రైతులతో రాజకీయం!
ABN, First Publish Date - 2021-11-10T08:28:21+05:30
ఉప్పుడు బియ్యాన్ని ఇకపై తీసుకోబోమని కేంద్రం తేల్చి చెబితే.. భవిష్యత్తులో తాము కూడా ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్‌ను సరఫరా చేసేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
- బాయిల్డ్ రైస్ వద్దన్న కేంద్ర ప్రభుత్వం..
- ఇకపై సరఫరా చేయబోమన్న రాష్ట్ర సర్కార్
- ఫోర్టిఫైడ్ బియ్యమే అందిస్తామని స్పష్టీకరణ
- మిల్లుల బ్లెండింగ్ సామర్థ్యం పెంచుతామని హామీ
- ఈ మేరకు సెప్టెంబరు 30నే కేంద్రానికి లేఖ
- నెల కిందటే ఇరు ప్రభుత్వాల కీలక ఒప్పందం
- హుజూరాబాద్ ఫలితం తర్వాత రాజకీయ దుమారం
- టీఆర్‌ఎస్, బీజేపీ.. జోరుగా విమర్శలు, ప్రతి విమర్శలు
- తప్పు మీదంటే మీదంటూ ఆందోళనలకు పిలుపులు
- మధ్యలో పావులుగా బలవుతున్న అన్నదాతలు
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉప్పుడు బియ్యాన్ని ఇకపై తీసుకోబోమని కేంద్రం తేల్చి చెబితే.. భవిష్యత్తులో తాము కూడా ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్‌ను సరఫరా చేసేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా ఉత్తర, ప్రత్యుత్తరాలు జరిగాయి. అంతేనా, ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరాకు తగిన సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఎఫ్‌సీఐకి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలో రైస్ మిల్లుల బ్లెండింగ్ సామర్థ్యాన్ని పెంచుతామని వివరించింది. నిజానికి, ఎఫ్‌సీఐ వద్ద బియ్యం నిల్వలు ఎంత దండిగా ఉన్నాయో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్పష్టత ఉంది. గడిచిన యాసంగి సీజన్‌కు సంబంధించి ఎంత కోటా తీసుకోవాలి? భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? అనే విషయంలో ఇరు ప్రభుత్వాలు ఒక అవగాహనకు వచ్చాయి కూడా. బఫర్ స్టాక్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే.. ఇక మీదట ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కేంద్రం కూడా ఈసారి తప్ప మరోసారి ఒక్క గింజ బాయిల్డ్ రైస్ తీసుకోబోమని కరాఖండిగా చెప్పింది.
ఈ మేరకు ఇరు ప్రభుత్వాల మధ్య ఉత్తర, ప్రత్యుత్తరాలు, వినతులు, సడలింపులు, లేఖాస్త్రాలన్నీ సెప్టెంబరు నెలాఖరుతోనే పూర్తయ్యాయి. కానీ, కేంద్రంతో రాజీపడిన విషయాన్ని, లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం అధికారికంగా వెల్లడించలేదు. సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ తర్వాత.. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనబోమని అంటోందని, వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని, రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దనే ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వానికి తాను లిఖితపూర్వకంగా రాసిచ్చిన విషయాన్ని బయటపెట్టలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత, వడ్ల కొనుగోలుపై దుమారం రేగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి, విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు మాత్రమే కేంద్రానికి లేఖ ఇచ్చిన విషయం బయటపెట్టారు. అయినా, ఇప్పుడు కూడా బీజేపీ, టీఆర్‌ఎ్‌సలు ‘ఉప్పుడు బియ్యం’ అంశాన్ని రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు అస్త్రంగా వాడుకుంటున్నాయి. దీంతో, అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. ఏ పంట సాగు చేయాలో, ఎవరు కొంటారో, ఎవరో కొనరో తెలియని ఆందోళన రైతుల్లో నెలకొంది.
ఇవీ వాస్తవ పరిస్థితులు
ఏళ్ల తరబడి ఎఫ్‌సీఐ వద్ద బియ్యం నిల్వలు పేరుకుపోయాయి. రాష్ట్రంలో ఉన్న ఎఫ్‌సీఐ గోదాముల్లోనే సెంట్రల్ పూల్‌లో 19.13 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం, 42 వేల టన్నుల పచ్చి బియ్యం నిల్వలున్నాయి. స్టేట్ పూల్ కింద మరో 57 లక్షల టన్నుల బియ్యం నిల్వలున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే.. బియ్యం, గోధుమలు కలిపి 7.20 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. వీటిలో బియ్యం 4.67 కోట్ల టన్నులు కాగా.. గోధుమలు 2.53 కోట్ల టన్నులు. ఈ నిల్వలు తరగడానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. మరోవైపు, దేశవ్యాప్తంగా సాగునీటి వసతి పెరిగిపోవడంతో ఏటికేడాది వరి సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 15 ఏళ్లకు, ఇప్పటికి చూస్తే ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ రెట్టింపయింది. 2005-06లో ఎఫ్‌సీఐ 275.78 లక్షల టన్నుల బియ్యం సేకరిస్తే.. 2020-21లో ఇప్పటి వరకు 600.78 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, హరియాణా, పంజాబ్, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్ బియ్యం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాయి. అవసరానికి మించి బియ్యం ఉత్పత్తి చేస్తున్నాయి. ఎఫ్‌సీఐ వద్ద నిల్వ సౌకర్యం సరిగా లేక ఏడాదికి 5-8 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పనికిరాకుండాపోతుండడంతో సముద్రంలో పారబోస్తున్నారు.
తమిళనాడులో స్వయం సమృద్ధి
గతంలో తమిళనాడులో బియ్యం లభ్యత సరిపడా ఉండేది కాదు. కరువు పరిస్థితులు నెలకొనేవి. దాంతో తెలంగాణ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే ఉప్పుడు బియ్యంలో సింహభాగం తమిళనాడుకు పంపించేవారు. అలా.. ఏటా 40 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్, 20 లక్షల టన్నుల రా రైస్ వినియోగం ఉండేది. కానీ, బియ్యం ఉత్పత్తిలో తమిళనాడు ఇప్పుడు స్వయం సమృద్ధి సాధించింది. ఈ ఏడాది ఆ రాష్ట్రం నుంచే ఎఫ్‌సీఐ 30 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం సేకరించటం గమనార్హం. దీంతో, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఉప్పుడు బియ్యం అవసరం ఇటు ఎఫ్‌సీఐకిగానీ, అటు తమిళనాడుకు గానీ లేకుండాపోయింది.
ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ తగ్గిన డిమాండ్
తెలంగాణ నుంచి ఏటా 40లక్షల టన్నుల ఉప్పుడు బియ్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించేది. తమిళనాడుతోపాటు కేరళ, దక్షిణ కర్ణాటక, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం వెళ్లేవి. ఇప్పుడు అక్కడ డిమాండ్ తగ్గిపోయింది. వరి సాగును ప్రోత్సహించడానికి క్వింటాలుకు రూ.900 బోన్‌సను కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బియ్యం ఉత్పత్తి పెరుగుతోంది. గతంలో తెలంగాణ నుంచి 10-12 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కేరళకు ఎగుమతి అయ్యేవి. నిరుడు 7-8 లక్షల టన్నులకు మించి ఎగుమతి కాలేదు. దక్షిణ కర్ణాటకకు తెలంగాణ బియ్యం 3-4 లక్షల టన్నులు గతంలో వెళ్లేవి. ఇప్పుడు అక్కడ స్వయం సమృద్ధి సాధించారు. గతంలో బంగ్లాదేశ్‌కు 6-7 లక్షల టన్నులు; మలేసియాకు 3-4 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ వెళ్లేవి. ఇప్పుడు తగ్గిపోయుంది. ప్రస్తుతం బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు కొద్దిగా వెళుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో బాయిల్డ్ రైస్ వినియోగం గణనీయంగా తగ్గిపోవడంతో కేంద్రం కూడా సేకరణను నిలిపివేసింది.
