ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరుగడ్డ బిడ్డలకే ఛాన్స్‌!?

ABN, First Publish Date - 2021-06-27T05:15:09+05:30

మావోయిస్టు పార్టీ కొత్త నాయకత్వం ఏర్పాటుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవికి దామోదర్‌, ఆజాద్‌ పేర్ల పరిశీలన
ఇద్దరూ ములుగు జిల్లాకు చెందిన వారే..
సుదీర్ఘకాలంగా విప్లవోద్యమంతో మమేకం
ఉత్తర తెలంగాణలో పూర్తిస్థాయి పట్టు
యుద్ధ తంత్రంలో తిరుగులేని యోధులుగా గుర్తింపు
హరిభూషణ్‌ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం మళ్లీ ఓరుగల్లుకే..


ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి: మావోయిస్టు పార్టీ కొత్త నాయకత్వం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఇటీవలే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ మృతి చెందటంతో సమర్థ నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమైంది.  మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణ నేతలకు బాధ్యతలు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర యాక్షన్‌ టీం కమాండర్‌ బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌ పేరు కూడా తెరపైకి వచ్చినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరో ఒకరిని మావోయిస్టు  రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు కూడా ములుగు జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.


హరిభూషణ్‌ వారసుడు...?
తెలంగాణలో మావోయిస్టు పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు  హరిభూషణ్‌ తీవ్రంగా ప్రయత్నించారు.  మూడు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. తన బాధత్యలను శక్తిమేర నిర్వర్తించారు. ఆయన మరణంతో ఇప్పుడా పదవిలో హరిభూషణ అంతటి సమర్థుడిని  ఎంపిక చేయటంపై ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది.


ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ యాక్షన్‌ టీం కమాండర్‌గా ఉన్న బడె చొక్కారావు అలియాస్‌ దామోదర్‌ పేరును పరిశీలిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. దామోదర్‌తో పాటు  భద్రాద్రి కొత్తగూడెం, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌- మంచిర్యాల డివిజన్‌ కమిటీ కార్యదర్శి మైలారపు అడేళ్ల అలియాస్‌ భాస్కర్‌, బండి ప్రకాశ్‌ అలియాస్‌ బండి దాదా, జేఎండబ్ల్యూపీ డివిజన్‌ కమిటీ కార్యదర్శి కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేశ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్నారు.


వీరిలో ఉత్తర తెలంగాణలో గట్టి పట్టు ఉన్న దామోదర్‌ వైపు పార్టీ మొగ్గు చూపుతోందని ప్రచారం జరుగుతోంది. ఏటూరునాగారం ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేసిన దామోదర్‌ అంచెలంచలుగా ఎదుగుతూ వస్తున్నారు. జిల్లాల పునర్విభజన జరగక ముందు కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌ (కేకేడబ్ల్యూ) డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా పని చేశారు. అనంతరం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, పెద్దపల్లి (జేఎండబ్ల్యుపీ) డివిజన్‌ కార్యదర్శిగా కూడా పని చేశారు.


పోలీసులకు దామోదర్‌ కార్యకలాపాలు మింగుడు పడకపోవటంతో ఆపరేషన్‌ దామోదర్‌ పేరుతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే మైదాన ప్రాంతాలతో పాటు ఏజెన్సీలోనూ మావోయిస్టు పార్టీని బలోపేతం చేశారు. మిలిటెంట్‌ వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు అర్బన్‌ ప్రాంతాల్లో పార్టీకి సానుభూతిపరులను సాధించటం, కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో దామోదర్‌ వ్యూహత్మకంగా వ్యవహరించారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. దీంతో దామోదర్‌ను పోలీసులు టార్గెట్‌ చేయటంతో పార్టీ ఆయన్ను 2019లో జేఎండబ్ల్యూపీ డివిజన్‌ కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించి రాష్ట్ర కమిటీలోకి తీసుకుంది. రాష్ట్ర యాక్షన్‌ కమిటీ కమాండర్‌గా పదోన్నతితో నియమించింది.


ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గట్టి పట్టుండటంతో పాటు పార్టీతో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉండటంతో దామోదర్‌ వైపే ఆ పార్టీ కేంద్ర నాయకత్వం మొగ్గు చూపుతోందని నిఘా వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. దామోదర్‌పె భూపాలపల్లి, ములుగు, మహబూబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాటు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 70కిపైగా కేసులు ఉన్నాయి. ప్రభుత్వం దామోదర్‌పై 25లక్షల రివార్డు కూడా ప్రకటించింది.


అలాగే మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ చీఫ్‌గా నియమించేందుకు మరోపేరు కూడా తెరపైకి వస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, పశ్చిమ గోదావరి ఏరియాలో పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌ను కూడా రాష్ట్ర కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీ, ఒడిశా సరిహద్దుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలను చురుగ్గా నిర్వర్తిస్తున్నారు. ఆజాద్‌ మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో 140కి పైగా కేసులు ఉన్నాయి. అయితే పార్టీలో దామోదర్‌ కంటే ఆజాద్‌ జూనియర్‌ కావటంతో పార్టీ దామోదర్‌ వైపే మొగ్గు చూపొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

ఇద్దరూ ములుగు జిల్లా వారే..
ఇటీవల మృతి చెందిన హరిభూషణ్‌ది పూర్వ వరంగల్‌ పరిధిలోని మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం మడగూడెం. ఆయన వారసుడిగా పేరు వినిపిస్తున్న ఇద్దరు నేతలు కూడా పూర్వపు వరంగల్‌ పరిధిలోని ములుగు జిల్లా వాసులే. బడే చొక్కారావు అలియస్‌ దామోదర్‌ ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి. దామోదర్‌ సోదరుడు బడె నాగేశ్వర్‌రావు కూడా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా వ్యహరించారు. 1993లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన దామోదర్‌ ఏటూరునాగారం ఏరియా కమిటీలో పని చేశారు. ఏటూరునాగారం ఎస్టీ హాస్టల్‌లో  ఆయన పదో తరగతి వరకు చదువుకున్నారు. ఈ ప్రాంతంపై ఆయన గట్టి పట్టు సాధించారు. మూడు దశాబ్దాలుగా పార్టీలో అంచెలంచలుగా ఎదుగుతూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, యాక్షన్‌టీం కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.


అలాగే కొయ్యడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌ గోవిందరావుపేట మండలం మోద్దులగూడెం గ్రామంలో జన్మించారు. 1995లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరిన సాంబయ్య ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వివిధ హోదాల్లో పని చేశారు. దామోదర్‌తో పాటు ఆజాద్‌ పేరు కూడా రాష్ట్ర కమిటీ కార్యదర్శికి వినిపిస్తున్నట్టు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.

Updated Date - 2021-06-27T05:15:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising