4 వారాల్లో తేల్చాలి
ABN, First Publish Date - 2021-08-27T09:23:56+05:30
హైదరాబాద్ జంట జలాశయాలకు ఎగువన జీవో 111 పరిధిలో ఉన్న భూముల్లో కొన్నింటికి మినహాయింపులు ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నాలుగు
111 జీవో మినహాయింపులపై నివేదిక ఇవ్వాలి..
ఇవ్వలేకపోతే హైపవర్ కమిటీ రద్దయినట్లే
వచ్చే నెలాఖరులోపు నివేదికపై నిర్ణయించాలి..
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ జంట జలాశయాలకు ఎగువన జీవో 111 పరిధిలో ఉన్న భూముల్లో కొన్నింటికి మినహాయింపులు ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అప్పట్లోగా నివేదిక ఇవ్వలేకపోతే హైపవర్ కమిటీ రద్దయినట్లుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. జీవో 111 అమలు, కోకాపేట భూముల వేలంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలతోపాటు వట్టినాగులపల్లి నాన్‌క్యాచ్‌మెంట్ ఏరియాలో ఉన్న తమ భూములను మినహాయించాలని అగ్ని ఆగ్రోటెక్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్ సేన్‌రెడ్డి ధర్మాసనం మరోమారు విచారణ చేపట్టింది. హైపవర్ కమిటీ నివేదిక సమర్పించడానికి నెల రోజుల సమయం ఇవ్వాలని ఆగస్టు 13న దాఖలు చేసిన అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో అప్పటి నుంచి నాలుగు వారాల్లో(సెప్టెంబరు13 నాటికి) నివేదిక సమర్పించాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
నివేదిక సమర్పించే క్రమంలో కమిటీ నాన్ క్యాచ్‌మెంట్ ఏరియా దృష్టి కోణంలో వివరాలు ప్రభుత్వం ముందు ఉంచాలని స్పష్టం చేసింది. సెప్టెంబరు ముగింపు నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికపై నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్పింది. హైపవర్ కమిటీ సమర్పించిన నివేదికను మున్సిపల్ శాఖ వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. పైన పేర్కొన్న గడువులోపు కమిటీ నివేదిక సమర్పించ లేకపోతే కమిటీ రద్దయిపోతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. హైపర్ కమిటీ రద్దయితే.. నాన్ క్యాచ్‌మెంట్ ఏరియాకు సంబంధించి 13 సంవత్సరాల కిందట పర్యావరణ పరిరక్షణ శిక్షణ పరిశోధన సంస్థ ఇచ్చిన నివేదిక చెల్లుబాటు అవుతుందని తెలిపింది. కక్షిదారులంతా ఆ నివేదిక ప్రకారం తమ ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. తాము పేర్కొన్న గడువును అంగీకరిస్తూ హైపవర్ కమిటీ చైర్మన్ వారం రోజుల లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
ఆలస్యం జరిగిన మాట వాస్తవమే: ఏఏజీ
జీవో 111 పరిధిపై పరిశీలనకు నియమించిన హైపవర్ కమిటీ నివేదిక ఆలస్యమైన మాట వాస్తవమేనని, అందుకు క్షమించాలని అదనపు అడ్వకేట్ జనరల్ జె.రామచంద్రరావు కోరారు. ఈ అంశంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. శ్రద్ధ లేకపోవడం కాదని, కేవలం ఆలస్యం మాత్రమే అయిందని తెలిపారు. కోవిడ్ 19 నేపథ్యంలో కమిటీ సకాలంలో నివేదిక సమర్పించలేక పోయిందని చెప్పారు. కమిటీ నియమించి నాలుగున్నర ఏళ్లు దాటినా నివేదిక ఇవ్వలేదని, నిర్దిష్టమైన సమయం ఏదీ లేకుండా గడువు పొడిగిస్తూ వెళ్లారని ధర్మాసనం ఆక్షేపించింది. కమిటీకి గడువు విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
రియల్టర్ల ఆట: కేఎస్ మూర్తి
ఇదంతా జీవో 111 నుంచి మినహాయింపులు పొందడానికి రియల్ ఎస్టేట్ సంస్థలు ఆడుతున్న నాటకమని జీవో 111 అమలు చేయాలని కోరుతున్న పిటిషనర్ల తరఫు న్యాయవాది కేఎస్ మూర్తి వాదించారు. ఆ ఆటలో హైకోర్టు భాగస్వామి కారాదని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. నిర్ణయం తీసుకునేది ప్రభుత్వమని, తాము కాదని హైకోర్టు బదులిచ్చింది. విచారణను ఆక్టోబరు 4కు వాయిదా వేసింది.
Updated Date - 2021-08-27T09:23:56+05:30 IST