాధితుల్లో చాలామంది దాచారం, బెజ్జంకి గ్రామాల్లో అద్దె ఇళ్లు తీసుకొని ఉంటున్నారు. ఇటీవల బడులు తెరుచుకోవడంతో అక్కడ ఉంటున్న మిగతా కుటుంబాలపై కూడా ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. రిజర్వాయర్‌ కోసం ఉన్న ఇంటిని, కన్నతల్లిలాంటి భూమిని కూడా ఇస్తే ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం రాలేదని బాధితులు వాపోయారు. పరిహారం ఇక రాదేమోనన్న రందితో గ్రామానికి చెందిన అమరగొండ మల్లయ్య, బురుగుల నర్సింగరావు ప్రాణాలు విడిచారు. 


రూ.8.6లక్షలిస్తామని.. రూ.2.47 లక్షలే!  

ములుగుజిల్లా రామప్ప-లక్నవరం గ్రావిటీ కెనాల్‌ నిర్మాణం కోసం 145 ఎకరాలను రైతుల నుంచి సేకరించారు. ఎకరాకు రూ.8.6 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని రైతులతో సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. తీరా ఇప్పుడు అంత ఇవ్వలేమని, రూ.2.47 లక్షల చొప్పున చెల్లిస్తామని మాట మార్చింది. ఇక్కడ ఎకరం ధర రూ.15 లక్షలపైనే ఉంది. న్యాయపరంగా పరిహారం చెల్లించేదాకా కాల్వ నిర్మాణం పనులు సాగనివ్వబోమని రైతులు అక్కడ ఆందోళన చేస్తున్నారు.  


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ‘ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో’ అని దాశరథి అన్నట్లుగా ధగధగలాడుతున్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం వెనుక ఆస్తులన్నీ వదులుకొని కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ రైతు కుటుంబాల్లోని చీకట్లు కనిపించేదెవరికి? ‘ఆధునిక దేవాలయాల’ నిర్మాణంలో భాగస్వాములైనా అక్కరకు రాకుండా మిగిలిపోయిన ఆ రైతులకు పరిహారం దక్కేదెన్నడు? ఆవేదన, అసంతృప్తి, ఆందోళనలు దూరమై వదులుకున్న ఆస్తులకు పూర్తి సాయం దక్కి.. ఆ రైతుల కళ్లలో తృప్తి కనిపించేరోజు ఇంకెంత దూరం? అన్నీ సమాధానం  దొరకని ప్రశ్నలే! నిర్మాణమవుతున్న రిజర్వాయర్లు, కాలువల్లో చాలా చోట్ల పరిహారం అరకొరగా దక్కడమో.. అసలే దక్కకపోవడమో అన్న పరిస్థితుల్లో భూ నిర్వాసితులు గోస పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పండుగలా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం, భూములిచ్చిన రైతులకు మాత్రం  తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఈ రెండు మూడేళ్లలో సాగుభూముల ధరలు బాగా పెరిగాయి. ఈ విషయాన్ని ఇటీవలే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రస్తావించారు. ఎకరా రూ.10 లక్షల లోపు లభించే పరిస్థితి రాష్ట్రంలో లేదు అని మరో సందర్భంలోనూ సీఎం పేర్కొన్నారు. 


వాస్తవంగా సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ ఇతర అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా భూముల ధరలు చాలాచోట్ల రెట్టింపయ్యాయి. అయితే సాగు నీటి ప్రాజెక్టులకు భూములిచ్చిన రైతులకు ఆ స్థాయిలో పరిహారం దక్కడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల ఎకరానికి రూ.6-7 లక్షఽలు ఇంకొన్ని చోట్ల మరీ తక్కువగా రూ.2-3 లక్షలు సాయంగా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిర్మాణాలు దాదాపు పూర్తయినా పైసా సాయం అందని రైతులు ఎంతోమంది ఉన్నారు. ప్రభుత్వ నుంచి సాయం వస్తుందన్న ఆశతో మనసు రాయి చేసుకొని ఏళ్లుగా ఉంటున్న ఇంటిని.. ప్రాణంలాంటి సాగుభూమిని.. కన్నతల్లిలాంటి ఊరును వదులుకొని రోడ్డు మీద నిలబడ్డామని, ఆ సాయం మాత్రం దక్కడం లేదని బాధితులు వాపోతున్నారు. చాలా చోట్ల బాధితులు ఆందోళన బాట పడుతున్నారు. పరిహారం చెల్లిస్తే తప్ప నిర్మాణాలు చేపట్టొద్దంటూ నిర్మాణ స్థలికి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. భూ సేకరణలో భాగంగా సాగుభూములిచ్చిన చోట్ల పరిస్థితులను  ుఆంధ్రజ్యోతి్‌ క్షేత్రస్థాయిలో పరిశీలిచింది. 


కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్‌ రిజర్వాయర్‌ కింద మంగపేటకు చెందిన 97.14 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. 2017లో ఎకరాకు రూ.10 లక్షల పరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పటిదాకా రైతులకు పైసా చెల్లించలేదు. సైదాపూర్‌ మండలం నుంచి మిడ్‌మానేరు ఈ కాలువ కింద 421 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు 316 ఎకరాలు స్వాధీనం చేసుకొని డబ్బులు చెల్లించారు. మిగిలిన 105 ఎకరాలకు చెల్లించాల్సి ఉంది. 

 

పెద్దపల్లి జిల్లాలో అన్నారం వద్ద నిర్మించిన సరస్వతి బ్యారేజీ బ్యాక్‌ వాటర్‌లో మంథని మండలం ఆరెందలో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడ సుమారు 150 ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. ఎకరానికి రూ.6.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఖరారు చేశారు. ఖాన్‌సాయిపేట, అమ్మగారిపల్లెకు చెందిన 100 ఎకరాలు కూడా ముంపునకు గురవుతున్నాయి. వీటి సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసినా ఖరారు కాలేదు. తమకు పరిహారం చెల్లించాలని ఆరెంద ప్రజలు పలు మార్లు ఆందోళనలు చేపట్టారు. పార్వతి బ్యారేజ్‌ బ్యాక్‌ వాటర్‌లో రామగిరి మండలంలోని జనగామ, మల్కాపూర్‌ గ్రామాలకు చెందిన సుమారు 150 ఎకరాల పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఈభూములు సేకరించాలని రైతులు ఆందోళన చేపట్టడంతో నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇంకా చెల్లింపులు పూర్తి కాలేదు.


సిరిసిల్ల జిల్లా  అనంతగిరి  వద్ద నిర్మించిన అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన అనంతగిరి గ్రామ నిర్వాసితులకు పునరావాస చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. 228 ఎకరాలకు సంబంధించి 147 మంది రైతులకు, ఇళ్లకు సంబంధించి  124 మందికి పరిహారం అందించాలి. అనంతగిరి ముంపు బాధితులు 11 మంది... పునరావాసం ప్యాకేజీ ఇవ్వకుండానే భూమిని స్వాధీనం చేసుకున్నారంటూ కోర్డును అశ్రయించగా 2018 అక్టోబరులో నీటిని నింపవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులనిచ్చింది. 

 

మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం వీరాపూర్‌ శివారులోని దుబ్బగూడెం ప్రాజెక్టు ముంపు భూముల నష్ట పరిహారం చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బెల్లంపల్లి నియోజక వర్గం కన్నెపల్లి మండల పరిధిలోని వీరాపూర్‌ శివారు నల్లవాగు పై నిర్మించిన దుబ్బగూడెం ప్రాజెక్టు పనులను 2006లో ప్రారంభించారు. ప్రాజెక్టు కింద 3,300 ఎకరాల ఆయకట్టు ఉండగా ఇరువైపులా కాలువలు నిర్మించడం ద్వారా సాగునీరు అందించాలని ప్రణాళికలు రూపొందించారు. మండలంలోని వీరాపూర్‌, రెబ్బెన, అంకన్నపేట పరిధిలో మొత్తం 237.39 ఎకరాలు ముంపునకు గురవుతుండగా, అందులో 127.30 ఎకరాల ప్రభుత్వ భూమికాగా మిగతా 110.09 ఎకరాల పట్టా భూములను రైతుల నుంచి సేకరించారు. నిర్వాసితుల్లో కమీషన్లు ఇచ్చేందుకు నిరాకరించిన 30 మందికి ఇప్పటికీ నష్టపరిహారం అందలేదు. ఈ విషయమై ముంపు బాధితులు జిల్లా ఉన్నతాఽధికారులకు  వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 

 

భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలంలో సరస్వతి బ్యారేజీ, లక్ష్మి పంప్‌ హౌజ్‌ కింద భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం ఆందోళన చేస్తున్నారు. కన్నెపల్లి (మెట్‌పల్లి)లోని లక్ష్మిపంప్‌ హౌజ్‌ కింద 8 ఎకరాల స్థల సేకరణ జరిగింది. ఎకరానికి రూ 5.50 లక్షల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరం తెలిపింది. కాని ఇప్పటి వరకు పరిహారం చెల్లింపు జరగలేదు. సరస్వతి బ్యారేజి కింద మరో 8 ఎకరాలకు నష్టపరిహారం చెల్లింపు జరగలేదు.


