కిలోల కొద్దీ బంగారు విరాళాలు
ABN, First Publish Date - 2021-10-21T09:24:13+05:30
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి..
యాదాద్రి ఆలయ గోపుర స్వర్ణతాపడానికి
భారీగా బంగారం ఇస్తున్న ప్రముఖులు
ఆరు కిలోల పుత్తడి ఇస్తామన్న మేఘా సంస్థ
ప్రణీత్ గ్రూప్ ఎండీ విరాళం 2 కిలోల పసిడి
వ్యాపారవేత్త ఎన్వీ రామరాజు విరాళం కిలో బంగారం
హైదరాబాద్, యాదాద్రి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీగా బంగారం దానం చేస్తున్నారు. యాదాద్రి ప్రధాన ఆలయం విమాన గోపురానికి 125 కిలోల బంగారంతో స్వర్ణ తాపడం చేయించాలని సీఎం కేసీఆర్ భావించారు. ఇందుకు సుమారు రూ.65కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ మేరకు దాతల నుంచి నగదు, బంగారాన్ని విరాళంగా సేకరించాలని భావించిన సీఎం.. 1.16 కిలోల బంగారాన్ని తన వంతు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి స్పూర్తితో చాలా మంది రాజకీయ, వ్యాపార ప్రముఖులు కిలోల కొద్దీ పుత్తడిని విరాళంగా ప్రకటిస్తున్నారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) 6 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించింది. యాదాద్రి పుణ్యక్షేత్రం విమాన గోపురానికి బంగారు తాపడం ఏర్పాటులో పాలుపంచుకోవడం గౌరవప్రదమైన అవకాశంగా భావిస్తున్నామని ఆ సంస్థ డైరెక్టర్ బి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అలాగే బుధవారం ప్రణీత్ గ్రూప్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు 2 కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త ఎన్.వి.రామరాజు కిలో బంగారాన్ని విరాళంగా అందజేస్తామని తెలిపారు.
భక్తుల నుంచి కూడా విరాళాల సేకరణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం బుధవారం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరిచారు. కాగా.. స్వర్ణతాపడానికి కావాల్సిన మేలిమి బంగారాన్ని రిజర్వు బ్యాంకు ద్వారా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దేవాదాయ, వైటీడీఏ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. ఇందులో ఎవరెవరు ఉండాలో అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ప్రత్యేక ఖాతా వివరాలు..
ఖాతా నంబరు: 6814884695
ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్: ఐడీఐబీ000వై011
ఇండియన్ బ్యాంక్, యాదగిరిగుట్ట
Updated Date - 2021-10-21T09:24:13+05:30 IST