ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అశోకుని శాసన నిలయం ‘జౌగఢ్’

ABN, First Publish Date - 2021-03-21T18:41:04+05:30

ఆ ఊర్లో అడుగుపెడితే చాలు... అడుగడుగునా పురాతన శాసనాలే పలకరిస్తాయి. వేలు పట్టుకుని కళింగ దేశాన్ని ఏలిన అశోక చక్రవర్తి రాజ్యంలోకి తీసుకెళతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ ఊర్లో అడుగుపెడితే చాలు... అడుగడుగునా పురాతన శాసనాలే పలకరిస్తాయి. వేలు పట్టుకుని కళింగ దేశాన్ని ఏలిన అశోక చక్రవర్తి రాజ్యంలోకి తీసుకెళతాయి. ఒడిశాలోని గంజాం జిల్లా ‘జౌగఢ్‌’ పట్టణం ఆ పురాతన చరిత్రకు నిలయం. ఇటీవలే ఆ పట్టణాన్ని సందర్శించారు ఈ కథనం రాసిన రచయిత. ఆయన పర్యాటక అనుభవాలే ఇవి...


జౌగఢ్‌ (జౌగడ)... ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉన్న ఈ పల్లెటూరు ఒకప్పుడు కళింగ దేశంలో పేరొందిన పట్టణం. క్రీస్తుపూర్వం మూడో శతాబ్దం నాటికి కళింగ ప్రాంతం చిన్నచిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండేదని, ఒక్కో దానికి కొందరు పాలనాధికారులుగా ఉండేవారని, వారంతా ఉత్కళ ప్రాంతం శాంతి సౌభాగ్యాలతో ఉండేలా చూసుకునేవారని చరిత్రకారులు చెబుతారు. రుషికుల్యా నది జౌగఢ్‌కు సమీపంలోని పురణ బంధ వద్ద బంగాళాఖాతంతో సంగమిస్తుంది. క్రీస్తుపూర్వం నుంచి ఇక్కడి సమీప రేవు ద్వారా ఉత్కళవాసులు అనేక దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండేవారు. అసలు ‘ఉత్కళ’ అంటేనే ఉత్కృష్టమైన కళలకు నిలయం అని అర్థం. నేటికీ ఈ ప్రాంత వాసులు రూపొందించిన అనేక కళాకృతులకు దేశవిదేశాలలో చక్కని ఆదరణ ఉంది. 


‘ఇక్కడి ప్రజలంతా నా సంతానం. వారు ఇహపరాలలో సుఖశాంతులతో గడపాలని నేను కోరుకొంటున్నాను. ప్రస్తుతమే కాదు భవిష్యత్తులో కూడా వారు ఇదే విధమైన సుఖశాంతులతో జీవించాలని ఆశిస్తున్నాను’ - అశోకుని శాసనం


ధర్మాన్ని బోధించాడు..


కళింగ యుద్ధంలో విజయం సాధించినా కళ్ళ ముందు జరిగిన ఘోర రక్తపాతాన్ని చూసి చలించిపోయిన అశోకుడు హింసను, రక్తపాతాన్ని వ్యతిరేకించే బౌద్ధ మతాభిలాషిగా మారిపోయాడని అంటారు. సమాజంలో నెలకొనాల్సిన సమానత్వాన్ని, అందుకోసం పాటించవలసిన ధర్మం గురించి అశోకుడు తన శాసనాల్లో ప్రముఖంగా పేర్కొన్నారు. బౌద్ధ మత ధర్మ ప్రచారంలో భాగంగా అశోకుడు ఎన్నో స్థూపాలను, ఆరామాలను, జయ స్థూపాలను నెలకొల్పాడు. ముఖ్య ప్రాంతాలలో శాసనాలను వేయించాడు. అలాంటి చిన్నా పెద్ద శాసనాలు మన దేశంతో పాటు నేటి ఆఫ్ఘానిస్తాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లతో కలిపి మొత్తంగా ముప్పైకి పైగా లభించాయి. ఇవన్నీ క్రీస్తు పూర్వం 268 - 232 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవిగా చరిత్రకారులు నిర్ధారించారు. పొరుగు దేశాలలో లభించిన శాసనాలు ఖర్దోసి, గ్రీక్‌, అర్మానిక్‌ భాషలలో ఉండగా, మన దేశంలో లభించినవి ప్రాకృత భాషలో ఉండి బ్రహ్మిలిపిలో రాసినవి కావడం విశేషం. 


