వెరైటీ లవ్.. నిఘా పెట్టడానికొచ్చి నిందితుడితో డిటెక్టివ్.. చివరికి..
ABN, First Publish Date - 2021-08-21T12:34:32+05:30
ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. రెండు మనసులు ఒక్కటి కావడానికి కావడానికి పెద్దగా కారణాలేవీ అక్కర్లేదు. ఇది ఇప్పటిమాట కాదు....
మాస్కో: ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. రెండు మనసులు ఒక్కటి కావడానికి కావడానికి పెద్దగా కారణాలేవీ అక్కర్లేదు. ఇది ఇప్పటిమాట కాదు.. చరిత్ర చెబుతున్న సత్యం. అయితే విధి నిర్వహణను మర్చిపోయి.. నిందితులతోనే ప్రేమలో మునిగితేలితే ఎక్కడలేని తిప్పలు వచ్చిపడతాయి. తాజాగా ఓ రష్యన్ డిటెక్టివ్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తాను వెంటాడాల్సిన నిందితుడితోనే ప్రేమలో పడింది. అతడితో బంధం పెంచుకుంది. ఉద్యోగ ధర్మాన్ని గాలికొదిలి అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరగ సాగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెకు షాకిచ్చారు. ఆమెపై క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మదీనా సుకెనోవా.. 24 ఏళ్ల రష్యన్ స్పై ఏజంట్. ఈ మధ్యనే తన చదువు పూర్తి చేసుకుని ప్రొఫెషనల్‌గా చేరింది. మొదటి కేసుగా మిఖాయిల్ సెర్బిన్ అనే వ్యక్తిపై ఆమె నిఘా పెట్టాల్సి ఉంది. మిఖాయెల్ తన బ్యాంకు ఖాతాలో డబ్బులు కాజేశాడని, అతడిపై నిఘా పెట్టి అసలు విషయం రాబట్టాలని ఆమె క్లైంట్ ఆమెను నియమించాడు. కానీ మదీనా అతడితో చనువుగా పెంచుకుని ప్రేమలో పడింది. అతడికి తన ప్రేమకు గుర్తుగా ఓ కారును కూడా బహూకరించింది. ఒకరోజు సెర్బిన్ అదే కారులో తన ప్రేయసి మదీనా ఇంటికి వెళుతుండడంతో ఈ వీరి ప్రేమాయణం బయటపడింది.
ఈ ప్రేమాయణం గురించి ఆమె తన ఉన్నతాధికారులకు చెప్పకపోవడంతో ఆమెపై కూడా అధికారులు క్రిమినల్ సెక్షన్ల కింద దర్యాప్తు ప్రారంభించారు. ఉద్యోగ ధర్మాన్ని పక్కనపెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా.. ఓ నిందితుడికి సాయం చేయడం వల్లనే ఆమెపై కూడా ఇప్పుడు నేర విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అయితే ఆమె ఈ మధ్యనే పోలీసులను ఈ కేసు నుంచి తనను తప్పించాలని కూడా కోరిందట. కానీ ప్రేమ వ్యవహారం గురించి మాత్రం చెప్పలేదట.
Updated Date - 2021-08-21T12:34:32+05:30 IST