ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రసరమ్యం.. రామప్ప శిల్పం

ABN, First Publish Date - 2021-08-08T17:53:42+05:30

రాజ్యాలు రాళ్లలో కరిగిపోవచ్చు.. రాజులు మట్టిలో కలిసిపోవచ్చు. అంగరంగ వైభవంగా అలరారిన అలనాటి కళా వైభవాన్ని నేటికీ సజీవంగా కళ్ల ముందుంచేవి మాత్రం అపురూప చారిత్రక కట్టడాలే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్యాలు రాళ్లలో కరిగిపోవచ్చు.. రాజులు మట్టిలో కలిసిపోవచ్చు. అంగరంగ వైభవంగా అలరారిన అలనాటి కళా వైభవాన్ని నేటికీ సజీవంగా కళ్ల ముందుంచేవి మాత్రం అపురూప చారిత్రక కట్టడాలే!. అందులో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతూ.. అద్భుత కళా సంపదను నింపుకున్న దేవాలయాలు ముఖ్యమైనవి. నలభై ఏళ్ల పాటు యజ్ఞం చేసి మలిచిన రామప్ప ఆలయం ఎనిమిది వందల ఏళ్లయినా చెక్కుచెదరలేదు. కాకతీయ రాజ్యం, రాజులు కాలగర్భంలో కలిసిపోయినా వారి కళావైభవం మాత్రం చిరస్మరణీయం. ఆలయంలోని అధిష్టానం మొదలుకొని... ప్రాకారం, రాతిస్తంభాలు, దూలాలు, మండపాలు, శిల్పాలు, గోపురాల వరకు ప్రతి నిర్మాణం శిల్పశాస్త్రాన్ని బోధిస్తుంది. చరిత్రను చాటి చెబుతుంది. అందుకే తెలంగాణలోని పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తించింది. ప్రపంచకీర్తి పొందిన రామప్ప ఆలయ ప్రత్యేకత... కాకతీయుల  శిల్పకళ..


అవి... క్రీ.శ.12వ శతాబ్ది చివరి ఘడియలు. అనుకోకుండా వినిపించాయి ప్రమాదపు ఘంటికలు. సింహాసనాన్ని అధిష్టించాల్సిన కాకతీయ గణపతిదేవున్ని దేవగిరి యాదవులు అనూహ్యంగా బంధించి, తమ స్థావరానికి తరలించారు. ఆ వార్త తెలుగు నేలంతా పాకింది. దానికి తోడు సామంతులు విజృంభించి, తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. అరాచకం హద్దులు మీరుతోంది. పాలన అస్తవ్యస్తమవుతోంది. అప్పటికీ కాకతీయ కొలువులో ఉన్న రేచర్ల రుద్రుడు, చాకచక్యంగా, వ్యవహరించి, తిరుగుబాట్లను అణచివేసి, రాజ్యంలో శాంతికి బాటలు వేశాడు. విరియంల మల్యాల సామంతులతో కలసి గణపతి దేవున్ని బంధ విముక్తుణ్ణి చేశాడు. అంతేకాదు, అందరి అభిలాష మేరకు కాకతీయ సింహాసనంపై పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఒకపక్క శతృవులపై దృష్టిసారిస్తూనే, మరో పక్క తన యంత్రాంగాన్ని బలోపేతం చేసుకున్నాడు గణపతిదేవుడు. సింహాసనం అధిష్టించిన తొలినాళ్లలోనే రాజ్యాన్ని పటిష్టపరిచి, చుట్టుపక్కల భూభాగాల్ని జయించి, రాజ్యాన్ని సువిశాల కాకతీయ సామ్రాజ్యంగా విస్తరించాడాయన. కొత్తకొత్త పట్టణాలు, దేవాలయాలను నిర్మించి, చెరువులను సైతం తవ్వించాడు. కవులు, కళాకారులను ప్రోత్సహించాడు.


