ఆర్‌టీపీసీఆర్‌లో నెగెటివ్, ర్యాపిడ్‌లో పాజిటివ్.. ఎందుకిలా..!?
ABN, First Publish Date - 2021-04-29T13:42:29+05:30
కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు పరీక్షలు చేయించుకోగా..
హైదరాబాద్/ముషీరాబాద్ : కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు పరీక్షలు చేయించుకోగా, రెండు రకాలుగా రిపోర్టులు వస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఏ రిజల్ట్ నిజమో అర్థం కాక తమకు వచ్చిన రిపోర్టులను వైద్యులకు చూపించి ఆందోళన చెందుతున్నారు. ముషీరాబాద్, భోలక్‌పూర్ యూపీహెచ్‌సీలో రోజూకు 200 వరకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందులో లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి ఆర్‌టీపీసీఆర్‌లో టెస్టులు నిర్వహిస్తున్నారు. అయితే కొందరికి ర్యాపిడ్ టెస్టుల్లో పాజిటివ్ అని, ఆర్‌టీపీసీఆర్ టెస్టులో నెగెటివ్ అని రిపోర్టులు వస్తున్నాయి. ముషీరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించగా ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ అని వచ్చింది. మరుసటి రోజు ఆర్‌టీపీసీఆర్ టెస్టు రిపోర్టులో నెగెటివ్ వచ్చిందని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అయిదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలని తర్వాత తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని సూచించారని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
40 మందికి పాజిటివ్...
ముషీరాబాద్, భోలక్‌పూర్ యూపీహెచ్‌సీలో బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించగా 40 మందికి పాజిటివ్ వచ్చింది. ముషీరాబాద్ యూపీహెచ్‌సీలో 66 మందిలో 20 మందికి, భోలక్‌పూర్ యూపీహెచ్‌సీలో 70 మందిలో 20 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి డాక్టర్ కృష్ణమోహన్ తెలిపారు. 185 మందికి వ్యాక్సిన్ వేశామని ఆయన తెలిపారు.
నెహ్రూనగర్‌లోని ఆరోగ్య కేంద్రంలో 20 మందికి...
గోల్నాక: నెహ్రూనగర్‌లో గల హర్రా్‌సపెంట ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 148 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కరోనా నిర్ధారణ పరీక్షలు 67మందికి చేయగా 20 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. నెహ్రూనగర్‌లోని ప్రభుత్వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కార్పొరేటర్ దూసరి లావణ్య సందర్శించి కరోనా పరీక్షల తీరును పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మమతతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వారితో కూడా మాట్లాడి వారి ఇబ్బందులను కూడా తెలుసుకున్నారు.
ఫీవర్ ఆస్పత్రిలో 77 పాజిటివ్
బర్కత్‌పుర:నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయించుకోవడానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. మహిళలు, వృద్ధ్దులు క్యూలైన్‌లో నిలబడి పరీక్షలు చేయించుకోవడానికి నిరీక్షించారు. బుధవారం 270 మంది ర్యాపిడ్ పరీక్షలు చేయించుకోగా వారిలో 77 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
రాజేంద్రనగర్ సర్కిల్‌లో 31 మందికి..
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్‌లో బుధవారం 179 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 31 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు తెలిపారు. మైలార్‌దేవుపల్లిలో 30 మందిలో ఏడుగురికి, శివరాంపల్లిలో 30లో 5 మందికి, హసన్‌నగర్‌లో 30 మందిలో 6 మందికి, రాజేంద్రనగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 89 మందిలో 13 మందికి పాజిటివ్ వచ్చింది. రాజేంద్రనగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 18 మందికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.
460 మందికి వ్యాక్సిన్ పంపిణీ
రాజేంద్రనగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 180 మందికి వ్యాక్సిన్ వేశారు. మైలార్‌దేవుపల్లిలో 130 మందికి, శివరాంపల్లిలో 150 మందికి వ్యాక్సిన్‌ను వేశారు.
కొవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలి
కొవిడ్ సెకండ్ వేవ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, కార్పొరేటర్‌లు దృష్టి సారించాలన్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలను కూడా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అన్ని ప్రభుత్వ పాఠశాలలో వ్యాక్సిన్ పంపిణీ, కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు.
వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి
అత్తాపూర్ డివిజన్‌లో కొవిడ్ పరీక్షల కేంద్రంతో పాటు వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు కోరారు. బుధవారం రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ శాఖాధికారిణి డాక్టర్ స్వరాజ్యలక్ష్మిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో వివిధ ప్రాంతాలలోని ప్రజలు, వృద్ధులు, దివ్యాంగులు ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోలేక, వ్యాక్సిన్ వేయించుకోలేక చాలా ఇబ్బందులు పడుతు కరోనా బారిన పడుతున్నారు. అత్తాపూర్‌లో వార్డు కార్యాలయంలో, హైదర్‌గూడ వార్డు కార్యాలయంలో, ఉప్పర్‌పల్లి వార్డు కార్యాలయం దగ్గర లేదా ప్రభుత్వ పాఠశాలల దగ్గర కొవిడ్ పరీక్షలు, వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎన్.మల్లారెడ్డి, ఎం.కొమురయ్య, అత్తాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు షాబాద విజయ్‌కుమార్‌లు పాల్గొన్నారు.
గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో..
మెహిదీపట్నం: గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో బుధవారం 139 మందికి కరోనా పరీక్షలు చేయగా 38 మందికి పాజిటివ్ వచ్చింది. సరోజినిదేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రిలో 126 మందిలో 13 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Updated Date - 2021-04-29T13:42:29+05:30 IST