వివిధ ప్రాంతాలలో అశోకుడు వేయించిన పెద్ద శాసనాలు 14 లభించగా వాటిల్లో రెండు కళింగలోనే ఉండటం చెప్పుకోదగిన అంశం. అందుకే వీటిని ‘కళింగ అశోక శాసనాలు’ అని పిలుస్తారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ నగర శివార్లలో దయానది తీరంలో ఉన్న ‘ధౌలీ’ని అప్పట్లో ‘తోషాలి’ అని పిలిచేవారట. అక్కడే కళింగ యుద్ధం జరిగిందని చరిత్రకారులు నిర్ధారించారు. నాలుగు దశాబ్దాల కిందట ఇక్కడి కొండ మీద జపాన్‌ ప్రభుత్వం చక్కని బౌద్ధ స్థూపాన్ని నిర్మించింది. తవ్వకాలలో కొండ కింద అనేక రాతి శిల్పాలు, స్తంభాలు లభించాయి. అక్కడే ఉంటుంది అశోకుడు కళింగ ప్రాంతంలో వేయించిన శాసనాల్లో ఒకటి. రెండవది గంజాం జిల్లా ముఖ్య నగరమైన బెర్హంపూర్‌ (బరంపురం)కి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న జౌగఢ్‌ వద్ద ఉంది. ఈ రెండు శాసనాల్లో అశోకుడి సందేశం మిగిలిన వాటికి భిన్నంగా ఉండటం చెప్పుకోవలసిన విషయం. అందుకే చరిత్రకారులు వీటిని ప్రత్యేక శాసనాలుగా పరిగణించారు. అప్పట్లో అనేక దేశాలతో వర్తకవాణిజ్యాలు రుషికుల్యా నది రేవు ద్వారా జరగడం వలన దేశవిదేశాలకు చెందిన వర్తకులు, ఇతర ప్రజలు ఇక్కడికి వచ్చేవారు. ఈ విషయాన్ని ఇక్కడ  జరిపిన తవ్వకాలలో లభించిన అశోకునితో సహా వివిధ కాలాలకు చెందిన బంగారు, ఇతర లోహాల నాణేలు ప్రామాణికంగా నిలుస్తూ బలపరుస్తున్నాయి.  


లక్క ఇల్లు ఇక్కడే ఉండేదని...


ద్వాపర యుగంలో కూడా జౌగఢ్‌ గుర్తింపు కలిగిన రేవు పట్టణంగా, వాణిజ్య కేంద్రంగా ఉండేదని స్థానికంగా ప్రచారంలో ఉన్న కొన్ని గాథల ఆధారంగా తెలుస్తోంది. తొలుత ‘సమర’గా తర్వాత ‘జగతు’గా పిలవబడిన ఈ ఊరికి జౌగఢ్‌ అన్న పేరెలా వచ్చిందంటే... ఒడియా భాషలో జౌ అంటే లక్క అని, గఢ్‌ అంటే కోట అని అర్ధం. శకుని సలహా మేరకు పాండవులను పరిమార్చడానికి దుర్యోధనుడు లక్క ఇల్లు కట్టించిన స్థలం ఇదేనని స్థానికుల విశ్వాసం. గతంలో ఈ ఊరి చుట్టూ మట్టి కోట ఆనవాళ్లు కనిపించేవట. అదేవిధంగా సమీప శివాలయంలో ఉన్న ఒక స్త్రీ, అయిదుగురు పురుష విగ్రహాలను కుంతీ, ఆమె పుత్రులైన పంచ పాండవులవిగా భావించి నేటికీ పూజలు చేయడం ఈ నమ్మకానికి నిదర్శనంలా కనిపిస్తుంది. 




ఈ శాసనాలు ప్రత్యేకం... 


