సహనమే అత్యున్నతం
ABN, First Publish Date - 2021-08-27T06:10:33+05:30
కష్టాలు వచ్చినప్పుడు సహనం వహించడం, దైవ నిర్ణయాన్ని సంతోషంగా స్వీకరించడం.... వీటిని మించిన భాగ్యం ఈ లోకంలో లేదు.
కష్టాలు వచ్చినప్పుడు సహనం వహించడం, దైవ నిర్ణయాన్ని సంతోషంగా స్వీకరించడం.... వీటిని మించిన భాగ్యం ఈ లోకంలో లేదు. ఈ మహా భాగ్యం ఫలితంగా దైవదాసుని పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. పరలోకంలో అతనికి ఉన్నత స్థానం లభిస్తుంది. ఆ కష్టాలు, బాధలు మనిషి పాలిట దైవ కారుణ్యాన్ని వర్షింపజేయగలవు. ‘సముద్రాన్నయినా ఈదవచ్చు కానీ సంసారాన్ని ఈదలేం’ అనే నానుడి ఉంది. ఎందుకంటే... ధనికుడు కావచ్చు, నిరుపేద కావచ్చు, పెద్ద ఉద్యోగి కావచ్చు, చిరు ఉద్యోగి కావచ్చు... ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యలో మునిగి తేలుతూ ఉంటారు. కొందరికి వ్యాపారాలలో నష్టం రావడం, మరికొందరు కరువు కాటకాల వల్ల పడరాని పాట్లు పడడం, ఇంకొందరు భయంకరమైన వ్యాధులకు గురికావడం మనం అనునిత్యం చూస్తూనే ఉంటాం. లక్షాధికారులు సైతం సర్వస్వాన్నీ కోల్పోయి బికారులుగా మిగులుతారు. ఎంతో విలువైన ఆస్తులు కాలి బూడిదైపోతూ ఉంటాయి. భూకంపాలు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు మనుషులను మరింత కుంగదీస్తాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా దిగులు పడిపోతాం. అటువంటి స్థితి కలిగినందుకు మన దురదృష్టాన్ని నిందించుకుంటాం. దేవుడు తనకు ఎందుకు ఇలాంటి శిక్ష విధించాడని ఆవేదనతో కుమిలిపోతాం.
సరైన ధార్మిక పరిజ్ఞానం లేకపోవడం వల్లనే ఇలాంటి భావాలు కలుగుతాయి. మన ప్రభువు, సృష్టికర్త అయిన దైవం అనంత దయామయుడు. గొప్ప కారుణ్యమూర్తి. తన కారుణ్యం ప్రతి వస్తువునూ ఆవరించి ఉందని దివ్య ఖుర్‌ఆన్‌లో ఆయన స్వయంగా పేర్కొన్నాడు. ‘‘కష్టాలు వచ్చినప్పుడు సహనం పాటించాలి. ఏ వ్యక్తి సహనం వహించాడో, క్షమాగుణంతో ప్రవర్తించాడో... అతను చేసిన ఆ పని అత్యున్నతస్థాయికి చెందిన కార్యం అవుతుంది’’ అని తెలియజేశాడు.
‘‘ప్రవక్తా! నమ్రత, అణకువలతో నడుచుకొనేవారికి శుభవార్త వినిపించు. దేవుడి ప్రసక్తి రాగానే వారి హృదయాలు కంపించిపోతాయి. కష్టాలు వచ్చినప్పుడు వారు సహనం వహిస్తారు. నమాజ్‌ను స్థాపిస్తారు. మేము ప్రసాదించిన ఉపాధి నుంచి (మా మార్గంలో) ఖర్చుపెడతారు’’. (దివ్య ఖుర్‌ఆన్)
సుఖ సంతోషాలు కలిగినప్పుడు విశ్వాసి దైవానికి కృతజ్ఞతలు తెలుపుకొంటాడు. మరింత ఉత్సాహంతో కొనసాగుతాడు. ఆపదలు వచ్చి పడినా ఏమాత్రం ధైర్యాన్ని విడవకుండా, నిగ్రహాన్ని పాటిస్తాడు. ఆ నిగ్రహానికి పారితోషికాన్ని అల్లాహ్ తప్పకుండా ఇస్తాడు. పరలోక జీవిత సాఫల్యం కోసం పుణ్యాన్ని సంపాదించడం కోసం నిర్దేశించిన ప్రధాన క్షేత్రం ఈ ప్రపంచం అని విశ్వాసి భావిస్తాడు. అంతేతప్ప భోగభాగ్యాలు అనుభవించే స్వర్గధామం అని కానీ, కష్టనష్టాలు భరించే నరకకూపం అని కానీ భావించడు. అతడి దృష్టిలో కష్టసుఖాలు రెండూ సమానమే. సుఖ సంతోషాలు వచ్చినా, ఆపదలు, కష్టాలు ఎదురైనా అవన్నీ దేవుడి అభీష్టం మేరకే జరుగుతాయనీ, దేవుడి ఆజ్ఞ ప్రకారమే అన్నీ నడుస్తాయనీ, ఏదో ఒక రోజు దేవుడి సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుందని విశ్వాసి గట్టిగా నమ్ముతాడు.
మనం చేసే ప్రతి పనినీ దేవుడు అనుక్షణం గమనిస్తున్నాడు. కష్టాలు భరించే శక్తి మనలో ఉందా? లేదా? అనేది ఆయనకు బాగా తెలుసు. మనం భరించలేని కష్టాలను దైవం మనమీద ఎన్నటికీ మోపడు. కష్టాలు వచ్చినప్పుడు సహనంతో ప్రవర్తించిన వారికి స్వర్గంలో శాశ్వత సౌఖ్యాలను ప్రసాదిస్తాడు. ఎవరు సహన గుణాన్ని అలవరచుకోవాలనుకుంటారో వారికి అల్లాహ్ సహనాన్ని ప్రసాదిస్తాడు. ‘‘సహనం కన్నా మేలైన, ఇతోధికంగా మేలు చేకూర్చే మరో దైవ వరం లేనే లేదు’’ అని మహా ప్రవక్త మహమ్మద్ ఉపదేశించారు.
అల్లా్‌హపై అచంచలమైన విశ్వాసం ఉంటే తప్ప సహనగుణాన్ని దైవ దాసుడు అలవరచుకోలేడు. సహనం ఉంటే మరెన్నో ఉత్తమ గుణాలు అలవడతాయి. మానసిక వ్యధ, అనారోగ్యం కలిగినా, కష్టాలు ఎదురైనా సహనంతో వ్యవహరించినవారి తప్పులను అల్లాహ్ మన్నిస్తాడు. చివరకు అతని కాలిలో ముల్లు గుచ్చుకున్నా... అది అతని పాప విమోచనకు కారణమవుతుంది.
మహమ్మద్ వహీదుద్దీన్
Updated Date - 2021-08-27T06:10:33+05:30 IST