రంగురాళ్ల జ్యోతిష్యుడి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి...
ABN, First Publish Date - 2021-06-25T14:52:46+05:30
బండ్లగూడలో ఉంటాడనే విషయం కూడా ఎక్కువ మందికి తెలియదని ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో తేలింది....
- పిల్లలు ఆడుకునే కరెన్సీతో బురిడీ
- కోట్ల రుపాయలున్నాయని నమ్మించిన మురళీకృష్ణ శర్మ
హైదరాబాద్ సిటీ/కొత్తపేట : పిల్లలు ఆడుకునే కరెన్సీ చూపి అసలు నగదు నొక్కేస్తూ జ్యోతిష్కుడు బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ అమాయకులను బురిడీ కొట్టించాడు. అతడిని, అతడి వద్ద ఉన్న నకిలీ కరెన్సీ నిజమని భ్రమించి నకిలీ కరెన్సీ నోట్లను, కొంత నిజమైన కరెన్సీని చోరీ చేసిన ఆరుగురినీ సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మురళీకృష్ణ శర్మ నాగోల్ బండ్లగూడలో రెండు ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఓ ఇంట్లో రంగురాళ్లు, నకిలీ కరెన్సీ నోట్లు దాచుకునేవాడు. అక్కడే ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ (టీపీఎఫ్)సంస్థకు డబ్బు బదిలీ చేసేవారు అతడిని కలిసేవారని తెలిసింది.
ఈ ఇంట్లోనే అతడు బయటి నుంచి వచ్చేవారికి పెద్ద మొత్తంలో నకిలీ/పిల్లలు ఆడుకునే 2 వేల రూపాయల కరెన్సీ నోట్ల కట్టలను దూరం నుంచి చూపించేవాడని సమాచారం. నమ్మకం లేని కొందరికి కాస్త దగ్గరగా ఈ కరెన్సీ కట్టలో పైన ఓ నిజమైన నోటు పెట్టి చూపేవాడని తెలుస్తోంది. బండ్లగూడలోనే అన్ని సౌకర్యాలతో ఉన్న మరో అద్దె ఇంట్లో ఒక్కడే ఉండేవాడు. సదరు ఇంటి యజమాని నాగోల్‌లో ఓ టింబర్ డిపో నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పరిస్థితిని బట్టి తనతో వ్యాపారం చేసేవాళ్లతో మురళీకృష్ణ శర్మ తానుండే ఇంట్లో గానీ, ఈ టింబర్ డిపోలో గానీ సమావేశమయ్యేవాడని తెలిసింది.
కోట్ల రూపాయలున్నాయని..
తనవద్ద కోట్ల రుపాయలున్నాయని నమ్మించేదుకు మురళీకృష్ణ శర్మ నూరొద్దీన్ సహకారంతో పిల్లలు ఆడుకునే 2 వేల కరెన్సీ నోట్లు కొనుగోలు చేశాడు. ముంబాయి నుంచి ఈ పిల్లల కరెన్సీ నోట్లను బేగంపేటలోని ఓ వ్యాపారి దిగుమతి చేసుకుని అవసరమున్న వారికి విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ కరెన్సీని చూసి కొందరు తమ వద్ద ఉన్న అసలు నగదును కోల్పోతే, ఆరుగురు పిడుగురాళ్ల వ్యక్తులు వాటిని చోరీ చేసి కటకటాల పాలయ్యారు. ప్రస్తుతానికి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మురళీకృష్ణ శర్మ మాయమాటలు నమ్మి ఇతర రాష్ట్రాలకు చెందిన ఓ నలుగురు వ్యక్తులు రూ.33 లక్షలు పోగొట్టుకున్నారని తేలింది. ఇంకెందరో నష్టపోయి ఉండవచ్చని బాధితులు ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేపడుతామని ఓ పోలీసు అధికారి తెలిపారు.
కంపెనీల్లో, షేర్ల వ్యాపారం..
ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్(టీపీఎఫ్) నుంచి 90 కోట్ల రూపాయలను మురళీకృష్ణకు చెందిన మిసర్స్ భక్తినిధికి హెలీ వేపూరి బదిలీ చేయడం, ఆ తర్వాత తన వ్యక్తిగత అకౌంట్‌కు మురళీకృష్ణ రూ.10 లక్షలు బదిలీ చేసుకోవడం తెలిసిందే. స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిస్తానంటూ అందుకు వారు తనకు యాభై శాతం కమిషన్ ఇవ్వాలని, తన వద్ద ఉన్న పిల్లలు ఆడుకునే కరెన్సీ కట్టలను చూపి కొందరిని మోసం చేసినట్లు తెలిసింది.
ఆ జ్యోతిషుడు బండ్లగూడలో ఉంటున్నాడని..
టీవీ చానెళ్లలో జాతకాల, గ్రహస్థితులు, రాశీఫలాలు, రంగురాళ్ల వాడకం తదితర అంశాలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పే మురళీకృష్ణ శర్మ నాగోల్, బండ్లగూడలో ఉంటాడనే విషయం కూడా ఎక్కువ మందికి తెలియదని ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో తేలింది. తన భక్తినిధి వెబ్‌సైట్ ద్వారా సంప్రదించేవారికి తాను సూచించిన రంగురాళ్లు ఆన్‌లైన్ ద్వారా విక్రయించేవాడు.
Updated Date - 2021-06-25T14:52:46+05:30 IST