15 పతకాలు పక్కా..
ABN, First Publish Date - 2021-08-21T08:16:22+05:30
పారాలింపిక్స్‌లో దేశ అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని భారత పారాలింపిక్స్..
ఐదు స్వర్ణాలు సహా
మరో 3 రోజుల్లో
న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌లో దేశ అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని భారత పారాలింపిక్స్ కమిటీ చెఫ్ డి మిషన్ గుర్‌శరణ్ సింగ్ తెలిపాడు. ఈసారి కనీసం ఐదు స్వర్ణాలతో కలిపి మొత్తం 15 పతకాలను ఆశిస్తున్నట్టు చెప్పాడు. ఈనెల 24 నుంచి ఆరంభమయ్యే పారా గేమ్స్‌లో తొలిసారిగా 54 మందితో కూడిన భారీ బృందం పోటీ పడనుంది. వీరంతా ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కనోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, పవర్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండోలలో బరిలోకి దిగనున్నారు. ‘కచ్చితంగా ఈసారి మనకివి ఉత్తమ పారాలింపిక్ గేమ్స్ కాబోతున్నాయి. కొన్నేళ్లుగా భారత అథ్లెట్లు ఇందుకోసం కఠోరంగా శ్రమిస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ఈవెంట్స్‌లోనూ మెరుగైన ఫలితాలతో సత్తా చూపారు. అందుకే ఈ గేమ్స్‌లో 15 పతకాలు వస్తాయని ఆశిస్తున్నాం. ముఖ్యంగా అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, షూటింగ్, ఆర్చరీల్లో అంచనాలున్నాయి’ అని సింగ్ తెలిపాడు. ఇప్పటివరకు భారత్ పాల్గొన్న 11 పారాలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలతో మొత్తం 12 పతకాలు వచ్చాయి. ఇక పారా హైజంపర్ తంగవేలు మరియప్పన్ రెండోసారీ స్వర్ణం సాధిస్తాడని భావిస్తున్నారు. ఇటీవలి జాతీయ సెలెక్షన్ ట్రయల్స్‌లో అతడు 1.86మీ.లతో రాణించడం విశేషం.
టోక్యో చేరుకున్న పారాలింపిక్ జ్యోతి
ఓవైపు విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు భయపెడుతుండగానే.. పారాలింపిక్ జ్యోతి టోక్యోకు చేరింది. అయితే జ్యోతిని వెలిగించే కార్యక్రమానికి ఎప్పటిలాగే ప్రేక్షకులను అనుమతించలేదు. ఆ దేశ ప్రధాని యొషిహిడే సుగ మాత్రం హాజరయ్యారు. ఈ గేమ్స్ సందర్భంగా ఇప్పటిదాకా టోక్యో బే ఏరియాలో ఉన్న ఐదు రింగుల ఒలింపిక్ చిహ్నాన్ని తొలగించి అదే స్థానంలో ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో కూడిన ఎజిటోస్ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు గురువారం తొలిసారిగా అక్కడ రోజువారీ కేసుల సంఖ్య 25వేలకు చేరింది. ప్రస్తుతం మెడికల్ ఎమర్జెన్సీ కొనసాగిస్తున్న జపాన్ దేశం డెల్టా వేరియెంట్ ఐదో వేవ్‌ను ఎదుర్కొంటోంది. దీంతో పారా అథ్లెట్లు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని నిర్వాహకులు సూచించారు. ఇప్పటివరకు పారాలింపిక్స్‌కు సంబంధించి 86 మంది పాజిటివ్‌గా తేలారు. వీరిలో ఎక్కువగా జపాన్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు ఉన్నారు.
Updated Date - 2021-08-21T08:16:22+05:30 IST