50 టీఎంసీల భారీ సామర్థ్యంతో నిర్మిస్తున్న కొమురవెళ్లి మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌కు సంబంధించి దాదాపు 99 శాతం భూసేకరణ పూర్తి అయ్యినట్లే.. మొత్తం మల్లన్నసాగర్‌లో భాగంగా చాలా వరకు ఒంటరి మహిళలకు ఆర్‌అండ్‌ఆర్‌లు ఇవ్వలేదు. వీళ్లకు సంబంధించి హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. అలాగే 18+ వారికి పూర్తి ప్యాకేజ్‌ ఇవ్వాలనే కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సుమారు 50 ఎకరాల భూములకు సంబంధించి కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. వేములఘాట్‌, ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామాలకు ఇండ్లకు సంబంధించి కేసులు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. పరిహారం పూర్తిగా అందకపోవడంతో మల్లన్నసాగర్‌ వద్ద పనులను నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. గ్రామాలను ఖాళీ చేయడం లేదు.


సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మిస్తున్న 8.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన గౌరవెల్లి రిజర్వాయర్‌ నిర్మాణంలో గుడాటిపల్లి పరిధిలోని తెనుగుపల్లి, మద్దెలపల్లి, సవులపల్లి, సోమజీతండా, సేవా నాయక్‌ తండా, కొత్తపల్లి, బొందనాయక్‌ తండా, జాలువాయీ తండా, చింతల తండా, తిరుమల తండా పరిధిలోని 3,836 ఎకరాలతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. ఎకరాకు రూ.6.95 లక్షల చొప్పున భూసేకరణ చేశారు. ఈ గ్రామాల పరిధిలో 936 మంది నిర్వాసితులు ఉండగా, ఇందులో 80 మంది నిర్వాసితులు ఎకరాకు రూ.15 లక్షలు చొప్పున చెల్లించాలని, ఇప్పటివరకు 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ రూ.8 లక్షలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ కట్టించి ఇవ్వాలని కోరుతూ కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం భూ నిర్వాసితులు గౌరవెల్లి ప్రాజెక్ట్‌ పనులను అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి.


ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలులో సీతారామ ఎత్తిపోతల పథకం కాలువ నిర్మాణం కోసం భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగా రైతులు  ఇటీవల అడ్డుకున్నారు. అక్కడ ఎకరానికి రూ.18 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులేమో భూమికి ప్రతిగా భూమి ఇవ్వాలని, లేదంటే ఎకరానికి రూ.30 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కామేపల్లి మండలంలో సీతారామ ఎత్తిపోతల పథకం కాలవ నిర్మాణం కోసం రెవెన్యూ అధికారులు పింజరమడుగు రైతులతో సమావేశం నిర్వహించగా ఎకరానికి రూ.25లక్షలు ఇస్తేనే భూములు ఇస్తామని, లేదంటే ఇవ్వబోమని స్పష్టంచేశారు. 

 

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలో 2490 ఎకరాల భూసేకరణ చేశారు. ఇప్పటి వరకు 70 శాతం మంతికి పరిహారం అందజేయగా, కోర్టు వివాదాల్లో ఉన్న భూముల రైతులకు పరిహారం అందించలేదు. నిర్వాసితులకు ఆర్‌ఆండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద సున్నపు తండా, బొడబండ తాండ, అంజనగిరి, వడ్డే గుడిసెలు, ఎల్లూరు గ్రామాల్లో ఉన్న వారందరికీ 123 జీవో ప్రకారం కుటుంబానికి రూ.5.04 లక్షల పరిహారాన్ని 199 మందికి అందించిన ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. కుటుంబంలో 18ఏళ్లు నిండిన మరో 117 మందికి పరిహారం ఇవ్వలేదని నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు.

  

శంకర సముద్రం రిజర్వాయర్‌కు సంబంధించి రూ. 4.37 కోట్లతో 110 ఎకరాల భూమి సేకరించి రూ. 8.15 కోట్లతో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మాణం పూర్తిచేశారు. పరిహారానికి సంబంధించి రూ.26.94 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ. 18.21 కోట్లు  చెల్లించారు.


మొక్కుబడి సాయం.. అదీ కొందరికే!

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అదో ఎత్తిపోతల కాలువ నిర్మాణం. జగిత్యాల జిల్లా పెరగడపల్లి శివారులోని ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌ను కరీంనగర్‌ జిల్లా  రామడుగు మండలం తిరుమలాపూర్‌ వద్ద గల 95వ కిలోమీటరు వద్ద ఉన్న కాలువలోకి వదిలేలా 33 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం చేపట్టారు. ఇందుకు 633 మంది రైతులకు చెందిన 893 ఎకరాలను సేకరించారు. ఇప్పటివరకు 15 మందికి మాత్రమే పరిహారం చెల్లించారు. అదీ.. బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ.20 లక్షలకు పైనే పలుకుతున్న పరిస్థితుల్లో రూ.7.2 లక్షల నుంచి రూ.9లక్షల చొప్పునే ఇచ్చారు. పరిహారం ఇంకెప్పుడు చెల్లిస్తారని మిగతా రైతులు ఎదురుచూస్తున్నారు.


