నిషేధిత గడ్డి మందు పట్టివేత
ABN, First Publish Date - 2021-06-05T06:09:00+05:30
నిషేధిత గడ్డి మందు పట్టివేత
కాటారంలో 187 లీటర్లు, చల్లగరిగలో 90 లీటర్ల గ్లైఫోసెట్ స్వాధీనం
కాటారం, జూన్ 4: కాటారం మండల కేంద్రంలోని క్రాంతి ట్రేడర్స్ అనే ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ షాపులో శుక్రవారం జిల్లా టాస్క్‌ఫోర్స్ టీం తనిఖీ చేసింది. నిషేధిత గ్లైఫోసెట్ గడ్డి మందు ఉన్నదనే సమాచారం మేరకు షాపుపై దాడి చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి విజయ్‌భాస్కర్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ మోహన్ తెలిపారు. ఈ దాడుల సందర్భంగా షాపులో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 187 లీటర్లకు పైగా నిషేధిత గ్లైఫోసెట్ మందును స్వాధీనం చేసుకున్నట్లు డీఏవో విజయ్‌భాస్కర్, టాస్క్‌ఫోర్స్ సీఐ మోహన్ తెలిపారు. పట్టుబడిన నిషేధిత గడ్డి మందు విలువ సుమారు రూ.84వేలు ఉంటుందని చెప్పారు. గ్లైఫోసెట్ మందును స్వాధీనం చేసుకుని షాపు యజమానిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ సందర్భంగా డీఏవో, సీఐ మాట్లాడుతూ గ్లైఫోసెట్‌ను హెచ్‌టీ(హెర్బిసైడ్ టాలరెంట్) పత్తి విత్తనాలు సాగు చేస్తే అట్టి చేలల్లో కలుపు నివారణకు ఉపయోగిస్తారని తెలిపారు. ప్రభుత్వాలు హెచ్‌టీ పత్తి విత్తనాలతో పాటు గ్లైఫోసెట్‌ను నిషేధించాయన్నారు. అయినప్పటికీ కొందరు వ్యాపారులు అక్రమంగా హెచ్‌టీ పత్తి విత్తనాలతో పాటు గ్లైఫోసెట్ మందులను అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయన్నారు. ఎవరైనా రైతులకు నకిలీ విత్తనాలు, నిషేధిత మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ ఎస్సై సత్యనారాయణరాజు, ఏఎస్సై గోపాల్‌రెడ్డి, ఏవో రామకృష్ణ ఉన్నారు.
ఫ చిట్యాల : మండలంలోని చల్లగరిగలో ఇంట్లో నిల్వ చేసిన నిషేధిత గడ్డి మందు(గ్లైఫోసెట్)ను శుక్రవారం పట్టుకున్నట్లు సీఐ పులి వెంకట్ తెలిపారు. గ్రామానికి చెందిన రావుల రవీందర్ ఇంట్లో అమ్మకానికి ఉంచిన 90 లీటర్ల గడ్డి మందును స్థానిక రెండో ఎస్సై సూర్యనారాయణ పట్టుకున్నట్లు వివరించారు. అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడిలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2021-06-05T06:09:00+05:30 IST