69 ఏళ్ల మహిళపై ట్రోలింగ్.. ఈ ఫొటోలే కారణం..!
ABN, First Publish Date - 2021-01-17T02:55:31+05:30
కేరళకు చెందిన నటి, మలయాళ బిగ్బాస్ షో మాజీ కంటెస్టెంట్ రజినీ చాందీ(69)పై కొందరు నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మరికొందరు...
కేరళకు చెందిన నటి, మలయాళ బిగ్బాస్ షో మాజీ కంటెస్టెంట్ రజినీ చాందీ(69)పై కొందరు నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మరికొందరు అసభ్యకర కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఆమె ఓ ఫొటోషూట్లో భాగంగా తీయించుకున్న ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడమే అందుకు కారణం. రజినీ చాందీతో ఓ గ్లామరస్ ఫొటోషూట్ చేయాలని అథిర జాయ్ అనే ఫొటోగ్రాఫర్ భావించాడు. తనకు వచ్చిన ఆలోచనను ఆమెకు చెప్పడం, ఆమె కూడా అందుకు ఏ మాత్రం సంకోచించకుండా అంగీకరించడంతో ఫొటోషూట్ చేశాడు. 69 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎంత ఫిట్నెస్తో ఉన్నారో తెలియజెప్పేందుకే ఈ ఫొటోషూట్ చేసినట్లు చెప్పాడు. అయితే.. ఈ గ్లామర్ ఫొటోలపై నెట్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఈ వయసులో ఇదేం బుద్దంటూ ఆమెను కొందరు తప్పుబడితే.. మరికొందరు మాత్రం ఆమె ఈ దుస్తుల్లో ఎంతో సెక్సీగా ఉందంటూ అభ్యంతరకర కామెంట్స్ చేశారు.
ఈ ఫొటోషూట్పై ఆమె ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. డిసెంబర్లో అథిర ఈ ఫొటోషూట్ గురించి తనతో చెప్పాడని, గ్లామరస్ దుస్తులు ధరించేందుకు అభ్యంతరం ఉంటే చెప్పాలని తనను అడిగాడని చెప్పారు. అయితే.. తనకు అలాంటి అభ్యంతరాలు ఏవీ లేవని, తాను వయసులో ఉన్నప్పడు గ్లామర్ దుస్తులను ధరించానని చెప్పినట్లు ఆమె తెలిపారు. స్విమ్సూట్ ధరించిన ఫొటో కూడా ఉందని అథిరకు చెప్పినట్లు రజినీ చాందీ పేర్కొన్నారు. వయసు పైబడిన వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేందుకే తాను ఈ ఫొటోషూట్ చేసినట్లు తెలిపారు.
Updated Date - 2021-01-17T02:55:31+05:30 IST