కరోనా వారియర్స్‌పై కరుణేది ?
ABN, First Publish Date - 2021-10-21T06:26:28+05:30
కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో విశేషంగా సేవలు అందించిన జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ఇప్పటి వరకు ఆశిం చిన మేరకు గుర్తింపు లభించడం లేదు.
ప్రాణాలకు తెగించి సేవలందించినా గుర్తింపేదీ ?
ఇప్పటి వరకు మంజూరు కాని ప్రత్యేక అలవెన్స్‌లు
టీఏ, డీఏలపై ఊసేలేదని జిల్లాలోని ఉద్యోగుల ఆవేదన
నిర్మల్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో విశేషంగా సేవలు అందించిన జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ఇప్పటి వరకు ఆశిం చిన మేరకు గుర్తింపు లభించడం లేదు. కనీసం వారి సేవలను గుర్తించ కుండా పూర్తి గా విస్మరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. కొంతమందిని మాత్రం సన్మానించిన ప్రభుత్వం మిగతావారి విషయంలో నిర్లక్ష్యధోరణి అవలంభిస్తోందన్న ఆరోపణలున్నాయి. మొదటి, రెండోవదశ కరోనావైరస్ తీవ్రత సమయంలో జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బందితో పాటు పోలీసులు, పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను లెక్క చేయ కుండా అటు క్షేత్రస్థాయిలో తిరిగి ఎందరో మంది ప్రాణాలను నిలబెట్టారు. లాక్‌డౌన్ కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు జంకినప్పటికీ కరోనా వారియర్స్‌గా పిలుచుకునే వైద్యసిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులు సాహసోపేత సేవలు అందించి కష్టకాలంలో ఎదురీదారు. ప్రభుత్వం అన్నిశాఖలకు సేవలు ప్రకటించినప్పటికీ ఈ మూడు విభాగాల సిబ్బందికి మాత్రం అత్యవసర సేవల కింద ఎలాంటి సెలవులు మంజూరు చేయలేదు. ఇంట్లోకష్టాలు ఎదురైనప్పటికీ వారికి సెలవుల విషయంలో కఠినఆంక్షలు అమలు చేశారు. అయితే అటు వైద్య,ఆరోగ్యశాఖ, పోలీసుశాఖతో పాటు, మున్సిపాలిటీలు, పంచాయతీశాఖలు కరోనావారియర్స్ అందరికీ ప్రత్యేక అలవెన్స్‌లతో పాటు టీఏ, డీఏలు మంజూరు చేస్తామంటూ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనలన్నీ కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం చేయడం పట్ల ఆక్షేపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి అలవెన్స్‌లు గాని, టీఏ, డీఏలు గాని మంజూరు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య,ఆరోగ్యశాఖకు సంబంధించిన ఏఎన్‌యంలు, స్టాఫ్‌నర్సులు, ఆశావర్కర్లు, ఇతర సిబ్బంది కరోనారోగులకు దగ్గరుండి వైద్యసహాయం అందించారు. ఒకరిద్దరు డాక్టర్‌లు దూరంగా ఉండి వైద్యసలహాలు అందించినప్పటికీ రోగుల దగ్గరికి మాత్రం ఎఎన్‌యంలు, స్టాఫ్‌నర్సులు, ఇతర కిందిస్థాయి సిబ్బంది మాత్రమే వెళ్లిసేవలు అందించారు. ఇలా సేవలు అందిస్తున్న క్రమంలోనే చాలా మంది వైద్యసిబ్బంది కూడా కరోనా బారినపడ్డారు. వీరిలో కొంతమంది ప్రాణాలు సైతం కోల్పోయారు. దీంతో పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడమే కాకుం డా మాస్క్‌లు ధరించడం, ఇతరత్రా జాగ్రత్తల విషయంలో తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవలు అందించిన పోలీసు సిబ్బందికి సైతం ఆశించిన మేరకు గుర్తింపు లభించలేదంటున్నారు. పోలీసులకు కరోనా సమయంలో సెలవులు కూడా మం జూరు చేయకుండా నిర్భంధంగా విధులు నిర్వహింపజేశారు. వీరితో పా టు పారిశుధ్య సిబ్బంది సేవలు మాత్రం జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి. వారంతా ప్రతీరోజూ పరిసరాలను పరిశుభ్రం చేయడం, ఇతరత్రా పారిశుధ్య పనులు చేస్తూ కరోనా విజృంభించకుండా అడ్డుకోగలిగారు. ముఖ్యంగా కరోనాకారణంగా మరణించిన వారి మృతదేహాలకు సైతం వీరే అంత్యక్రియలు నిర్వహించి తమ సేవానిరతిని చాటుకున్నారు. కరోనా తీవ్రత సమయంలో ఈ మూడుశాఖల సిబ్బందిని కరోనా వారియర్స్‌గా పిలుచుకునే యంత్రాంగంతో పాటు సభ్యసమాజం సైతం ప్రస్తుతం వారందరినీ విస్మరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు అతితక్కువ వేతనాలతో పని చేస్తున్న ఆశకార్యకర్తలు మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. వీరంతా ఇంటింటికి తిరిగి కరోనాబాధితులపై సర్వేలు చేయడం అలాగే హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి మందులు అందించడంతో పాటు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వీరి సేవలను గుర్తించకుండా వ్యవహరిస్తుండడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు ఆశవర్కర్లకు వారి చేస్తున్న సేవలకు గానూ కనీస పారితోషకాలు కూడా అందించడం లేదంటున్నారు. అన్నిరకాల సేవలకు వారిని వినియోగించుకుంటున్నప్పటికీ పారితోషికం విషయంలో గాని ఇతర విషయాల్లో గాని గుర్తింపునివ్వకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారని జిల్లా ఉద్యోగులు అంటు న్నారు.
