భూవివాదం.. మాజీ ఎమ్మెల్యే తమ్ముడు వర్సెస్ అటవీఅధికారులు
ABN, First Publish Date - 2021-06-09T23:51:33+05:30
భూవివాదం.. మాజీ ఎమ్మెల్యే తమ్ముడు వర్సెస్ అటవీఅధికారులు
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ సోదరుడికి, అటవీశాఖ అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతేకాదు ఇరువర్గాలు పరస్పరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. భూవివాదం తరుణంలో కూన శ్రీశైలంగౌడ్ సోదరుడు కూన జైకుమార్ గౌడ్ ఓ స్థలాన్ని చదును చేయిస్తున్నారు. విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు అక్కడికి వెళ్లి పనులు నిలిపివేయించారు. కైజర్ నగర్‌లోని సర్వే నెం.19లో ఉన్న ఆ భూమి అటవీశాఖకు చెందిన స్థలమని చదును చేసే అధికారం ఎవరికీ లేదని సిబ్బంది స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అటవీ సిబ్బందితో జైకుమార్ గౌడ్ వాగ్వాదానికి దిగారు. తాను చదును చేస్తున్న స్థలం సర్వే నెం. 28కి సంబంధించినదని, అది తమ సొంత స్థలమని జైకుమార్ గౌడ్ వాదనకు దిగారు. దీంతో అటవీ అధికారులు పోలీస్ స్టేషన్‌లో జైకుమార్ గౌడ్‌పై ఫిర్యాదు చేశారు. కాసేపటికే జై కుమార్ గౌడ్ కూడా అటవీ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2021-06-09T23:51:33+05:30 IST