గాంధీలో గ్యాంగ్ రేప్: అక్కాచెల్లెళ్ల కేసులో ఇదీ జరిగింది.. అందుకే వివరాలు గోప్యం..!
ABN, First Publish Date - 2021-08-20T08:52:24+05:30
‘గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం’, తాజాగా సంతోష్ నగర్‌లో ‘యువతిపై అత్యాచారం’ కేసులను పోలీసులు ఎట్టకేలకు ఓ కొలిక్కి తీసుకొచ్చారు
రెండు అత్యాచారాలూ అవాస్తవం!
గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై రేప్ జరగలేదు
ఇద్దరూ కల్లుకు బానిసలు దొరక్కపోవడంతో
విత్‌డ్రాయల్ సిండ్రోమ్ చిత్త భ్రమకు లోనై ఆస్పత్రిని
వీడి వెళ్లిపోయిన అక్క సంతోష్‌నగర్ యువతి
ఆరోపణల్లోనూ నిజం లేదుకేసులను కొలిక్కి తెచ్చిన పోలీసులు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ‘గాంధీ ఆస్పత్రిలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం’, తాజాగా సంతోష్ నగర్‌లో ‘యువతిపై అత్యాచారం’ కేసులను పోలీసులు ఎట్టకేలకు ఓ కొలిక్కి తీసుకొచ్చారు. రెండు ఘటనల్లోనూ అత్యాచారం జరగలేదనే నిర్ధారణకు వచ్చారు. బాధితుల ఆరోపణలకు ఆధారాలేవీ లభించలేదని చెబుతున్నారు. సీసీ కెమెరా దృశ్యాలు, వైద్య నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఆరోపణలు అవాస్తవమనే నిర్ధారణకు వచ్చారు.
అక్కాచెల్లెళ్ల కేసులో ఇదీ జరిగింది
గాంధీ ఆస్పత్రిలో తనతోపాటు అక్కపైనా అక్కడి సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈనెల 5న మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వ్యక్తి (అక్క భర్తను)ని అక్కాచెల్లెళ్లు గాంధీలో చేర్పించారు. ఇద్దరూ కల్లుకు బానిసలు. అతడిని ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత ఐదు రోజులపాటు వారు కల్లు తాగలేదు. ఆల్కహాల్ విత్‌డ్రాయల్ సిండ్రోమ్‌తో చిత్తభ్రమకు లోనయ్యారు. ఇందులో భాగంగానే, ఈనెల 11న భర్తను ఆస్పత్రిలోనే వదిలేసి అక్క ఎటో వెళ్లిపోయింది. ఆమె చెల్లినేమో 15 దాకా ఆస్పత్రిలోనే ఉంది. ఆస్పత్రి పరిసరాల్లో ఎక్కడా కల్లు దొరక్కపోవడంతో మానసిక సమస్యలను ఎదుర్కొంది. ఈ క్రమంలో 12, 14 తేదీల్లో తన ఇష్టపూర్వకంగా అక్కడి సెక్యూరిటీ గార్డుతో ఆమె సన్నిహితంగా మెలిగినట్లు పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం బయటపడింది. అయితే తనపై అత్యాచారం జరిగినట్లుగా పేర్కొన్న ఆ మహిళ, తాను సన్నిహితంగా గడిపిన వ్యక్తి పేరును చెప్పడం ఇష్టం లేక మరో వ్యక్తి పేరును చెప్పడం, పైగా సామూహిక అత్యాచారం జరిగిందని పేర్కొనడంతో కేసు దారి మళ్లింది. ఇక 11వ తేదీనే ఆస్పత్రి నుంచి బయటకొచ్చిన అక్క.. ముషీరాబాద్, భోలక్‌పూర్ వైపు వెళ్లిపోయింది. కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి ఆమెకు ఆశ్రయం కల్పించాడు. గురువారం ఆమెను పోలీసులకు గుర్తించారు.
ప్రేమికుడిని దారికి తెచ్చుకునేందుకే
తాజాగా సంతో్‌షనగర్ అత్యాచారం కేసునూ పోలీసులు ఛేదించారు. తనను కిడ్నాప్ చేసి.. షాహీన్‌నగర్‌లోని ఓ పాడైన బస్సులో అత్యాచారం చేశారంటూ 20 ఏళ్ల యువతి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆమెను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, ఆమెపై అఘాయిత్యమూ జరగలేదని విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు. షాహీన్‌నగర్‌కు చెందిన యువకుడిని ఆమె ప్రేమించింది. అయితే అప్పటికే అతడికి పెళ్లయింది. అతడిని తనవైపు తిప్పుకోవాలని యువతి భావించింది. షాహీన్‌నగర్‌లో తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే, అదే ప్రాంతంలో ఉంటున్న ప్రేమికుడిపైనే అనుమానం వస్తుందని, అతడు తనవైపు వచ్చేస్తాడని అనుకుంది. యువతి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేశారు. పాడైన బస్సులోనూ పరిశీలించారు. అక్కడా రేప్ జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అనంతరం యువతికి కౌన్సెలింగ్ నిర్వహించగా వాస్తవాలు వెల్లడయ్యాయి.
అందుకే వివరాలు గోప్యం
ఈ రెండు కేసుల్లోనూ బాధితులమంటూ మహిళ, యువతి ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినా వారిపట్ల పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించారు. ఇద్దరు మహిళలు, యువతి వివరాలను వెల్లడించలేదు. సీసీ కెమెరాల తాలూకు వివరాలనూ బయటపెట్టలేదు. వాస్తవాలు చెప్పకుంటే పోలీసులు ఏదో దాస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతాయని, అయితే అసలు వివరాలు వెల్లడిస్తే విపరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గతంలో ‘కీసర అత్యాచారం’ ఘటనను గుర్తు చేస్తున్నారు. యువతి అత్యాచార ఆరోపణలతో ఆ కేసు సంచలనంగా మారడం, అవన్నీ అబద్ధాలని తేలడం.. ఆ విషయాన్ని వెల్లడించడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మానవతా దృక్పథం, వారి కుటుంబ నేపథ్యం, పరువు దృష్ట్యా ఆలోచించి చట్టపరమైన చర్యలు ఏం తీసుకోవాలో ఇంకా నిర్ణయించాల్సి ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి వివరించారు.
Updated Date - 2021-08-20T08:52:24+05:30 IST