దళిత నిధి.. చిత్తశుద్ధి ఏదీ!?
ABN, First Publish Date - 2021-06-27T10:50:07+05:30
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక..! తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి..
- గతంలో ఉప ప్రణాళిక.. ప్రత్యేక అభివృద్ధి నిధి..
- పథకాలు ఏవైనా నిధుల దారి మళ్లింపు పక్కా
- కాంగ్రెస్ హయాంలో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు
- టీఆర్‌ఎస్ పాలనలో రైతు బంధు, రుణ మాఫీకి!
- అయినా సరే.. 52 శాతం దాటని నిధుల వ్యయం
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక..! తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి..! ఇలా పథకాలు ఎన్ని వస్తున్నా పేర్లు మారుతున్నాయే తప్ప దళిత, గిరిజన వాడలు, పల్లెలు, ప్రజల పరిస్థితులు మెరుగవడం లేదు. నిధుల దారి మళ్లింపు సాధారణమైపోయింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్’ను తీసుకొస్తుండటం చర్చనీయాంశమైంది. కాగా, నిధులను దారి మళ్లించరాదని, వ్యయాన్ని కచ్చితంగా ఆడిట్ చేయాలన్న నిబంధనలతో ఉమ్మడి ఏపీలోలో ‘ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ యాక్ట్-2013’ను తీసుకొచ్చారు. కానీ, ఆ ప్రభుత్వ హయాంలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, పార్కులు, ఫ్లై ఓవర్ల నిర్మాణానికి మళ్లించారు. జాతీయ పండుగల సందర్భంగా నగరాన్ని అలంకరించడానికి సైతం వెచ్చించారు. గ్రామం మధ్య నుంచి దళిత కాలనీకి రోడ్డు వేసినా సబ్ ప్లాన్ నిధులనే వినియోగించారు. ఇక టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రుణ మాఫీ, రైతు బీమా కింద కూడా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి వ్యయాలను చూపిస్తున్నదని సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కాంగ్రెస్ హయాంలో 2007-08 నుంచి 2012-13 మధ్య ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.39,330.6 కోట్లను కేటాయిస్తే వ్యయం చేసింది రూ.20,516.15 కోట్లే (52.16). టీఆర్‌ఎస్ వచ్చాక 2014-15 నుంచి 2019-20 (నవంబరు) వరకు సబ్ ప్లాన్/ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.69,380.77 కోట్లలో రూ.32,297.35 కోట్లు (46.55 శాతం) మాత్రమే ఖర్చుపెట్టారు.
ప్రత్యేక అభివృద్ధి నిధి వచ్చినా..
కేంద్రంలో ప్రణాళిక సంఘం రద్దుతో రాష్ట్ర ప్రభుత్వం సబ్ ప్లాన్ స్థానంలో 2017లో ‘తెలంగాణ స్టేట్ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవల్‌పమెంట్ ఫండ్ యాక్ట్-2017’ను తెచ్చింది. అయితే, విభజిత (డివిజిబుల్), అవిభాజ్య (నాన్ డివిజిబుల్) నిబంధనలను ఆసరాగా చేసుకుని దారి మళ్లిస్తున్నారని వివిధ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎస్సీ స్పెషల్ డెవల్‌పమెంట్ ఫండ్ కింద జనాభా దామాషాలో బడ్జెట్‌లో 15 శాతం మేర నిధులు వస్తాయి. ఇందులో డివిజిబుల్‌కు 7 శాతం, నాన్ డివిజిబుల్‌కు 8 శాతం వెచ్చించాలి. అయితే, నాన్ డివిజిబుల్ కింద 8 శాతాన్ని, డివిజిబుల్ కింద ఒకటో అర శాతమో వ్యయం చేస్తున్నారు. తద్వారా 10 శాతం మేర నిధులను వ్యయం చేసినట్లు చూపిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు అమలు చేసే రైతుబంధు, రైతు బీమా, రైతు రుణాల మాఫీ వంటి పథకాలకు నాన్ డివిజిబుల్ నిధులను వెచ్చిస్తున్నారు. దీంతో అసలు ఉద్దేశం నెరవేరడం లేదు. పైగా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలకు ఉద్దేశించిన ‘టీ-ప్రైడ్’ కింద రూ.750 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద వీటిని విడుదల చేసే అవకాశముంది. ప్రభుత్వం ఆ పని చేయకపోవడంతో 2,500 వరకు ఎస్సీ, ఎస్టీల పరిశ్రమలు మూతపడ్డాయి.
‘ఎంపవర్‌మెంట్’ పై నేడు సీఎం సమీక్ష
తాజాగా తీసుకురాన్ను ‘సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్’ విధివిధానాలను రూపొందించడానికి ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. 8 లక్షల దళిత బీపీఎల్ కుటుంబాలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. రూ.వెయ్యి కోట్లను కేటాయిస్తామని సీఎం వెల్లడించారు. ప్రత్యేక అభివృద్ధి నిధులకు, తాజా స్కీమ్‌కు సంబంధం లేదని చెబుతున్నారు. అదనంగా నిధులు కేటాయిస్తామంటున్నారు. అయితే, ఇకనైనా నిధులు దారి మళ్లవన్న హామీ ఉంటుందా..? అని దళిత సంఘాలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి.
Updated Date - 2021-06-27T10:50:07+05:30 IST