ప్రజా సంగ్రామ యాత్రతో మరో విప్లవం
ABN, First Publish Date - 2021-08-21T06:40:31+05:30
: ‘‘మసీదులు, చర్చిల నుంచి యాత్రలు ప్రారంభిస్తే నేనెప్పుడైనా వ్యతిరేకించానా? నేను హిందువును..
- భాగ్యలక్ష్మి ఆలయం నుంచి యాత్రను ప్రారంభిస్తే మేము మతతత్వ వాదులమా?
- నా సెంటిమెంట్‌ను కాదనడానికి వాళ్లెవరు?
- ప్రజల కష్టాలు, సమస్యలన్నీ తెలుసుకుంటాం
- ఆ అంశాలే భవిష్యత్తులో మా పార్టీ మేనిఫెస్టో
- రాసి పెట్టుకోండి.. మాకు 100 స్థానాలు ఖాయం
- సీఎం రేసులో లేను.. కాంగ్రెస్ నాయకుల్లేని నావ
- ‘ఆంధ్రజ్యోతి’తో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘మసీదులు, చర్చిల నుంచి యాత్రలు ప్రారంభిస్తే నేనెప్పుడైనా వ్యతిరేకించానా? నేను హిందువును.. అందుకే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టడం సెంటిమెంట్‌గా భావిస్తున్నా.. దీన్ని కాదనడానికి వాళ్లెవరు? చర్చిలు, మసీదుల నుంచి యాత్రలు చేపట్టేవాళ్లు లౌకికవాదులు.. మేం మతతత్వవాదులమా?’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ నెల 24 నుంచి తాను చేపట్టనున్న ప్రజా సంగ్రామ యాత్రతో మరో రాజకీయ విప్లవం రాబోతోందని వెల్లడించారు. నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలన నుంచి ప్రజలను విముక్తి చేయడమే ఈ యాత్ర అంతిమలక్ష్యమని పేర్కొన్నారు. ఎవరైతే సంక్షేమ పథకాలు ప్రకటించి ప్రజలను ఆగం చేస్తడో ఆయనే కేసీఆర్.. అని వ్యాఖ్యానించారు. ఐస్‌క్రీమ్ చేతికిచ్చి, బీజేపీ కారణంగానే కరిగిపోయిందని చెబుతారని ధ్వజమెత్తారు. ఆదాయం కోసం ప్రభుత్వ భూములు అమ్ముతున్న కేసీఆర్.. రానున్న రోజుల్లో ప్రభుత్వ భవనాలనూ అమ్ముతారని అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రజాసంగ్రామ యాత్ర అంతిమ లక్ష్యం ఏంటి?
ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ యువత ప్రాణత్యాగాలు చేసిందో అవి ఇంకా నెరవేరలేదు. ఆ ఆకాంక్షలను బీజేపీ మాత్రమే నెరవేరస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నరు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మరో విప్లవం రానుంది. ప్రజల కష్టాలు, స్థానిక సమస్యలు తెలుసుకుంటాం.. ఈ అంశాలే రేపటి మా మేనిఫెస్టో అవుతుంది. అలాగే, కేంద్ర పథకాల ద్వారా అందుతున్న నిధుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. టీఆర్‌ఎస్ అవినీతిపై ప్రజల్లో చైతన్యం తెస్తాం. సెప్టెంబరు 17 అధికారికంగా జరపాలన్న డిమాండ్‌ను ప్రస్తావిస్తాం.
రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యాక కాంగ్రెస్ పార్టీ పుంజుకొందన్న టాక్ వస్తోంది??
పోటీ ముగ్గురి మధ్యా? ఇద్దరి మధ్యా? అన్నది ప్రజలు తేలుస్తరు. సీఎం కేసీఆర్ ఓట్ల గాలం బెడిసికొడుతుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నాయకుల్లేని నావలా ఉంది. కేంద్రంలో ఎలాగూ మోదీ ప్రభుత్వం ఏర్పడనున్నందు.. రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని వస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటారు.
‘రూ.15లక్షల కోసం కేంద్రానికి ప్రజలు
దరఖాస్తు చేసుకోవాలి’ అంటూ కేటీఆర్ వేసిన సెటైర్‌పై మీ కామెంట్?
అసలు మోదీ చెప్పిందేంటో వీళ్లకు తెలుసా? ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.15లక్షలు వేసేంత నల్లధనం ఉందని అన్నారే కానీ.. ఇస్తామని చెప్పలేదు. ధైర్యముంటే టీఆర్‌ఎస్ మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టమనండి.. దళితుడిని సీఎం చేస్తామని, మూడెకరాల చొప్పున భూమి ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ చెప్పిండ్రు కదా.. ఏమైంది? డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, రుణ మాఫీపై ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నరు? ముందు వీటికి సమాధానం చెప్పాలి.
బీఎస్పీ, షర్మిల పార్టీలకు బీజేపీ అండ ఉందన్న టీఆర్‌ఎస్ విమర్శపై మీ స్పందన?
మేం ఎవరి వెనుకా లేము. కొట్లాడే దమ్ము మాకే ఉన్నప్పుడు ఇంకో పార్టీని మేమెందుకు స్వాగతిస్తం?
రాష్ట్రమంతా దళితబంధు అమలు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారు. మీ అభ్యంతరమేంటి?
దళిత బంధును వ్యతిరేకించే వారంతా మూర్ఖులే. కానీ, ఓట్ల కోసం, రాజకీయం కోసమే ఆ పతకం తీసుకొచ్చినట్లు స్వయంగా కేసీఆరే చెప్పిండు. తద్వారా ఆయన విశ్వసనీయత కోల్పోయిండు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కో జిల్లాలో ఒక్కోరోజు జీతాలు ఇస్తున్న సీఎం.. రాష్ట్రమంతటా దళితబంధు అమలు చేస్తానంటే ఎలా నమ్ముతాం?
కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంటు నియోజకవర్గాలవారీగా దళిత, గిరిజన దండోరా సభలు నిర్వహిస్తోంది?
పోడుభూముల కోసం ఉద్యమం చేసింది.. లాఠీదెబ్బలు తిన్నది... బీజేపీ నేతలే. గుర్రంపోడు మారణకాండను ఏ గిరిజనుడూ మరచిపోడు. గిరిజనులు, దళితుల సమస్యలపై ఎవరైనా పోరాటాలు చేయవచ్చు. కాంగ్రెస్ నిర్ణయాలను మేమెందుకు వ్యతిరేకిస్తాం.. అది వారి ఇష్టం.. ఎవరు చిత్తశుద్ధిగా పని చేశారన్నది ప్రజలు గుర్తిస్తారు.
మీరు సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది..నిజమేనా?
సీఎం రేసులో నేను లేను. ఇప్పుడే సీఎం కావాలని కోరుకుంటోన్నళ్లంతా పిచ్చివాళ్లే. మా పార్టీ పద్ధతి ఏంటో అందరికీ తెలుసు. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్న బాధ్యతను పార్టీ జాతీయ నాయకత్వం నాకు అప్పగించింది.. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తా.
72 సీట్లలో గెలుస్తామని కాంగ్రెస్ చెబుతోంది.. మీ సంఖ్య ఎంత?
టీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారు. కేసీఆర్.. విశ్వసనీయత కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. అందుకే, రాష్ట్రం, కేంద్రంలో ఒకే పార్టీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నరు. ఈ సంఖ్య రాసిపెట్టుకోండి.. వందకు పైగా స్థానాలు కమలం ఖాతాలో చేరబోతున్నాయి.
Updated Date - 2021-08-21T06:40:31+05:30 IST