నిర్మాణాలకూ ఆటంకం 


చాలాచోట్ల పరిహారం దక్కడకపోవడంతో భూ నిర్వాసితులు, నిర్మాణాల వద్దకు వెళ్లి ఆందోళన చేస్తున్నారు. ఒప్పందం మేరకు పహారం ఇవ్వాలని లేదంటే అప్పటిదాకా పనులను నిలిపివేయాలని స్పష్టం చేస్తున్నారు. దీంతో కొన్నిచోట్ల నిర్మాణాలు ఆగిపోతున్నాయి. ప్రధానంగా ఈ సమస్య కాలువల నిర్మాణాల వద్ద ఉంటోంది. 


సాగర్‌, పులిచింతల బాధితులకు అందని పరిహారం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు, పులిచింతల ముంపు బాధితులకు నేటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. దశాబ్దాల కాలంగా గిరిజన రైతులు సాగర్‌ ముంపు పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. సాగర్‌ నిర్మాణ సమయంలో మఠంపల్లి మండలం గుర్రంబోడులోని 540 సర్వే నెంబర్‌లో గిరిజన కుటుంబాలకు భూములు కేటాయించారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ ముంపు ప్రాంతమైన చందంపేట, గువ్వలగట్టు, కంబాలపల్లి, పెద్దమునగండ్ల, చిన్నమునగండ్లకు చెందిన 200 కుటుంబాలకు 3వేల ఎకరాల భూమి కేటాయించారు. కాగా, అందులో కొంతమంది గిరిజన రైతులకు 1870 ఎకరాల భూములు కేటాయించారు. వారిలో వందమందికి డీ-పట్టాలు ఇచ్చారు. రాళ్లు, గుట్టలుగా ఉన్న గుర్రంబోడు భూములను కొంతమంది రైతులు సాగు చేసుకున్నారు. మిగతా భూములను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఆక్రమించుకుని ఇతరులకు విక్రయించారు. గుర్రంబోడు గిరిజనుల భూములు ఆక్రమణకు గురికావడంతోపాటు, ఈ భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు మరికొంత భూములను స్వాధీనం చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ లాంటి వారు గుర్రంబోడు గిరిజనులకు న్యాయం చేయాలని పలుమార్లు ఆందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది.  


వేదనతో మా నాన్న చచ్చిపోయిండు

లద్దంబడలో మా ఇల్లు, భూమి మునిగిపోయింది. ఇంటికి నామమాత్రంగా పరిహారాన్ని ఇచ్చారు. తోటపల్లి రిజర్వాయర్‌లో బ్యాక్‌ వాటర్‌ పెరగడంతో అధికారులొచ్చి పునరావాస కేంద్రం అంటూ బలవంతంగా  దాచారంలోని ఓ స్కూల్లో దించి తీసుకెళ్లారు. ఇటీవల ఆ స్కూలునూ ఖాళీ చేయాలని చెప్పడంతో మా నాన్న అద్దె ఇంటి కోసం ఊరంతా వెతికాడు. ప్రభుత్వం చెప్పినట్లుగా మాకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు రాలేదని, పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించలేదనే మనోవేదనతో మా నాన్న మృతిచెందాడు. 

కమలాకర్‌, సిద్దిపేట జిల్లా 


పసి పిల్లలను పట్టుకొని ఎక్కడికి పోవాలి? 

తోటపల్లి రిజర్వాయర్‌లో మా ఊరును ముంచారు. ఇల్లు కట్టించి..పైసలు ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఇల్లు ఇవ్వలేదు. పైసలు కూడా ఇవ్వలేదు. ఓ సర్కారు బడిలో మమ్మల్ని ఉంచారు. అధికారులకు మా మీద దయ కలగడం లేదా? పసి పిల్లలను పట్టుకొని మేం ఎక్కడుండాలి.. ఎక్కడికిపోవాలె? 

బురుగుల రాజేశ్వరరావు, సిద్దిపేట జిల్లా 


2 ఎకరాలకు పైగా కోల్పోయాం

దుబ్బగూడెం ప్రాజెక్టులో 2.28 ఎకరాల భూమి ముంపునకు గురైనది. ఇంతవరకు ఒక్క పైసా రాలేదు. కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నాము. అధికారులు నష్ట పరిహారం చెల్లించాలి. 

దిగడ జగ్గమ్మ, రెబ్బన (కన్నెపల్లి మండలం)

Updated Date - 2021-03-31T07:50:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising