కృష్ణా నీళ్లను జగన్‌కు అమ్మేసిన కేసీఆర్!
ABN, First Publish Date - 2021-07-09T08:45:08+05:30
కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు కేసీఆర్ అమ్ముకున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ‘కృష్ణా నీళ్లు నువ్వు తీసుకుపో.. గోదావరి నీళ్లు నేను తీసుకుపోతా.. అనేలా రెండు రాష్ర్టాల సీఎంలు ఒప్పందం చేసుకున్నారు’ అని..
కమిషన్ల కోసం డిజైన్ల మార్పులు: డీకే అరుణ..
దివాలా తీసిన జగన్‌ను ఆదుకోవడానికే ప్రాజెక్టులు: దాసోజు
జర్నలిస్ట్స్ యూనియన్, జలసాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్
హైదరాబాద్ సిటీ, జూలై 8(ఆంధ్రజ్యోతి): కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు కేసీఆర్ అమ్ముకున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ‘కృష్ణా నీళ్లు నువ్వు తీసుకుపో.. గోదావరి నీళ్లు నేను తీసుకుపోతా.. అనేలా రెండు రాష్ర్టాల సీఎంలు ఒప్పందం చేసుకున్నారు’ అని దుయ్యబట్టారు. తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ జలసాధన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ‘కృష్ణా జలాల సాఽధన కోసం మర్ల బడదాం రండి’ అనే అంశంపై పలు పార్టీల నాయకులు, మేధావులు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గతంలో 90ు పూర్తయిన ప్రాజెక్టుల్లో గంప మట్టి అయినా తీయలేదని అరుణ విమర్శించారు. అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు.
కృష్ణా నీటి పంపకాల్లో కేసీఆర్ 299 టీఎంసీలకు ఒప్పుకొని రావడమే తెలంగాణకు చేసిన పెద్దద్రోహమన్నారు. కృష్ణాజలాలపై సీఎం కేసీఆర్ ఆడుతున్న నాటకం దొంగనాటకమన్నారు. హుజురాబాద్‌లో ఎన్నికల జరుగుతున్న నేపఽథ్యంలో టీఆర్ఎస్ మరోసారి ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తోందన్నారు. గట్టు మండలం రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతమని అక్కడ గట్టులిఫ్ట్కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తే వాటిని పక్కన పెట్టి డిజైన్లు మార్చారన్నారు. కృష్ణా జలాల వివాదానికి కారణం కేసీఆర్ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. జల వివాదాల డ్రామాలో కేసీఆర్ శకుని, జగన్ దుర్యోఽధనుడని ఎద్దేవా చేశారు. ఆర్థికంగా దివాలా తీసిన జగన్‌ను ఆదుకునేలా రూ.47 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులను ఏపీలో నిర్మించేలా కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికల కోసమే నీటి పంచాయితీని తెరమీదకు తీసుకువచ్చి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీటిని ఏపీ తీసుకుపోతోందని, తెలంగాణలో వేగంగా ప్రాజెక్టులు పూర్తిచేయాల్సిన అవసరముందని రిటైర్డ్ ఇంజనీర్ రంగారెడ్డి తెలిపారు. పార్టీలను పక్కన పెట్టి నీళ్లపై పోరాడాల్సిన సమయం అసన్నమైందని సీనియర్ నేత నాగురావు చెప్పారు.
తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ అనంతరెడ్డి రౌండ్ టేబుల్ భేటీకి అధ్యక్షత వహించగా.. ప్రొఫెసర్ మురళీ మనోహర్, ఇన్నయ్య, నామాజీ, షణ్ముఖ, తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం నేతలు లక్ష్మినారాయణ , జాతీయ బిల్డర్స్ ఫోరం నేత ఎస్ఎల్.రెడ్డి, జర్నలిస్ట్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-09T08:45:08+05:30 IST