Canada లో మా వాళ్ల భద్రత మాటేంటి: భారత్
ABN, First Publish Date - 2021-09-10T18:41:36+05:30
ఉపాధి నిమిత్తం కెనడా వెళ్లిన భారత యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.
టోరంటో: ఉపాధి నిమిత్తం కెనడా వెళ్లిన భారత యువకుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పంజాబ్ రాష్ట్రం మొగాకు చెందిన 23 ఏళ్ల ప్రభజోత్ సింగ్ కత్రిని అతను నివాసముండే నోవా స్కాటియాలోని ట్రూరో నగరంలోని అపార్ట్‌మెంట్‌లో కొందరు గుర్తు తెలియని దుండగులు దారుణంగా కొట్టి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ట్రూరో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై కెనడాలోని భారత హైకమిషన్ స్పందించింది. ఇలాంటి ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయని పేర్కొంది. కెనడాలోని భారత పౌరులను జాతివివక్ష దాడులను నుంచి కాపాడాలని కోరింది. ముఖ్యంగా విద్యార్థులపై దాడులను తీవ్రంగా ఖండించింది. తాజాగా జరిగిన ఘటన నేపథ్యంలో భారతీయులకు రక్షణ కల్పించాలని తెలిపింది. జాతిపరంగా ప్రేరేపించబడిన నేరాల నుండి భారతీయులను రక్షించాలని కెనడా అధికారులను భారత హైకమిషన్ కోరింది.
ఇదిలాఉంటే.. కెనడాలోని భారత సమాజం మాత్రం ప్రభజోత్ సింగ్ కత్రిది కచ్చితంగా జాతివివక్ష హత్యేనని పేర్కొంది. విద్వేషపూరితంగానే దుండగులు దాడి చేసి మరీ చంపేశారని ఇండియన్ కమ్యూనిటీ మండిపడింది. ప్రభజోత్ సింగ్ కత్రి ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చూసుకునేవాడని అతని స్నేహితులు చెప్పారు. అందరీతో కలివిడిగా ఉండే సింగ్ ఇలా దారుణ హత్యకు గురికావడం తమను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. కాగా, ప్రభజోత్ సింగ్ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు భారత కమ్యూనిటీ.. 'గోఫండ్‌మీ' ద్వారా నిధులు సేకరిస్తోంది.
Updated Date - 2021-09-10T18:41:36+05:30 IST