కోట్లు వెచ్చించారు.. కొత్త పోస్టులు మరిచారు!
ABN, First Publish Date - 2021-12-13T05:25:18+05:30
కార్పొరేట్ స్థాయి లో గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని కోట్ల రూపాయ లు వెచ్చించి ఆస్పత్రి భవనం నిర్మించినా.. కొత్త పోస్టులను మంజూరు చేయకపోవడంతో ఏజెన్సీ గిరిజనులకు వైద్య సేవలు అందుబాటులోకి రావడం లేదు.
నార్నూర్‌లో రూ.5 కోట్ల వ్యయంతో 30పడకల ఆసుపత్రి నిర్మాణం
అయినా.. ఏజెన్సీ గిరిజనులకు అందుబాటులోకి రాని వైద్య సేవలు
ఉట్నూర్, డిసెంబరు 12: కార్పొరేట్ స్థాయి లో గిరిజన ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని కోట్ల రూపాయ లు వెచ్చించి ఆస్పత్రి భవనం నిర్మించినా.. కొత్త పోస్టులను మంజూరు చేయకపోవడంతో ఏజెన్సీ గిరిజనులకు వైద్య సేవలు అందుబాటులోకి రావడం లేదు. నార్నూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కి వచ్చాక గిరిజనులకు సైతం మెరుగైన వైద్య సేవలు అందిస్తామని భావించి రూ.5కోట్లను వెచ్చించి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా 2020 సెప్టెంబరులో 30 పడకల ఆస్పత్రి భవనానికి ప్రారంభోత్సవం చేశారు.
వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం
రూ.5కోట్లు వెచ్చించి 30 పడకల ఆస్పత్రి భవనాన్ని నిర్మించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆస్పత్రి అవసరాల కోసం కావాల్సిన డాక్టర్లను, సిబ్బందిని నియమించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 30 పడకల ఆస్పత్రికి ఒక డిప్యూటీ సివిల్ సర్జన్, ఇద్దరు సివిల్ సర్జన్‌లు, ఒక స్త్రీ వైద్య నిపుణులు, ఒక దంతవైద్య నిపుౄణులు, పిల్లల డాక్టర్, మత్తు డాక్టర్‌లను నియమించాల్సి ఉంది. అదే విధంగా ఎడుగురు ఎంబీబీఎస్ పూర్తి చేసిన జనరల్ డాక్టర్లను నియమించాల్సి ఉంది. వీరికి తోడు ఐదుగురు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు ఫార్మసిస్టులు, ముగ్గురు ల్యాబ్ టెక్నిషియన్‌లు, మరి కొందరు వార్డు బాయ్‌లను నియమించాల్సి ఉంది. అంతేకా కుండా వీరిని ఎవరిని నియమించకుండానే ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చి భవనాన్ని ప్రారంభించారు కాని, కొత్త పోస్టులను మంజూరు చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
వృథాగా పడిఉన్న విలువైన పరికరాలు
గాదిగూడ, నార్నూర్ మండలాలతో పాటు జైనూర్, కెరమెరి మండలాల సరిహద్దు గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి ఏర్పాటు చేసిన 30 పడకల ఆస్పత్రిలో రూ. రెండు కోట్లు వెచ్చించి స్కానింగ్ మిషన్‌లు, ఆపరేషన్ ఽథియేటర్‌కు సంబంధించిన పరికరాలు, మంచాలు, కుర్చీలు, టేబుళ్లు, తదితర వస్తువులను కొనుగోలు చేశారు. ఆసుపత్రిలో అన్ని సమకూర్చినా అల్లుని నోట్లో శని అన్న చందంగా వైద్యం అందించాల్సిన డాక్టర్లు లేకపోవడంతో కోట్లాది రూపాయల ఆస్పత్రి భవనం అలంకార ప్రాయంగా మిగిలింది. ఇప్పటికైన జిల్లాలోని మంత్రులు, శాసన సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోని కోట్లాది రూపాయలతో నిర్మించిన 30 పడకల ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేయాల ని ఏజెన్సీలోని గిరిజనులు కోరుతున్నారు.
పీహెచ్‌సీ సిబ్బందితో సేవలు
: డాక్టర్ విజయ్‌కుమార్, మెడికల్ ఆఫీసర్
30 పడకల ఆస్పత్రి భవనంలో ఇది వరకు పని చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందాలంటే పూర్తి సిబ్బందిని నియమిస్తే బాగుంటుంది.
Updated Date - 2021-12-13T05:25:18+05:30 IST