వైద్యసిబ్బందిపై నిర్లక్ష్యం
వైద్య,ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఏఎన్‌యంలు, సెకండ్ ఏఎన్‌యంలు, స్టాఫ్‌నర్సులు, ఆశ కార్యకర్తల విషయంలో సంబంధితశాఖ ఉన్నతాధికారులు పూర్తినిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. కరోనాకష్టకాలంలో వీరంతా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలు అందించిన విషయంలో విదితమే. ఎలాంటి సెలవులు తీసుకోకుండా తమ కుటుంబ సభ్యులకు సైతం దూరమై వీరంతా కరోనారోగులకు సేవలు అందించి ఎందరో మంది ప్రాణాలను కాపాడారు. ఈ క్రమంలోనే చాలా మంది ఏఎన్‌యంలు, స్టాఫ్‌నర్సులు, ఆశకార్యకర్తలు సైతం కరోనాబారిన పడి ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలున్నాయి. అయితే కష్టకాలంలో వీరందరి సేవలను గుర్తిస్తామన్న ప్రభుత్వం ఆ తరువాత వారి ఊసె త్తడం లేదంటున్నారు.
పోలీసులదీ ఇదే దుస్థితి
కరోనా వారియర్స్‌గా పిలుచుకునే వారిలో ఒకరైన పోలీసు సిబ్బందిది కూడా దయనీయ పరిస్థితే ఉందంటున్నారు. మండుటెండలో తమ ప్రా ణాలను లెక్క చేయకుండా లాక్‌డౌన్ కఠినంగా అమలుకు కృషి చేసిన సంగతి విధితమే. కరోనా కంటైన్‌మెంట్ జోన్‌లలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు సిబ్బంది చర్యలు తీసుకున్నారు. అలాగే అటు వైద్య,ఆరోగ్యశాఖకు, ఇటు పారిశుధ్య సిబ్బందికి సమన్వయ కర్తలుగా వ్యవహరించి కరోనాకట్టడికి కృషి చేశారు. దీంతో పాటు కరోనా మృతదేహాల అంత్యక్రియల విషయంలో కూడా పోలీసులు తమ విధులను సాహసోపేతంగా నిర్వర్తించారు. ఇలా సేవలు అందించిన పోలీసులకు ఇప్పటి వరకు తగిన గుర్తింపు లభించడం లేదన్న వాదనలున్నాయి.
దయనీయంగా పారిశుధ్య కార్మికుల పరిస్థితి
కరోనాకష్టకాలంలో క్షేత్రస్థాయిలో తమ ప్రాణాలను అలాగే ఆరోగ్యా లను లెక్కచేయకుండా సేవలు అందించిన పారిశుధ్య కార్మికులు ప్రస్తు తం దయనీయ స్థితులను ఎదుర్కొంటున్నారు. పారిశుధ్య పనులతో పాటు కరోనాతో మరణించిన వారి మృతదేహాలను శ్మశానవాటిక వరకు తరలించడం, అక్కడ అంత్యక్రియలు కూడా జరిపించడం లాంటి సాహసోపేతమైన పనులను పారిశుధ్య కార్మికులు నిర్వర్తించారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వీరు అటు కరోనా కట్టడికే కాకుండా ఇటు కరోనా రోగులకు సైతం సేవలు అందించి తమ సేవానిరతిని చాటుకున్నారు. అలాంటి పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం గాని సంబంధిత ము న్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు గాని ఇప్పటి వరకు తగినస్థాయిలో గుర్తింపునివ్వకపోవడం అలాగే ఆర్థిక పరమైన ప్రయోజనాలు కల్పించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాము ప్రాణా లను లెక్కచేయకుండా అందించిన సేవలకు తగిన గుర్తింపునివ్వాలంటూ కరోనా వారియర్స్ కోరుతున్నప్పటికీ తమ గోడు జిల్లాలో అరణ్యరోదనగా మారుతోందంటున్నారు.
Updated Date - 2021-10-21T06:26:28+05:30 IST