ఒడిశాలో లభించిన రెండు శాసనాలలో మొదటిది తోశాలి లేదా దౌలీలో పెద్ద రాతి మీద తల భాగం మాత్రమే చెక్కబడిన ఏనుగు శిల్పం కింద లిఖించబడింది. ఇక రెండోదైన జౌగఢ్‌ శాసనం నాటి నగరం మధ్యలో గల ‘కఫింగల పర్వతం’ మీద పెద్ద రాతి మీద రాయబడింది. ఈ రెండింటిలో కూడా చక్రవర్తిని ‘దేవనాం ప్రియ ప్రియ రాసినో అశోక’ అనే సంభోధించబడింది. కానీ తరువాతి సందేశంలోనే మార్పులు చోటు చేసుకున్నాయి. ‘ఇక్కడి ప్రజలంతా నా సంతానం. వారు ఇహపరాలలో సుఖశాంతులతో గడపాలని నేను కోరుకొంటున్నాను. ప్రస్తుతమే కాదు భవిష్యత్తులో కూడా వారు ఇదే విధమైన సుఖశాంతులతో జీవించాలని ఆశిస్తున్నాను’ అని ప్రారంభమవుతాయి. ఈ పద ప్రయోగం కళింగ ప్రాంత ప్రజలలో యుద్ధానంతరం నెలకొన్న భయాందోళనలను, తన పట్ల ఏర్పడిన ద్వేష భావాన్ని తొలగించడానికి అశోకుడు చేసిన ప్రయత్నంగా చరిత్రకారులు పేర్కొంటున్నారు. 


అనంతర భాగంలో స్థానిక పాలనాధికారులైన మహా మాత్రలను ఉద్దేశించి చేసిన సూచనలుగా కనిపిస్తాయి. ఇందులో చక్రవర్తి ఈ ప్రాంత ప్రజలందరినీ శాసన బద్ధులుగా ఉంచి, వారి యోగక్షేమాలను పరిరక్షించాలని... వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పించాలని ఆదేశించారు. ఉత్సవాలలో, పర్వదినాలలో, దైనందిన జీవితంలో జీవహింస జరగరాదని, జంతు బలులు జరపరాదని నిర్ధేశించారు. (ఏయే జీవులను, పక్షులను చంపరాదో కూడా విడిగా ఒక జాబితాను తయారు చేసి మహా మాత్రలకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది) సమాజంలో ధనిక పేద తేడా ఉండరాదని, కుల వివక్ష చూపరాదని, ప్రజలంతా ధర్మాన్ని పాటిస్తూ ఇతరుల పట్ల, సకల జీవుల పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉండాలని కోరుకున్నారు. జౌగఢ్‌ శాసనం చిన్నగుట్ట మీద పదిహేను అడుగుల నల్ల రాతి మీద మూడు వరుసలలో చెక్కి ఉంటుంది. కాలక్రమంలో కొంతమేర శిథిలావస్థకు చేరుకొన్న ఈ శాసనం స్పష్టంగా ఉండదు. మిగిలిన దాని సంరక్షణలో భాగంగా తాకడానికి వీలు లేకుండా ఇనుప తలుపులను అమర్చారు. శాసనం ఉన్న చోటికి చేరుకోడానికి దారి ఉంది. ప్రస్తుతం ఇది చారిత్రక నిర్మాణాల జాబితాలో పురావస్తుశాఖ వారి సంరక్షణలో ఉంది. జౌగఢ్‌ చుట్టూ పరుచుకొని ఉన్న పచ్చని పంట పొలాలు, ఎత్తైన చెట్లు, మందగమనంతో ప్రవహించే నది పర్యాటకులకు కనుల విందు చేస్తాయి. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న వారికి జౌగఢ్‌ సందర్శన చక్కటి అనుభూతులను పంచుతుంది.


ఎలా వెళ్లాలి?


జౌగఢ్‌ను ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా మార్చడానికి ఎన్నో అనుకూల అంశాలున్నాయి. ఒడిశాలోని ప్రముఖ దేవీ ఆలయాలలో ఒకటి, మహాశక్తి పీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందిన తారాతరణి క్షేత్రం ఇక్కడికి సమీపంలో ఉంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు బెర్హంపూర్‌ (బరంపురం) 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ తెలుగువాళ్లు అధికంగా ఉంటారు. గంజాం జిల్లాకు చెందిన ఈ నగరాన్ని సిల్క్‌సిటీగా పిలుస్తారు. బెర్హంపూర్‌ నుంచి సుమారు 33 కిలోమీటర్ల దూరంలో తారాతరణి, జౌగఢ్‌లు 

ఉన్నాయి.


- ఇలపావులూరి వెంకటేశ్వర్లు
9052944448 

Updated Date - 2021-03-21T18:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising