కుక్క కాటు.. మందు లోటు
ABN, First Publish Date - 2021-02-22T08:20:14+05:30
రాష్ట్రంలో వీధి కుక్కలతో జనాలు బెంబేలెత్తుతున్నారు. తమ మానాన తాము వెళుతున్నవారిపై కుక్కలు ఎగబడుతున్నాయి.
- అందుబాటులో లేని రేబిస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్...
- రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కుక్క కాట్లు
- ఏటా లక్షకు పైగా కుక్క కాట్లు
- సీరియస్ అయితే ప్రాణాలు పోవడమే
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వీధి కుక్కలతో జనాలు బెంబేలెత్తుతున్నారు. తమ మానాన తాము వెళుతున్నవారిపై కుక్కలు ఎగబడుతున్నాయి. అప్రమత్తమయ్యేలోపే కరిచేస్తున్నాయి! ఫలితంగా కుక్క కాటుకు గురవుతున్న వారి సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతోంది. ఆ కాటుకు విరుగుడుగా ఇచ్చే రేబిస్ ఇమ్యూనోగ్లోబ్యులిన్(ఆర్‌ఐ) మందు మాత్రం ఏ ఒక్క ఆస్పత్రిలోనూ అందుబాటులో లేదు. వీటిని సరఫరా చేయడంలో టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ చేతులెత్తేసింది. గత కొన్ని నెలలుగా వీటి సరఫరా చేయడం లేదని ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం యాంటీ రేబిస్ వ్యాక్సిన్(ఏఆర్‌వీ) సరఫరా చేస్తుండగా, అంతకంటే ముఖ్యమైన ఆర్‌ఐ అసలు కొనుగోలే చేయడం లేదు. కొన్ని నెలలుగా సర్కారీ దవాఖానల్లో ఇది అందుబాటులో లేక కుక్కకాటు బాధితులు వెనుదిరిగిపోతున్నారు.
తీవ్రంగా కరిస్తే కష్టమే
కుక్క కాటు రెండు రకాలుగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకటి మాములుగా కరవడం, రెండోది చాలా తీవ్రంగా కరవడం. శరీరంలో బొడ్డు పైభాగాన కరిస్తే తీవ్రమైన కాటుగా భావిస్తారు. తీవ్రమైన కాట్లకు వెంటనే ఏఆర్‌వీతో పాటు ఆర్‌ఐ కూడా ఇవ్వాల్సివుంటుంది. సహజంగా కుక్క కాట్లకు కరిచిన రోజు నుంచి 3, 7,14,28 రోజుల వ్యవధిలో ఏఆర్‌వీ టీకా తీసుకోవాల్సివుంటుంది. ప్రధానంగా తల, భుజాలు, చేతులకు కరిస్తే ఏఆర్‌వీతో పాటు ఆర్‌ఐ ఇవ్వాలి. తీవ్రమైన కాట్ల విషయంలో ఆర్‌ఐ ఇస్తే కేవలం 24 గంటల్లో యాంటీబాడీస్ అభివృద్ధి చెందుతాయి. దీంతో ప్రాణాపాయం తప్పుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే కుక్కకాటుకు వెంటనే మరణం సంభవించకపోయినా మెల్లమెల్లగా ఆ రేబిస్ శరీరంలో ఉండిపోయి తర్వాత ప్రాణాంతకంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లోనే ఏటా 60 వేల కుక్క కాట్లు
ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా 60 వేల కుక్కకాట్లు నమోదు అవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆ సంఖ్య లక్షకు పైగా ఉంటుందని చెబుతున్నారు. 2019లో 33 జిల్లాల్లో ఏప్రిల్, మే నెలల్లో 74,836 మంది కుక్క కాటుకు గురయ్యారు. వీరిలో అత్యధికంగా 46,297 మంది నల్లగొండ జిల్లా వారే ఉన్నారు. రేబిస్ మరణాలు కూడా అక్కడక్కడ నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సుమారు 2 లక్షల కుక్కలున్నట్లు ప్రాథమిక అంచనా. అవి నిత్యం వీధుల్లో సంచరిస్తూ రోజుకు వందల మందిని గాయపరుస్తున్నాయి. అవి గాయపరిస్తే వెంటనే వెళ్లి యాంటీ రేబిస్ టీకాలు అందుబాటులో ఉన్న ఆర్‌ఐ మాత్రం ఇవ్వడం లేదు. వాస్తవానికి ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు విధిగా కుక్క, పాము కాటుకు విరుగుడు మందును అందుబాటులో ఉంచాలి. పిచ్చికుక్క కరిస్తే ర్యాబిస్ వ్యాధి సోకి చనిపోయే అవకాశాలు ఎక్కువ. కుక్కకాటుకు గురయ్యే వారిలో అత్యధికంగా చిన్నారులే ఉంటున్నారు. తర్వాత వృద్ధులుంటున్నారు.
Updated Date - 2021-02-22T08:20:14+05:30 IST