రుద్రసేనాని శక్తి సామర్థ్యాలను స్వయంగా చూసిన గణపతిదేవుడు, తన కాకతీయ సామ్రాజ్య సర్వసైన్యాధ్యక్షునిగా రుద్రున్ని నియమించాడు. రుద్రుని కళ్లలో ఆనందపు వెలుగుల్ని విరబూయించాడు. రేచర్ల వంశ మూల పురుషుడు బ్రహ్మసేనాపతి. ఆ వంశంలో జన్మించిన కాటయ, అతని కుమారుడు కామ చమూపతి, అతని కుమారుడు కాట చమూపతి (రేచర్ల కాట్రెడ్డి). ఇతని కుమారుడే రేచర్ల రుద్రుడుగా ప్రసిద్ధిగాంచిన రేచర్ల రుద్రిరెడ్డి. కాకతీయ రాజ్యస్థాపనాచార్య బిరుదాంకితుడు, సమర్థ సైన్యాధ్యక్షునిగా గుర్తింపు పొంది, గణపతి దేవ చక్రవర్తి అభిమానాన్ని చూరగొన్న రేచర్ల రుద్రుడు, కాకతీయ సామ్రాజ్యంలో ఎక్కడాలేనట్లు వాస్తు శిల్ప విన్యాసంతో ఒక అపురూప ఆలయాన్ని నిర్మించి చక్రవర్తిని అబ్బురపరచాలనుకొన్నాడు. రాజధాని ఓరుగల్లుకు ఐదు క్రోసుల దూరంలో ఉన్న పాలంపేటలో అనువైన స్థలాన్ని ఎంచుకొని, మెప్పుపొందిన శిల్పులను రప్పించుకొని తన ఆలోచనలను పంచుకొని, దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టాడు.


అంగరంగవైభవంగా..

అది క్రీ.శ. 1203 సంవత్సరం. ప్రధాన శిల్పి రచించిన ఆలయ నమూనాను ఆమోదించి పనులు ప్రారంభించాడు. పదేళ్ల పాటు సాగిన నిర్మాణం ముగిసి, 31-3-1213న రుద్రేశ్వరాలయంలో రుద్రేశ్వరుణ్ణి తన పేరిట ప్రతిష్టించాడు. ఆనాటి మహా ప్రతిష్ట, మహా కుంభాభిషేకాలకు చక్రవర్తి గణపతి దేవున్ని, పట్టపురాణి సోమలదేవిని, అప్పుడే పుట్టిన గారాల పట్టి రుద్రమదేవిని ఆహ్వానించాడు రుద్రసేనాని. అంగరంగ వైభవంగా, ఆగమశాస్త్ర ప్రకారంగా కార్యక్రమాన్ని నిర్వహించి, స్థపతులు, శిల్పులను, గౌరవించి, కానుకలు అందించి, తాను మాత్రం చక్రవర్తి అభిమానాన్ని బహుమానంగా పొందాడు.


ఆలయ నిర్మాత రేచర్ల సేనాపతి. శిల్పి తెలియదు. కానీ, ఆలయాన్ని రామప్ప అనే శిల్పి నిర్మించాడనీ, అందుకే ఈ ఆలయానికి రామప్ప దేవాలయమన్న పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. అయితే చారిత్రక ఆధారాలు మాత్రం లేవు. నేడు అపురూపంగా వెలుగొందుతున్న రుద్రేశ్వరాలయం, దక్షిణాదిలోనే అరుదైన ఆలయంగా గుర్తింపు పొందింది. రుద్రేశ్వరాలయం కాస్తా రానురానూ రామప్ప ఆలయంగా వాసికెక్కింది. రామప్ప దేవాలయం, గర్భాలయ, అర్థ మండప, రంగమండప, నంది మండపాలతో కొలువు తీరింది. కుడివైపున కామేశ్వరాలయం కళ్యాణ మండపం, ఎడమవైపున కాటేశ్వరాలయాలు, చుట్టూ ప్రాకారంతో అందమైన దేవాలయ సముదాయంగా రూపుదిద్దుకొంది. ఆలయం నిలువు భాగంలో ఉపపీఠం, అధిష్ఠానం, పాదువర్గం, ప్రస్తరం (కప్పు), విమానంతో, పైన బంగారు కలశంతో దివ్య విమానాన్ని పోలి ఉంది.


