ప్రభుత్వ వైఫల్యంతోనే భైంసాలో ఘటన
ABN, First Publish Date - 2021-03-10T05:45:57+05:30
ప్రభుత్వ వైఫల్యంతోనే భైంసాలో ఆదివారం సంఘటన జరిగిందని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని భారతీయ జనతాపార్టీ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు రమాదేవి, పాయల్ శంకర్‌లు అన్నారు.
హిందువుల పైనే దాడులు జరుగుతున్నాయి
కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలి
బీజేపీ పార్టీ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు
నిర్మల్ టౌన్, మార్చి 9 : ప్రభుత్వ వైఫల్యంతోనే భైంసాలో ఆదివారం సంఘటన జరిగిందని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని భారతీయ జనతాపార్టీ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు రమాదేవి, పాయల్ శంకర్‌లు అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. భైంసా సంఘటన పథకం ప్రకారం జరిగిందని ఆరోపించారు. భైంసాలో ఎప్పుడు అల్లర్లు జరిగినా హిందువులపై కేసులు పెడుతూ మైనారిటీలకు రక్షణ కల్పిస్తున్నారన్నారు. సంఘటన జరిగి మూడురోజులు గడుస్తున్నా రాష్ట్ర డీజీపీ ఉన్నతాధికారులు ఇక్కడికి రాకపోవడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. భైంసా ఘటన ఉద్దేశ్య పూర్వకంగానే జరిగిందని, దీనిపై పోలీసుల నిఘావిభాగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ దాడిలో పోలీ సులు, పాత్రికేయులు, అమాయక ప్రజలు బలి అయినప్పటికీ వారిని పోలీ సులు విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌లో ఉంచి వేధిస్తున్నారని ఆరోపిం చారు. భైంసాలో దాడి ఘటన వెనుక కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతాపార్టీ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్, మెడిసెమ్మె రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ బీజేపీ జిల్లా నాయకులు అప్పాల గణేష్ చక్రవర్తి, పట్టణ అధ్యక్షులు అరవింద్, అల్లం భాస్కర్, ఉపాధ్యక్షులు కమల్‌నయన్, రాచకొండ సాగర్, బాబా, బీజేవైఎం నాయకులు ఒడిసెల అర్జున్, నరేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-10T05:45:57+05:30 IST