ఎక్కడికక్కడ తవ్వేస్తున్నారు...!
ABN, First Publish Date - 2021-10-30T03:43:07+05:30
ఇంటింటికి స్వచ్ఛమైన నీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఒక ప్రణాళిక అంటూ లేకుండా నెలల తరబడి సాగుతున్న పనులతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. రోడ్లకు ఇరువైపుల పేరుకుపోయిన మట్టి కుప్పల కారణంగా దుమ్ము, ధూళి వ్యాపిస్తున్నాయి. సీసీ రోడ్లు మెటల్ రోడ్లను తలపిస్తున్నాయి.
మిషన్ భగీరథ పనుల్లో కొరవడిన ప్రణాళిక
నెలల తరబడి కొనసాగుతున్న పనులు
అటవీ అనుమతులు లేక నిలిచిపోయిన రిజర్వాయన్ పనులు
దెబ్బతింటున్న అంతర్గత రోడ్లు
పగిలిపోతున్న మంచినీటి పైపులైన్లు
అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు
మంచిర్యాల, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇంటింటికి స్వచ్ఛమైన నీరందించాలని రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఒక ప్రణాళిక అంటూ లేకుండా నెలల తరబడి సాగుతున్న పనులతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. రోడ్లకు ఇరువైపుల పేరుకుపోయిన మట్టి కుప్పల కారణంగా దుమ్ము, ధూళి వ్యాపిస్తున్నాయి. సీసీ రోడ్లు మెటల్ రోడ్లను తలపిస్తున్నాయి. మంచినీటి పైపులైన్లు ఎక్కడికక్కడే పగిలిపోతుండటంతో అనేక ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోతుంది. పట్టణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మిషన్ భగీరథ పథకం వల్ల భవిష్యత్ ప్రయోజనం ఏమోగానీ, జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచి పోవడం, పైపులు దెబ్బతిని మురుగునీరు సరఫరా కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
హడావుడి ఎందుకో..?
మిషన్ భగీరథ పథకం పట్టణ వాసులకు నిత్యం మంచినీరు అందించేందుకు ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక అండాళమ్మ కాలనీ సమీపంలోని జాలాగుట్ట వద్ద రూ.58 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. టెండర్ ప్రక్రియ 2017 జూన్‌లో ముగియగా 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉండగా నిధుల కొరత కారణంగా పనులు ముందుకు సాగలేదు. దీంతో ప్రభుత్వం కాంట్రాక్టర్‌ను మార్చి 2019లో తిరిగి పనులు అప్పగించింది. జాలా గుట్టపైకి రోడ్డు నిర్మాణం చేపట్టవలసి ఉంది. ఇది పూర్తయితే గుట్టపైన గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించేందుకు అవసరమైన సామగ్రిని తరలించే అవకాశం ఉంటుంది. రోడ్డు నిర్మించే ప్రాంతం రిజర్వు ఫారెస్టు పరిధిలోకి రావడంతో అటవీ అనుమతులు లేక పనులు అర్థాంతరంగా నిలిచిపోయాయి. అటవీ అనుమతులు వస్తేగానీ పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. అనుమతులు వచ్చిన తరువాత కనీసం సంవత్సరం సమయం పడుతుందని అధికారులే చెబుతున్నారు. ఈ క్రమంలో పట్టణంలో పైపులైన్లు వేసేందుకు హడావుడి చేస్తూ, రోడ్లను తవ్వుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మంచినీటి సరఫరాలో అంతరాయం
మిషన్ భగీరథ పనుల వల్ల ప్రస్తుతం తాగునీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. భగీరథ పైప్‌లైన్ కోసం తవ్వుతున్న కందకాల కారణంగా ప్రస్తుతం మున్సిపాలిటీకి తాగునీరు అందిస్తున్న పైపులు ఎక్కడికక్కడే పగిలిపోతున్నాయి. ప్రజలు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. పాత మంచిర్యాల నుంచి రంగంపేటకు వెళ్లే రోడ్డులో ప్రస్తుతం మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి. ఎక్కడ పైపులైన్ ఉందో పరిశీలించేందుకు సిబ్బంది అక్కడక్కడ ప్రొక్లయిన్‌తో గుంతలు తవ్వుతున్నారు. దీంతో తాగునీరు సరఫరా చేసే పైపులైన్లు పగిలిపోయాయి. రోజుల తరబడి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. ప్రజల ఇబ్బందులు తొలగించడానికి భగీరథ పనుల కారణంగా పగిలిపోయిన పైపులైన్లకు మున్సిపల్ నిధులు వెచ్చిస్తూ సిబ్బంది మరమ్మతు పనులు చేస్తున్నారు.
కాంట్రాక్టర్‌దే బాధ్యత
వాస్తవానికి మిషన్ భగీరథ పనులు కారణంగా ప్రజలకు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగినా సదరు కాంట్రాక్టరే పూర్తి బాధ్యతలు వహించాల్సి ఉంటుంది. కలిగిన నష్టాన్ని కాంట్రాక్టరే పూర్తి చేయాల్సి ఉంటుంది. రోడ్లను తవ్వితే వాటి పునర్నిర్మించే బాధ్యత కూడా సదరు కాంట్రాక్టర్‌పైనే ఉంటుంది. మంచిర్యాలలో అందుకు భిన్నంగా పనులు జరుగుతుండటం గమనార్హం. మిషన్ భగీరథ పనుల కారణంగా ఏర్పడే సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని, రోడ్లపై కందకాలు, గుంతలను తామే పూడ్చుతామని పనులను ప్రారంభించే ముందు చెప్పిన కాంట్రాక్టరు నెలల తరబడి పైపులైన్లు, రోడ్లు పగిలిపోయి ఉన్నా పట్టించుకోవడం లేదు. మిషన్ భగీరథ పనుల కారణంగా ఏర్పడుతున్న నష్టాన్ని వెంట వెంటనే పూడ్చేలా జిల్లా ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని, తద్వారా తమ సమస్యలను పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2021-10-30T03:43:07+05:30 IST