రామప్పదేవాలయ ఉపపీఠం ఎనిమిది వరుసలతో, చుట్టూ ప్రదక్షిణ చేయటానికి వీలుగా నిర్మించబడింది. ఉపపీఠంపైన గల అధిష్టానం పై వరుసలో అందమైన అలనాటి మందగమనలైన ఏనుగుల వరుస దానిపైన మళ్లీ ఏనుగుల వరుస, గణపతి, భైరవ, గజలక్ష్మి, మల్లయుద్ధం, సూర్యుడు, మొసలి శిల్పాలు, కాకతీయ శిల్పుల శిల్పకళానైపుణ్యానికి మచ్చుతునకలుగా భాసిల్లుతున్నాయి. కట్టడ భాగాలపై చెక్కిన శిల్పాన్ని వాస్తు శిల్పం అంటారు. కాకతీయ వాస్తుశిల్పం సమకాలీన హొయసల వాస్తు శిల్పానికి ఏమాత్రం తీసిపోని వాసిగల శిల్పంగా పేరుగాంచింది. ఏనుగుల జీవం ఉట్టిపడుతూ, ఆనాటి ధైర్య, సాహసాలకు అద్దం పట్టే శిల్పాలెన్నో ఉన్నాయిక్కడ. 


మనోహర శిల్పకళ..

దేవాలయ రంగమండప. అధిష్ఠానం పైన ఒక పిట్టగోడలాంటి నిలువురాతిని వంకరగా నిలబెట్టారు. భక్తులు ఆనుకొని కూర్చోవటానికి వీలుగా తీర్చిదిద్దిన ఈ అరుగు పైన వాలు రాయిని కక్షాసనం అంటారు. చుట్టూ ఉన్న ఇరవై కక్షాసనాల మీద వెలుపలివైన జైనతీర్థంకరులు కత్తి, డాలు పట్టిన యోధుడు, నాట్య గణపతి, చామరాన్ని పట్టుకొన్న యువతి, విల్లు, బాణాలను ధరించి ఎక్కు పెట్టడానికి సిద్ధంగా ఉన్న యుద్ధమనోహరంగా ఉన్న వేటగత్తెలు, భటులు, భైరవులు, ఆలయ నృత్యంలో సిద్ధహస్తులైన రుద్ర గణికలు, వేణుగోపాలుడు, మల్లయుద్ధంలో మేటులైన జెట్టీలు, కొమ్మల్ని పట్టుకొని వయ్యారాలను వొలకబోస్తున్న అందగత్తెలు, నాట్యంలో మాకుమించిన వారున్నారా అని సవాళ్లు విసురుతున్న జవరాళ్లు, అటూ ఇటూ మద్దెల్లు వాయిస్తున్న మార్ధంగికులు, పూలదండగా ఎత్తిపట్టుకొన్న నాగినులు.. రతీ, మన్మధులకే సురతికేళిలో మెలకువలు నేర్పుతామంటున్న యువతీ యువకులు, మైథున శిల్పాలు, జగమంతా మిథ్యేనని చాటి చెబుతూ నగ్నంగా తిరుగాడుతున్న రుషిపుంగవులు, శివుడే తమ సర్వస్వమంటూ భక్తి భావంలో మునిగిన శైవభక్తులు, మైలార భటుల శిల్పాలు, చక్కటి అంగసౌష్టవంతో, తగిన ఆభరణాలు, అలంకరణలతో అందాన్ని కరిగించి, కాకతీయ శిల్పులు ఈ శిల్పాల్ని సృష్టించారా అన్న భ్రమకు గురవుతారు ఆలయ సందర్శకులు. శిల్పాల మధ్యలో అనల్పకల్పనా శక్తికి పేరుగాంచిన శిల్పులు, నాలుగు దళాల పద్మాల్ని, పట్టీలను సుతారంగా చెక్కి తమ హస్త కళా లాఘవాన్ని ప్రదర్శించారు. కక్షాసన లోపలి వైపున రుద్రుని పరివారంగా, ఏడు చిన్న దేవాలయాల్లోని రెండింటిలో మాత్రం మహిషాసురమర్థిని, గణపతి విగ్రహాలున్నాయి.


నలుపుపై నిగిషీలు..

ఇక అధిష్ఠానం పైన ఆలయం గోడల పైన చక్కటి స్తంభాలు, చిన్న దేవాలయ నమూనాలు, మధ్యలో మూడంచెల కోష్టాలు వాటికింద మళ్లీ ఉరుకుతున్న, నిలబడిన, చోద్యం చూస్తున్న ఏనుగుల వరుస, దాని కింద చూడ ముచ్చటైన బుల్లినంది, శిల్పుల నేర్పిరితనాన్ని పట్టి చూపుతున్నాయి.


ఆలయ గోడల పైన గల కప్పు - చూరు చివర వర్షపు నీటి తుంపర్ల పరంపరలు, పట్టీలు, బద్దెలు, వడ్రంగుల పనితనానికి నిదర్శనం. ఇక కప్పుల పైన ముందు కొచ్చిన శుకనాసి, పై వరకూ అందంగా తీర్చిన విమాన శిఖరం, కలశం, ఆలయానికి నిండుదనాన్నిచ్చాయి. దేశంలో ఎక్కడా లేనట్లు విమాన శిఖారాన్ని నీటిలో తేలియాడే తేలిక పాటి ఇటుక రాళ్లను మలిచి నిర్మించి, అద్భుత కట్టడంగా తీర్చిదిద్దిన కాకతీయ శిల్పులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. గర్భాలయ, అర్ధ మండపాల తర్వాత, మూడు వైపులా ప్రవేశ మార్గాలలో చదరపు రంగమండపం ఉంది. మధ్యలో నాలుగు నల్ల శాసనపు రాళ్లతో నగిషీగా, అద్దంలా ప్రతిబింబం కనిపించేట్లు చెక్కిన స్తంభాలు, వాటిపైన దూలాలు మతి పోగొడతాయి. అంతటి నునుపును తెచ్చిన శిల్పుల సాంకేతిక నైపుణ్యానికి వందల వేల వందనాలర్పించటం తప్ప మరేం చేయలేం!.


రుద్రుడి గురుతులు..

స్తంభాలపైన నాట్య గణపతి, శృంగార భంగిమల్లో దంపతులు, సైనికులు, ఆలయ నిర్మాత రేచర్ల రుద్రిరెడ్డి, అతని భార్య, నాట్య గత్తెలు, వాద్యగాండ్రు, రతీమన్మధులు, అమృత మథనం, గోపికా వస్త్రాపహరణం, చక్కటి డిజైన్లు, రాతితో రకరకాల తాళ్లు, గొలుసులు, దండలూ .. ఆనాటి శిల్పుల ఉలులు నాట్యమాడిన తీరును తెలియజేస్తున్నాయి. దూలాలపైన కింద, పక్కలా గల దేవతా మూర్తుల్లో, శివ - కళ్యాణ సుందరమూర్తి, బ్రహ్మ, విష్ణువుల మధ్య నటరాజు, ఏకాదశ రుద్రులు, త్రిపుర సంహారమూర్తి, నందీశ్వర, అష్టదిక్పాలకులు, సప్తరుషులు, గజాసుర సంహారమూర్తి, సముద్ర మథనం తరువాత, అమృత కలశానికి అటూ ఇటూ దేవతలు, రామ రావణ యుద్ధం శిల్పశాస్త్రాలు పేర్కొన్న దేవతా ప్రతిమా లక్షణం కనువిందు చేస్తున్నాయి. నాట్య భంగిమలు, పురాణ, ఇతిహాసాలు, రామాయణ, భాగవత ఇతివృత్తాలు కళ్లకు కట్టినట్లు చెక్కారు. ప్రతి శిల్పం ఒక అద్భుతమే. అమృత మథనం, త్రిపురాసుర సంహారం, ధన్వంతరి శిల్పాలు కనువిందు చేస్తాయి. దూలాలపైన మూల రాళ్లపైన దిక్పాలకులు, మధ్యన నటరాజ శిల్పం చూపరుల దృష్టిని ఆకర్షిస్తాయి.