భారంగా విదేశీ ఎగుమతులు
మన దేశం నుంచి విదేశాలకు ఉప్పుడు బియ్యం ఎగుమతి చేయడానికి ఎటువంటి ఆంక్షలూ లేవు. దీనికితోడు, దక్షిణాఫ్రికా, ఖతార్, మస్కట్, దుబాయి, బహ్రెయిన్ తదితర దేశాల్లో బాయిల్డ్ రైస్‌కు డిమాండ్ ఉంది. కానీ, ఎగుమతులకు ధరలు గిట్టుబాటు కావడం లేదు. కాకినాడ, కృష్ణపట్నం, వైజాగ్, ముంబై ఓడరేవుల వద్ద క్వింటాల్ బాయిల్డ్ రైస్ డెలివరీ రేటు లోడింగ్‌తో కలిపి రూ.2,650 ఉంది. రైస్‌మిల్ వద్ద ధర రూ.2,350 మాత్రమే. రవాణా, ఇతర ఖర్చులు కలిపితే ఎగుమతిదారులపై క్వింటాలుకు రూ.300 నుంచి రూ.400 వరకు అదనపు భారం పడుతోంది. దీంతో ఎగుమతులకు వెనకాడుతున్నారు. నాన్ బాస్మతి రైస్ (6 మి.మీ. పొడవుండే సన్న బియ్యం)కు విదేశాల్లో డిమాండ్ ఉంది. గడిచిన ఐదేళ్ల ఎగుమతులు పరిశీలిస్తే.. తెలంగాణ వాటా కేవలం 0.5% మాత్రమే. ఈ విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే ఎగుమతులకు మార్గం సుగమమైనట్లే!
కేంద్రం వద్ద బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) నిల్వలు విపరీతంగా ఉన్నాయి. వాటిని వినియోగించేందుకు కొన్నేళ్లు పడుతుంది. 2020-21 యాసంగి సీజన్‌కు సంబంధించి తెలంగాణ నుంచి 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ మాత్రమే ఎఫ్‌సీఐ తీసుకుంటుంది. మిగిలిన బియ్యం రా రైస్ (పచ్చి బియ్యం) రూపంలో మాత్రమే ఇవ్వండి. ఉప్పుడు బియ్యాన్ని పరిమితంగా తీసుకోవడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. యాసంగి ధాన్యం కేవలం బాయిల్డ్ రైస్‌కే పనికి వస్తాయనేది అశాస్త్రీయమైన అంశం. పైగా, ఇది రైస్ మిల్లర్లకు సంబంధించిన వ్యవహారం. ఇందులో రైతుకు ఏమాత్రం సంబంధం లేదు.
- కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి మే నెలలో
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లేఖ సారాంశమిది.
‘‘రాష్ట్రంలో జల వనరులు పెరగడంతో రైతులు పెద్ద ఎత్తున వరి పండించారు. గత యాసంగిలో 92.34 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. దీని నుంచి 62.52 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ఉత్పత్తి అయ్యాయి. ఎఫ్‌సీఐ కేవలం 24.75 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటామని చెప్పింది. ఉత్పత్తిలో కనీసం 90 శాతం బాయిల్డ్ రైస్ తీసుకోవాలి.
- సెప్టెంబరు 26న ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి
పీయూష్‌ను కలిసినప్పుడు విన్నవించిన సీఎం కేసీఆర్
2020-21 యాసంగిలో 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తెలంగాణ నుంచి తీసుకోవడానికి ఇదివరకే అనుమతిచ్చాం. అదనపు కోటా కోసం తెలంగాణ ముఖ్యమంత్రి లేఖ (డీవో లెటర్ నం. పీ.ఐ(1)/930/2021) ఇచ్చారు. రానున్న రోజుల్లో ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ అసలు ఇవ్వబోమని లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందువల్ల, పాత కోటాకు (24.75 లక్షల టన్నులు) మరో 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌ను అదనంగా ఎఫ్‌సీఐకి సరఫరా చేయండి.
- సెప్టెంబరు 30న ఢిల్లీ కృషి భవన్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌కు
వచ్చిన లేఖ సారాంశం ఇది.
Updated Date - 2021-11-10T08:28:21+05:30 IST