ఒవైసీ ఫ్లైఓవర్‌కు అబ్దుల్ కలాం పేరు!
ABN, First Publish Date - 2021-12-29T09:28:16+05:30
ఒవైసీ ఆస్పత్రి-మిధానీ చౌరస్తాలో నిర్మించిన వంతెనకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్‌గా నామకరణం చేశారు.
ప్రకటించిన కేటీఆర్.. మంత్రులతో కలిసి ప్రారంభోత్సవం
1 నుంచి షేక్‌పేట్ ఫ్లైఓవర్ అందుబాటులోకి..?
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఒవైసీ ఆస్పత్రి-మిధానీ చౌరస్తాలో నిర్మించిన వంతెనకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్‌గా నామకరణం చేశారు. రూ.80 కోట్లతో 1.36 కిలోమీటర్ల పొడవు, మూడు లేన్లుగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను మంగళవారం మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం వంతెనకు అబ్దుల్ కలాం పేరు పెడుతున్నట్టు ట్విటర్ ద్వారా కేటీఆర్ వెల్లడించారు. ఫ్లైఓవర్‌కు సమీపంలో ఉన్న డీఆర్డీవోలో దశాబ్దానికిపైగా కలాం పని చేయడంతో ఆయన పేరు పెట్టినట్లు తెలిసింది. చాంద్రాయణగుట్ట వైపు నుంచి వచ్చే వాహనదారులు ఒవైసీ జంక్షన్ మీదుగా ఎల్‌బీనగర్ వైపు వెళ్లేందుకు ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడనుంది. రాజీవ్‌గాంధీ విమానాశ్రయం నుంచి వచ్చే వారు సిగ్నల్ చిక్కులు లేకుండా ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది. ఇక్కడ వేదికను ఏర్పాటు చేసినప్పటికీ.. ఫ్లైఓవర్‌ను ప్రారంభించాక మంత్రి కేటీఆర్ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
అనంతరం అక్కడకు చేరుకున్న బీజేవైఎం శ్రేణులు.. వంతెన వద్ద టీఆర్‌ఎస్, మజ్లిస్ జెండాలు, నేతల ఫొటోలను ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాగా, కొత్త సంవత్సర కానుకగా గ్రేటర్‌లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. నిర్మాణ పనులు పూర్తయి సిద్ధంగా ఉన్న షేక్‌పేట ఫ్లైఓవర్‌ను 1వ తేదీన ప్రారంభించనున్నారు. టోలిచౌకిలోని గెలాక్సీ థియేటర్ నుంచి ఓయూ కాలనీ, షేక్‌పేట, విస్పర్ వ్యాలీ మీదుగా మల్కం చెరువు వరకు రూ.333.55 కోట్లతో 2.8 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా ఈ వంతెనను నిర్మించారు.
Updated Date - 2021-12-29T09:28:16+05:30 IST