రూప లావణ్య శిల్ప కళ..

రామప్ప ఆలయాన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించుకుంటూ పోతే... వర్ణించడానికి రోజులు సరిపోవు. రాయడానికి పేజీలు చాలవు. ప్రతి శిల్పం మాట్లాడుతుంది. నాగిని - మదనిక శిల్పాలు రంగమండపం స్తంభాలు, దూలాల వుధ్యన ఏటవాలుగా, నల్ల శానపు రాళ్లతో చెక్కిన ఏనుగులపైనున్న యాళి - గజకేసరి (ఏనుగును ఎదుర్కొంటున్న సింహాన్ని పోలిన కల్పిత జంతువు) శిల్పాలు, నాగిని, మదనిక శిల్పాలు కాకతీయ శిల్పుల నైపుణ్యాన్ని పుణికి పుచ్చుకున్నాయి. చక్కటి అంగ సౌష్టవంతో, వొంపు సొంపులు, హొయలూ, వయ్యారాల కలబోతగా తీర్చిదిద్దిన అలనాటి సుందరీమణులు కాకతీయుల కాలం నాటి అందమైన యువతుల రూపలావణ్యానికి ప్రతిబింబాలు. ఆలయాన్నిచూడటానికి వచ్చే ఆధునిక అందగత్తెలకు ఒక సవాలుగా ఉన్నాయి మదనికా శిల్పాలు. ఇంకా నాట్య గత్తెలు, వాద్యగాళ్లుగా ఉన్న స్త్రీల సౌందర్యం వర్ణనాతీతం.తూర్పువైపు ద్వారానికి ఎడమవైపునున్న యువతి ఎత్తు మడమల చెప్పులతో ఫ్యాషన్లలో ఫ్రెంచి అందగత్తెల్ని తలదన్నే రీతిలో ఉంది. మరో యువతి ఒంటిపై జారిపోతున్న యంబ్రాయిడరీ అల్లికలు, అప్పటికీ కొంగొత్త డిజైన్లు అద్దుకున్న బట్టలతో అందమంతా తన సొంతమేనన్నట్టు ఆనందాన్ని వొలక బోస్తుంది. తలపై వెంట్రుకల అమరిక, చెవులకు అందమైన గుండ్రటి పెద్దసైజు దుద్దులు, నాజూకైన బంగారు నగలు, నాట్య భంగిమలు, ఆ సొగసు గత్తెల మాటేమోగానీ, చేయితిరిగిన శిల్పుల పనితనానికి నిదర్శనాలు. అంగాంగానికి పొందుపరచిన ఆభరణాలతో అప్సరసలను సైతం కవ్వించి, తమకు సాటిరారన్న గర్వంతో సవాళ్లు విసురుతూ, తెలంగాణ ప్రాంత యువతులు మొదటి నుంచీ, ఆధునిక నాగరికతలకు ప్రేమికులని రుజువు చేస్తున్నాయి.


అలుపెరుగని ఉలులు..

రామప్ప ఆలయంలో - గోడలు, స్తంభాలు, దూలాలే కాదు, ద్వారశాఖల్ని సైతం శిల్పాలతో నింపారు అనాటి శిల్పకళాకారులు. సహజసిద్ధమైన గ్రామీణ యువతులు వేటకెళ్లి పడుతున్న పాట్లు, అటూఇటూ రాతి కిటికీలపై మలచిన నాట్యగత్తెలు, వాద్యగాళ్ల బొమ్మలు, ఆనాటి నృత్యరీతులకు అద్దంపడుతూ, పేరిణి, ఆంధ్ర నాట్యాల పునఃసృష్టికర్త పద్మశ్రీ డా.నటరాజ రామకృష్ణ గారిని, కళాకృష్ణ గారిని, పేరిణి రమేష్‌ బృందాలను గుర్తు చేస్తున్నాయి. అక్కడ కూడా శృంగార శిల్పాలు, ఆలయాన్ని చూడటానికి వచ్చిన కుర్రకారును ఉర్రూతలూగిస్తూ, వాళ్ల మనసుల్లో మదన మానసోల్లాసాన్ని రేకెత్తిస్తున్నాయివి. చివరగా, శివుని వాహనమైన నందికి ఒక చూడచక్కటి మండపాన్ని కట్టారు. అందులో నేటి ఆధునిక నగల దుకాణాల్లో కూడా దొరకని అద్భుత ఆభరణాలను ఒంటినిండా అలంకరించుకొని సేదదీరుతూ, నెమరు వేస్తున్న నంది, నాజూకుకు నమూనా శిల్పామా అన్నట్లుంది. 


