పాక్ మేనేజ్‌మెంట్ తప్పుకుంటేనే.. : మహ్మద్ ఆమిర్
ABN, First Publish Date - 2021-01-19T01:40:00+05:30
పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ రిటైర్మెంట్ ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా ఇంకా ప్రకంపనలు రేపుతూనే
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ రిటైర్మెంట్ ప్రకటించి నెల రోజులు గడుస్తున్నా ఇంకా ప్రకంపనలు రేపుతూనే ఉంది. పాక్ మేనేజ్‌మెంట్‌పై గుస్సాతోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్టు అతడు చెప్పగా, కాదు.. టెస్టులు ఆడడం ఇష్టం లేకపోవడం వల్లేనని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం అటు తిరిగి, ఇటు తిరిగి చివరికి పాకిస్థాన్ హెడ్ కోచ్ మిస్బావుల్ హక్ వర్సెస్ మహ్మద్ ఆమిర్‌గా మారింది.
తాజాగా, నేడు ఆమిర్ ట్విట్టర్ ద్వారా తన మనసులోని విషయాన్ని బయటపెట్టాడు. మిస్బాబుల్ హక్ సారథ్యంలోని ప్రస్తుత మేనేజ్‌మెంట్ తప్పుకుంటే అప్పుడు తాను పాకిస్థాన్‌కు ఆడడం గురించి ఆలోచిస్తానని తేల్చి చెప్పాడు. ‘‘ఈ విషయంలో నేను స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అవును, పాకిస్థాన్ కోసం ఆడేందుకు నేను సిద్ధమే. కాకపోతే ప్రస్తుత మేనేజ్‌మెంట్ తప్పుకుంటేనే దాని గురించి ఆలోచిస్తా. కాబట్టి మీ కథనాలను అమ్ముకోవడం కోసం తప్పుడు వార్తలు ఆపండి’’ అని ట్వీట్ చేశాడు.
తనను న్యూజిలాండ్ సిరీస్ నుంచి పక్కన పెట్టడం వల్లే రిటైర్మెంట్ ప్రకటించానన్న వార్తల్లో నిజం లేదని ఆమిర్ ఇప్పటికే స్పష్టం చేశాడు. కానీ కొందరు పీసీబీ సభ్యులు మాత్రం టెస్టు క్రికెట్ ఆడడం ఇష్టం లేకే రిటైర్మెంట్ ప్రకటించాడని ప్రచారం చేశాడని అన్నాడు.
టీ20 లీగుల్లో ఆడడం కోసం పాకిస్థాన్ తరపున వన్డేలు, టీ20ల్లో ఆడబోనని తానెప్పుడూ చెప్పలేదని ఆమిర్ పేర్కొన్నాడు. అయితే, పీసీబీ మేనేజ్‌మెంట్ సభ్యులు మాత్రం టీ20 లీగుల కోసమే టెస్టులను విడిచిపెడుతున్నాడని ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫలితంగా తన ప్రతిష్ఠ దెబ్బతిన్నదని, తన గురించి ప్రజలు ఏవోవో ఊహించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. వాసిమ్ ఖాన్‌తో కానీ, ఎహసాన్ మణితో కానీ తనకు ఎటువంటి సమస్య లేదని, ప్రస్తుత మేనేజ్‌మెంట్‌తోనేనని ఆమిర్ స్పష్టం చేశాడు.
ఆమిర్ ఆరోపణలపై స్పందించిన మిస్బావుల్ హక్.. ఆమిర్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంపై వస్తున్న వార్తలకు చెక్ చెప్పాలంటే ఆమిర్ తొలుత దేశవాళీ క్రికెట్‌లో ఆడి నిరూపించుకోవాలని సవాలు విసిరాడు. ఆమిర్ పాకిస్థాన్ తరపున 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20 ఆడాడు. మూడు ఫార్మాట్లలోనూ కలిపి 259 వికెట్లు పడగొట్టాడు.
Updated Date - 2021-01-19T01:40:00+05:30 IST