హైదరాబాద్ : దశాబ్దాల కల నెరవేరింది.. రేపే ప్రారంభం..
ABN, First Publish Date - 2021-07-05T18:28:34+05:30
దశాబ్దాల కాలం నుంచి బాలానగర్ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలకు రెండు రోజుల్లో శాశ్వత పరిష్కారం లభించనుంది.
- మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం
- సీఎంను ఒప్పించి, మంజూరు చేయించిన ఎమ్మెల్యే
హైదరాబాద్ సిటీ/బాలానగర్ : దశాబ్దాల కాలం నుంచి బాలానగర్ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలకు రెండు రోజుల్లో శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నర్సాపూ ర్ చౌరస్తావద్ద బ్రిడ్జి నిర్మించాలని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్‌ను నాలుగేళ్ల క్రితం మెప్పించి ఒప్పించారు. 2017 ఆగష్టు 21న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ ఫ్లై ఓవర్‌ను మంగళవారం ప్రారంభించనున్నారు.
రూ. 387 కోట్లు
బాలానగర్ ఆంధ్రాబ్యాంకు నుంచి శోభనా బస్టాపు వరకు 1.13 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు(ఆరులైన్లు)తో 24 పిల్లర్లతో బ్రిడ్జినిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బ్రిడ్జి నిర్మాణం కోసం మంజూరైన రూ.387 కోట్ల నిధులలో రూ.122 కోట్లు బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం, ఆస్తుల సేకరణలో స్థలాలు, షాపులు కోల్పోయిన 355 మందికి రూ.265 కోట్లు నష్ట పరిహారం చెల్లించారు.
తలమానికంగా ఫ్లై ఓవర్
నగరానికే తలమానికంగా నిలిచేలా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యవేక్షణలో బ్రిడ్జి పనులు అత్యంత వేగంగా పూర్తయ్యాయి. ప్రస్తుతం సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. బ్రిడ్జి కింది భాగంలో పిల్లరు పిల్లరు మధ్య డివైడర్లు ఏర్పాటుచేసి, ఖాళీ స్థలంలో పచ్చని మొక్కలు ఏర్పాటు చేస్తున్నారు.
బాబుజగ్జీవన్‌రామ్ పేరు
బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి పీజేఆర్ పేరు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ తల్లి ఫ్లై ఓవర్ అని టీఆర్‌ఎస్ నాయకులు, ఇలా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు వినతి పత్రాలు అందించారు. బ్రిడ్జికి బాబు జగ్జీవన్ రామ్ పేరు పెట్టాలని, బ్రిడ్జి నిర్మాణం ప్రారంభ దశనుంచే దళితులు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారని, అందుకే బ్రిడ్జికి బాబుజగ్జీవన్ రామ్‌గా నామకరణం చేస్తున్నానని, సొంత నిధులతో బాబు జగ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహాన్ని తయారు చేయిస్తున్నానని ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో బ్రిడ్జి పేరుకు సస్పెన్స్ వీడింది.
లాక్ డౌన్‌తో ఆలస్యం
స్థలాలు, ఆస్తులు కోల్పోతున్న వారు కోర్టుకు వెళ్లడం, కొవిడ్, లాక్‌డౌన్ కారణంగా బ్రిడ్జి పనులు కుంటుపడి ప్రారంభోత్సవం కాస్త ఆలస్యమైంది. ప్రభుత్వాలు, పార్టీ నాయులు ఎందరో మారినా ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరకలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ నిధులు కేటాయించడం బ్రిడ్జి పూర్తి అయింది. బాలానగర్ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా. - ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
ఎమ్మెల్యేకు రుణ పడి ఉంటాం
బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జికి మహనీయులు బాబుజగ్జీవన్ రామ్ పేరును పెట్టడం సంతోషంగా ఉంది. దళిత సంఘాలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాకుండా సొంత నిధులతో జగ్జీవన్‌రామ్ కాంస్య విగ్రహాన్ని తయారు చేయిస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు రుణ పడి ఉంటాం. - నల్ల విల్సన్, ముఖ్య సలహాదారుడు, దళిత సంక్షేమ సంఘం, బాలానగర్
ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి
బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉండేది. ఒక్కోసారి ఇటు ఐడీపీఎల్, అటు శోభనా కాలనీ వరకు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూ వచ్చేది. కానీ ఫ్లైఓవర్‌తో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. - బి.నరహరి, ట్రాఫిక్ సీఐ
Updated Date - 2021-07-05T18:28:34+05:30 IST