ఆధ్యాత్మిక ఆనందాన్నిచ్చే ఆలయాన్ని నిర్మించమన్న రేచర్ల రుద్రుని కోరికపై కాకతీయ శిల్పులు, తమ ఉలులు అలుపెరగని, అరమరికలు లేని ఆనంద డోళికలను తలపించే అపురూప శిల్పాల్ని కల్పించగలవని నిరూపించారు. రాబోయే తరాలకు ఒక రసరమ్య కావ్యాన్ని రాతిలో సృష్టించి అందించారు. ఆ శిల్పాల్లో ఆనాటి శిల్పులు ఒదిగిపోయారు. తెలుగువారి మదిలో శాశ్వతంగా నిలిచిపోయారు. 


రామప్ప దేవాలయంలో అందర్నీ ఆకర్షించేవి నాట్యశిల్పరీతులు. అప్పటి నాట్యభంగిమలు, అభినయ, నృత్యరీతులు దేవాలయ సందర్శకులను కట్టి పడేస్తాయి. సూక్ష్మంగా పరిశీలిస్తూపోతే కళ్లు తిప్పుకోలేని నాట్యశిల్ప కళ ఉందిక్కడ. కాకతీయులకు నాట్యరీతుల పట్ల ఉన్న అభిరుచిని తెలియజేస్తాయివి. ఆలయంలో మలిచిన నాట్య భంగిమలను ... జయాపసేనాని రాసిన నృత్య రత్నావళిలోని నాట్య సంప్రదాయాలను తులనాత్మక పరిశీలన చేసి, పరిశోధించారు డా.నటరాజ రామ కృష్ణ. ఈ విశేషాలను ప్రజలకు తెలియజేయడానికి 1985లో రామప్ప ఆలయ ప్రాంగణంలో పేరిణి నృత్యాన్ని ప్రదర్శించారు.


తెలంగాణలోని పాలంపేటలో రామప్ప దేవాలయంతో పాటు రేచర్ల రుద్రిరెడ్డి మరిన్ని కట్టడాలను నిర్మించి ఆలయాన్ని ఒక సముదాయంగా తీర్చిదిద్దాడు. వాటిలో కాటేశ్వరాలయం, కామేశ్వరాలయం, కళ్యాణ మండపం, ప్రాకారం, చెరువు కట్టపైన కొన్ని ఆలయాల్ని ఆయన, ఆ తరువాత తరం, కాకతీయ వాస్తు శైలిలో నిర్మించారు. కాటేశ్వరాలయాన్ని రుద్రసేనాని తన తండ్రి కాట్రెడ్డి పేర నిర్మించాడు. మెట్ల ద్వారం రెండు ఏనుగులతో చూడముచ్చటగా ఉంది. ఇక, రామప్ప దేవాలయానికి నైరుతి దిక్కులో నిర్మించిన కామేశ్వరాలయం కూడా అలనాటి శిల్ప కళా వైభవాన్ని చాటుతోంది. నైరుతి దిక్కులో వంద గజాల దూరంలో కట్టిన త్రికూటాలయంతో పాటు మరికొన్ని ఆలయాలు ఉన్నాయి. రామప్ప దేవాలయ సముదాయం మధ్య యుగపు రాజవంశ ఠీవి, నాటి వాస్తు శిల్ప కళ రమణీయతకు అద్దం పడుతున్నాయి.


- డా. ఈమని శివనాగిరెడ్డి, స్థపతి

ఫోన్‌ : 98485 98446

Updated Date - 2021-08-08T17:53:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising