స్కాట్లాండ్లో చరిత్ర సృష్టించిన పామ్ గోసల్.. ఎంఎస్పీగా ప్రమాణ స్వీకారం
ABN, First Publish Date - 2021-05-15T15:53:59+05:30
స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యురాలిగా భారత సంతతి మహిళ పామ్ గోసల్ గురువారం రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారానికి ముందు పామ్ గోసల్.. రెండు చేతులను జోడించి ప్రార్థనలు చే
న్యూఢిల్లీ: స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యురాలిగా భారత సంతతి మహిళ పామ్ గోసల్ గురువారం రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారానికి ముందు పామ్ గోసల్.. రెండు చేతులను జోడించి ప్రార్థనలు చేశారు. అనంతరం క్వీన్ ఎలిజబెత్‌కు విధేయత చూపిస్తూ స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యురాలి (ఎంఎస్పీ)గా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత సిక్కుల గ్రంథమైన గుట్కా సాహిబ్‌ను చేతుల్లోకి తీసుకుని కళ్లకు అద్దుకున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియోను పామ్ గోసల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా పామ్ గోసల్ చరిత్ర సృష్టించారు. వెస్ట్ స్కాట్లాండ్ నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరఫున గెలిచిన గోసల్.. మెంబర్ ఆఫ్ ది స్కాటిష్ పార్లమెంట్‌గా (ఎంఎస్పీ) ఎన్నికయ్యారు. 2019 జనరల్ ఎన్నికల్లో తొలిసారి ఈస్ట్ డన్‌బార్టన్‌షైర్ నుంచి స్కాటిష్ కన్జర్వేటివ్ అండ్ యూనియన్ పార్టీ తరఫున పార్లమెంటరీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమెకు స్కాట్లాండ్, యూకే రెండు దేశాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద రంగాలలో ఆర్థికాభివృద్ధి, అంతర్గత పెట్టుబడి, వ్యాపారం, సాంస్కృతిక, చట్టపరమైన మరియు నియంత్రణ విధానాలపై పనిచేసిన 30 సంవత్సరాల అనుభవం ఉంది. గోసల్ కన్స్యూమర్ లాలో ఎంబీఏ పట్టా పొందారు. ఆమెకు 2015లో ఉమెన్ లీడర్ బిజినెస్ అవార్డు, 2018లో పబ్లిక్ సర్వీస్ అవార్డు దక్కాయి.
Updated Date - 2021-05-15T15:53:59+05:30 IST