ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ ఉంచొద్దు

ABN, First Publish Date - 2021-06-27T08:47:38+05:30

‘‘పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జూలై 1 నుంచి 10 రోజుల పాటు జరుగుతాయి. ఈ పది రోజుల్లో నిర్దేశించిన పనులను ఏ ఒక్క దాన్నీ పెండింగ్‌లో ఉంచొద్దు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 10 రోజులపాటు ప్రగతి యాత్ర.. పనులు పూర్వవ్వాలి
  • మంత్రుల వద్ద రూ. 2 కోట్లు.. కలెక్టర్ల వద్ద కోటి
  • ప్రభుత్వ భూములు, ఆస్తులపై వచ్చే నెల్లో ఇన్వెంటరీ
  • ఆస్తుల రికార్డుల పర్యవేక్షణకు ఎస్టేట్స్‌ అధికారులు
  • పల్లె, పట్టణ ప్రగతి, హరితహారంపై సమీక్షలో కేసీఆర్‌ 
  • దళిత సాధికారతకు రూ. 1,000 కోట్ల నిధులు
  • నేడు కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్న సీఎం

హైదరాబాద్‌, జూన్‌  26 (ఆంధ్రజ్యోతి): ‘‘పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జూలై 1 నుంచి 10 రోజుల పాటు జరుగుతాయి. ఈ పది రోజుల్లో నిర్దేశించిన పనులను ఏ ఒక్క దాన్నీ పెండింగ్‌లో ఉంచొద్దు. పల్లెలు, పట్టణాల అభివృద్ధి నిరంతర ప్రక్రియ. ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలి’’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంత్రులు, పలు శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లకు నిర్దేశించారు. పల్లె , పట్టణాల అభివృద్ధి కోసం మంత్రుల వద్ద రూ. 2 కోట్లు, జిల్లా కలెక్టర్ల వద్ద రూ. కోటిని అత్యవసర నిధులుగా ఉంచనున్నట్లు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి(సీడీఎఫ్‌) నిధులను.. స్థానిక జిల్లా మంత్రి నుంచి అనుమతి తీసుకున్నాకే ఖర్చు చేయాలని సూచించారు. కలెక్టర్లు పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం సమర్థ బృందాలను ఎంపిక చేసుకోవాలన్నారు.


 శనివారం ఆయన ప్రగతి భవన్‌లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల నిర్వహణపై సుదీర్ఘంగా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రగతి కార్యక్రమాలపై జిల్లాలు, మండలాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించాలని, ప్రజలను మరింత చైతన్యపరిచి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ‘‘పంచాయతీరాజ్‌ శాఖకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోంది. అయినా పనులు వంద శాతంగా పూర్తికాకపోవడాన్ని పునఃసమీక్షించుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు. హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను పంపిణీ చేయాలన్నారు. ‘‘పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ చట్టాల ప్రకారం.. పల్లెలు, పట్టణాల్లో విక్రయించే లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూమిని విధిగా పంచాయతీలు, మునిసిపాలిటీల పేర్ల మీద రిజిస్టర్‌ చేయించాలి. పోడు భూముల సమస్యలను పరిష్కరించడానికి నివేదిక తయారు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా రికార్డుల్లో ఉన్న 66 లక్షల ఎకరాల అటవీ భూముల హద్దులను నిర్దిష్టంగా గుర్తించాలి’’ అని సూచించారు. 


పట్టణాల్లో క్లీనింగ్‌ ప్రొఫైల్‌.. 

పట్టణాలలో క్లీనింగ్‌ ఫ్రొఫైల్‌ను రూపొందించుకోవాలని సీఎం ఆదేశించారు. గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని శాఖలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితాను తయారు చేసుకుని.. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి పట్టణంలో కనీసం ఐదు డంపింగ్‌ యార్డులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పట్టణాలలో లక్ష జనాభాకు ఒకటి చొప్పున వెజ్‌-నాన్‌ వెజ్‌ మార్కెట్లను ఏర్పాటు చేయాలన్నారు. ‘మ్యాప్‌ యువర్‌ టౌన్‌ ’ ప్రకారం లోపాలను సవరించుకుంటూ.. పట్టణ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సమీకృత కలెక్టరేట్లలో ‘రాష్ట్ర చాంబర్‌’లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో జంట హెలిప్యాడ్లను నిర్మించాలన్నారు. ‘‘ప్రభుత్వ శాఖల భూములు, స్థలాలు, ఇతర ఆస్తులపై జూలై చివరినాటికి ఇన్వెంటరీని సిద్ధం చేయాలి. 


ప్రభుత్వ ఆస్తుల వివరాల రికార్డు, సంరక్షణ, పర్యవేక్షణ కోసం జిల్లాకు ఒక ఎస్టేట్‌ అధికారిని నియమించాలి. వీరు కలెక్టర్ల ఆధ్వర్యంలో పనిచేయాలి. రాష్ట్ర స్థాయిలోనూ ఎస్టేట్‌ ఆపీసర్‌ను నియమించి.. సీఎస్‌ పర్యవేక్షణలో విధులు నిర్వహించేలా చూడాలి. రియో-డ-జనీరో నగరాన్ని స్ఫూర్తిగా తీసుకుని అర్బన్‌ ల్యాండ్‌ను శాస్త్రీయంగా ఉపయోగించుకోవాలి. ప్రతి మండలానికి ఒకటి చొప్పున.. పదెకరాలకు తగ్గకుండా ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలి. అటవీ పునరుజ్జీవనంపై కలెక్టర్లు దృష్టిసారించాలి. ఈ ప్రక్రియ వివాదాలు లేని అటవీ భూముల నుంచి ప్రారంభం కావాలి. అటవీ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు చెక్‌పోస్టులను సమర్థంగా నిర్వహించాలి. జాతీయ రహదారుల వెంబడి పచ్చదనాన్ని పెంపొందించే బాధ్యత కాంట్రాక్టర్లదే’’ అని అధికారులకు సూచనలు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో వైకుంఠధామాల నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను విడుదల చేశామన్నారు. యువతను పెడదోవపట్టించే అసాంఘిక కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌ రెడ్డిని ఆదేశించారు. 


రైతులను చైతన్యపర్చండి

వాణిజ్యపరంగా లాభదాయకమైన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని సీఎం ఆదేశించారు. ‘‘వెదజల్లే పద్ధతిపై రైతులను చైతన్యపరచాలి. కంది, శనగ, పత్తి, ఆయిల్‌ పాం వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి’’ అని సూచించారు. గ్రామాల్లో విద్యు త్తు సమస్యల పరిష్కారానికి పవర్‌డేలను పాటించాలన్నారు. ‘‘వ్యవసాయానికి, రైతుకు ప్రభుత్వం అండగా ఉంది. సమృద్ధిగా పంటలు పండుతూ.. రాష్ట్రం ధాన్యాగారంగా మారింది. అదనపు ధాన్యం సేకరణకు మిల్లు ల సంఖ్యను పెంచాలి. పండిన పంటలను ప్రాసెసింగ్‌ చేసుకోవడంపైనా దృష్టి సారించాలి. రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. 250 ఎకరాలకు తగ్గకుండా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లను ఏర్పాటు చేయాలి’’ అని అధికారులను ఆదేశించారు. 


ఒక్కో జిల్లాకు రూ.కోటి

జూలై 1 నుంచి చేపట్టనున్న పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం ప్రభుత్వం ఒక్కో జిల్లాకు రూ.కోటి చొప్పున మంజూరు చేసింది. ఈమేరకు ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 


1,000 కోట్లతో దళిత సాధికారత

‘దళిత సాధికారత’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇందుకోసం ఈ ఏడాది రూ. 1,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దశల వారీగా 8 లక్షల దళిత కుటుంబాలకు ఈ కార్యక్రమాలను విస్తరిస్తామన్నారు. దీనిపై ఆదివారం ప్రగతి భవన్‌లో దళిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలతో జరగనున్న సమావేశంలో కీలక నిర్ణయాలను ప్రకటిస్తామన్నారు. ‘‘శరీరంలో ఒక భాగం పాడైతే .. మొత్తం శరీరానికే బాధ ఉంటుంది. సమాజంలో కూడా ఒక భాగం వివక్షకు గురైతే.. మొత్తం సమాజానికే ఆ బాధ ఉంటుంది. దళితుల పేరుతో బాధపెట్టే పద్ధతి మంచిది కాదు. దళితుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. అప్పుడే దళిత సాధికారత సాధ్యమవుతుంది. దళిత సాధికారతను విజయవంతం చేయడంలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర అత్యంత కీలకం. దళిత సాధికారతకు.. ఎస్సీ సబ్‌-ప్లాన్‌కు నిధులకు సంబంధం లేదు’’ అని సీఎం వివరించారు.

Updated Date - 2021-06-27T08:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising